logo

పంటల్లో సస్యరక్షణ చర్యలు

మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, మినుము, చెరకు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో వర్షం నీరు చేరింది.

Published : 20 Mar 2023 06:11 IST

ఘంటసాల, న్యూస్‌టుడే

ఘంటసాలపాలెంలో మొక్కజొన్న పొలంలో నిలిచిన వర్షం నీటిని పరిశీలిస్తున్న కేవీకే శాస్త్రవేత్తల బృందం

మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, మినుము, చెరకు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లో వర్షం నీరు చేరింది. పంట పొలాల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పి.శ్రీలత, సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త కె.రేవతి వివరించారు.

మినుము పంట: మినుము పంటలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చిన్న బోదులను ఏర్పాటు చేసుకొని నీటిని బయటకు తీయాలి. నూర్పిడి పూర్తయిన మినుము విత్తనాలను ఆరబెట్టుకోవాలి. మినుము గింజలకు బూజు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనాలను కుప్పలుగా వేసి పరదాలు కప్పుకొని కాపాడుకోవాలి.

చెరకు : ముందుగా చెరకు పొలంలోని మురుగు నీటిని తీసివేయాలి. వర్షాలు తగ్గిన తరువాత అదనంగా 15 కిలోలు చొప్పున యూరియా, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను పైపాటుగా వేసుకోవాలి.

కూరగాయ పంటలు: పలు రకాల కూరగాయ పంట పొలాల్లో చేరిన వాన నీటిని చిన్న కాలువల ద్వారా బయటకు తొలగించాలి. అధిక వర్షాల కారణంగా మిరప, టమాట పంటల్లో బాక్టీరియా, ఆకుమచ్చ తెగులు ఆశించే ఆస్కారం ఉన్నందున నివారణకు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 30 గ్రాములు, ప్లాంటమైసిన్‌ 1 గ్రాము చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అధిక తేమ వలన పంట మీద గల కాయలకు ఆశించే కాయకుళ్లు తెగులు నివారణకు ముందుజాగ్రత్తగా మాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఉద్ధృతిని నివారించడానికి ప్రోపికొనజోల్‌ 1.0 మి.లీ. లేదా డైఫెన్‌కొనజోల్‌ 0.5 మి.లీ. లేదా అజాక్సిస్ట్రోలిన్‌ 1.0 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పండ్ల తోటలు: పలు రకాల పండ్ల తోటల్లో అధిక వర్షాలకు నిల్వ ఉన్న నీటిని తీసివేయాలి. లేత తోటల్లో చనిపోయిన మొక్కలను తొలగించి కొత్తవి నాటుకోవాలి. అధిక గాలులకు ఒరిగిపోయిన చెట్ల మొదళ్లకు మట్టిని ఎగదోసి వేర్లను కప్పి కర్రలతో ఊతమివ్వాలి. విరిగిన కొమ్మలను కత్తిరించి ఆ భాగంలో బోర్డో మిశ్రమం(కాపర్‌ సల్ఫేట్‌ 1 కిలో, సున్నం 1 కిలో, 10 లీటర్లు నీళ్లు) కలిపి పూయాలి. చెట్ల మొదలు దగ్గర ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లేదా కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ 3 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పోయాలి. పలు రకాల పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని