logo

బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!

జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం.

Updated : 24 Apr 2024 05:04 IST

జగన్‌ని నమ్మితే అప్పులపాలే 
నిధుల విడుదలలో తీవ్ర జాప్యం
విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం

జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో మాదిరిగా ‘ ఫీజులు ఇంతే కడతాం. ఇంతకంటే ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి. మీ చావు మీరు చావండి’ అనే విధానానికి స్వస్తి పలికాం. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు జమ చేస్తున్నాం.

‘విద్యా దీవెన’ గురించి సీఎం జగన్‌ గొప్పలు

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. వారందరినీ జగన్‌ నట్టేట ముంచారు. అయిదేళ్లుగా సమయానికి నిధులు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు ఫీజులు చెల్లించకుంటే పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. తమ పిల్లల చదువుకు ఆటంకాలు ఎదురవుతాయని తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. దీంతో దొరికిన చోట అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి పిల్లల ఫీజులు చెల్లించారు. వైకాపా ప్రభుత్వ ‘ఫ్యూజు’పీకేస్తేనే పరిస్థితి గాడిన పడుతుందని పలువురు చెబుతున్నారు.

బటన్‌ నొక్కినా రాని నిధులు

ఒక విద్యా సంవత్సరానికి నాలుగు విడతలుగా విద్యా దీవెన నిధులు విడుదల చేస్తారు. 2023-24 సంవత్సరంలో అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన నిధుల విడుదలకు మార్చి 1న సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. కానీ ఇప్పటికీ తల్లుల ఖాతాలకు జమ కాలేదు. ఆ త్రైమాసికానికి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 44,177 మంది విద్యార్థులను అర్హులుగా తేల్చారు. వారికి మొత్తం రూ.34.72 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇంకా మూడు విడతలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈలోగా పరీక్షలు రావడంతో చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజులు చెల్లించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఇప్పట్లో నిధులు విడుదల చేసే అవకాశం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

వాస్తవం

నగరానికి చెందిన ఓ విద్యార్థిని ఒక ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్‌ చివరి ఏడాది చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. రూ.25 వేల ఫీజు బకాయి చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామని యాజమాన్యం తేల్చిచెప్పింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా చెల్లిస్తామని వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కుమార్తె వేదన చూడలేని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు వారాల్లో రూ.12 వేలు చెల్లిస్తానని తల్లి నుంచి హామీ పత్రం తీసుకుని విద్యార్థినికి హాల్‌టికెట్‌ అందించారు.

రూ.35 వేలు చెల్లించా: మా అబ్బాయి పీఎం పాలెంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. ఫీజు చెల్లించకుంటే పరీక్షలు రాయడం కుదరదని కళాశాల యాజమాన్యం హెచ్చరించింది. దీంతో మొత్తం రూ.35 వేలు చెల్లించా.

- అన్నాజీ, ప్రైవేటు ఉద్యోగి


కొలువులకు దూరం..

తెదేపా హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసేవారు. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్యే ఫీజుల వ్యవహారం కొనసాగేది. ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిడి లేకుండా విద్యార్థులు చదువు పూర్తిచేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని మార్చేసి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మధ్యలోకి లాగారు. విధానాలు మార్చడంపై పెట్టిన దృష్టి నిధుల విడుదలపై లేకపోయింది. అయిదేళ్లలో ఒక్కసారి కూడా చెప్పిన సమయానికి నిధులు విడుదల చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదువు పూర్తయిన విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. కొందరు అప్పు చేసి చెల్లిస్తుండగా.. మరికొందరు ధ్రువపత్రాలు తీసుకోలేదు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినా వెళ్లలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని