logo

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు.

Published : 17 Apr 2024 02:29 IST

అరకులోయ, అనంతగిరి, న్యూస్‌టుడే: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థిని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావు ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక ఐటీఐ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ అరుకు వరకు సాగింది. అరకులోయలో స్థానిక గిరి మహిళలు వీరికి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అతికించుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుందని ఆరోపించారు. జీవో నంబర్‌ 3 పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. అనంతగిరి మండలంలోని మైనింగ్‌ను వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ మాధవి సేవలు అవసరం లేదని వైకాపా వారే చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫాల్గుణ పనికిరారని వైకాపా అధిష్ఠానం గుర్తించిందని, మరి ఆయన కోడలు తనూజారాణికి ఎంపీ టికెట్‌ ఎలా ఇచ్చారన్నారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ.. ప్రజలంతా కూటమి పక్షానే ఉన్నారన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క గిరిజనుడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, భాజపా నాయకులు రాంచందర్‌, ఉమామహేశ్వరరావు, తెదేపా నాయకులు బూర్జ లక్ష్మి, ద్రౌపది, సుబ్బారావు, బాకూరి వెంకటరమణ, వంతల నాగేశ్వరరావు, దన్నేరావు, సాయిరాం, పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

కూటమి విజయానికి ప్రజలంతా సహకరించాలని కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. మన్యం పర్యటనకు వచ్చిన ఆమెకు కాశీపట్నం, డముకు గ్రామాల్లో మహిళలు, స్థానిక యువత హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ములియగుడలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాజారావుతో కలిసి స్థానికులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని