logo

నడి రోడ్డుపై చితి మంటలు

ఆ రెండు వాహనాలవి వేర్వేరు మార్గాలు, గమ్యాలు. జాతీయ రహదారి డివైడర్‌కు చెరో వైపున వెళ్తున్నాయి.

Published : 03 Dec 2022 04:52 IST

లారీలు దగ్ధమైన ఘటనలో అంతులేని విషాదం

ప్రత్తిపాడు(కాకినాడ జిల్లా) : ఆ రెండు వాహనాలవి వేర్వేరు మార్గాలు, గమ్యాలు. జాతీయ రహదారి డివైడర్‌కు చెరో వైపున వెళ్తున్నాయి. నడి రోడ్డుపై లావా ప్రవహించిన తీరుగా ఓ ప్రమాదం ఆ రెండు వాహనాలనూ ఉన్నపళంగా మండించింది. బతుకు పోరాటంలోని నలుగురు సగటు జీవులకు రహదారిపైనే చితిమంట పెట్టింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి పెను సంచలనమైంది. . అనకాపల్లిలోని కోల్డు స్టోరేజీ నుంచి భీమవరం అశ్విని ఫిషరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు రొయ్యలను తీసుకెళ్తున్న కంటైనరును కడియం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఇసుకలారీ ఢీకొంది. రెండు వాహనాల క్యాబిన్‌లను మంటలు చుట్టుముట్టాయి. కంటైనరు చోదకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్‌కుమార్‌ రాధేశ్యామ్‌ యాదవ్‌ (27), అందులో ఉన్న భీమవరం జిల్లా యనమదుర్రుకు చెందిన ఫిషరీస్‌ సూపర్‌వైజర్‌ కాలి పెద్దిరాజు(45), ఇసుక లారీ చోదకుడు కృష్ణాజిల్లా కోడూరుకు చెందిన జన్ను శ్రీను(45), ఇదే వాహనంలో మరో వివరాలు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యారు.ఎస్సై సుధాకర్‌ బృందం ప్రత్తిపాడు, జగ్గంపేట అగ్నిమాపక యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మంటలు అదుపు చేసినా అందులోని మనుషులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. చివరకు కాలిపోగా మిగిలిన మృతదేహాలే లభ్యమయ్యాయి. డ్రైవరు, క్లీనరు సీట్లలో దొరికిన ఈ అవశేషాలను బట్టి వివరాలు సేకరించినా.. డ్రైవరు కాకుండా ఇసుకలారీలో మరో వ్యక్తి ఎవరనేది తెలియరాలేదని ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

మిన్నంటిన రోదనలు..

ప్రమాదంలో నలుగురు సజీవ దహనంతో ఆ కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి. ఇసుకలారీ చోదకుడు జన్ను శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యతను ఇప్పుడు ఎవరు చూస్తారని అతడి బంధువులు రోదిస్తున్నారు. కడచూపునకూ నోచుకోకుండా ప్రమాదం జరగడం విధి చిన్నచూపేనని వాపోయారు. శ్రీను కుటుంబం మూడేళ్ల కిందట గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్నారని కోడూరు వాసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని