logo

తోడేళ్ల రాజ్యం

కృష్ణా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి జేపీ పేరుతో అప్పగించగా.. ఆయన నష్టం వస్తుందని వదిలేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన ప్రజాప్రతినిధుల సోదరులు, మరో ప్రజాప్రతినిధి వియ్యంకుడు, కింది వైపున ఓ మంత్రి, ప్రజాప్రతినిధి సోదరుడు ఇష్టానుసారం కొల్లగొట్టారు.

Updated : 17 Apr 2024 05:44 IST

ప్రజాప్రతినిధులే ఇసుకాసురులు
నాలుగేళ్లలో రూ. వేల కోట్లు తోడేశారు
ఈనాడు, అమరావతి

కృష్ణా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి జేపీ పేరుతో అప్పగించగా.. ఆయన నష్టం వస్తుందని వదిలేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన ప్రజాప్రతినిధుల సోదరులు, మరో ప్రజాప్రతినిధి వియ్యంకుడు, కింది వైపున ఓ మంత్రి, ప్రజాప్రతినిధి సోదరుడు ఇష్టానుసారం కొల్లగొట్టారు. ఇటీవల జేసీకేసీ సంస్థకు అప్పగించారు. ఆపేరుతోనూ నేతలదే హవా.

మోగులూరు వద్ద పొలాల్లో నిల్వ చేసిన ఇసుక డంప్‌లు

‘‘నిబంధనలు పట్టవు.. అనుమతులు ఉండవు.. ప్రజల బాధలు పట్టించుకోరు.. భూగర్భ జలాల ప్రమాద ఘంటికలూ చూడరు. అధికారులు ప్రశ్నిస్తే.. బదిలీ వేటే. స్థానికులు నిలదీస్తే.. దాడులే. వారి లక్ష్యం అక్రమార్జన. అందినకాడికి దోచుకోవడం. సహజ వనరులు కొల్లగొట్టడం. పేరుకే దస్త్రాల్లో అనుమతులు.. అధికారులంతా అధికారపార్టీ పక్షం. ఇంకేం అడ్డూ అదుపూ లేదు. ఇష్టానుసారం తవ్వుడే. అదీ ఎవరు పడితే వారు తవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వ పెద్దల అండ ఉంటేనే తవ్వాలి. కనీస అర్హత ఎమ్మెల్యే లేదా మంత్రి.. ఆపైనే. వీరే కృష్ణా నదికి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. సామంతుల తరహాలో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధుల అనుచరులదే దందా. ప్రతిపక్షం ఫిర్యాదులూ బుట్టదాఖలే. దారుణంపై సామాజిక వేత్తలు ఎన్జీటీ, హైకోర్టులకు వెళ్లినా.. ప్చ్‌. ఎన్జీటీ ఆదేశాలు బుట్టదాఖలే. హైకోర్టునూ పక్కదారి పట్టించిన ఘనులు. ఒకచోట తవ్వితే మరోచోట పరిశీలించి.. ‘అబ్బే అంతా సవ్యమని’ నివేదించారు. కోడ్‌ వచ్చినా.. తవ్వకాలు ఆగలేదు. గనుల శాఖ గంతలు తీయదు. సెబ్‌ కాలు కదపదు. కలెక్టర్లు నోరు మెదపని అరాచక రాజ్యంలో ఇసుకాసురుల భోజ్యమిది.’’

చోడవరం రీచ్‌లో ఇసుక తవ్వకాలు (పాతచిత్రం)

తవ్వుకో.. తోలుకో...!

గత నాలుగేళ్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.వేల కోట్ల ఇసుక కొల్లగొట్టారు. హైదరాబాద్‌కు ఎక్కువ శాతం ఇసుక కృష్ణా నది నుంచే వెళుతోంది. కృష్ణా నదిలో నాణ్యమైన ఇసుక ఉండటంతో ఇసుకాసురులు నదిని చెరబట్టారు. అనుమతులు లేకనే తవ్వేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏడాదిపాటు ఇసుక తవ్వకాలు ఆపేసి భవన నిర్మాణ కార్మికుల కడుపు మాడ్చారు. తర్వాత జేపీ వెంచెర్స్‌ పేరుతో తవ్వారు. పర్యావరణ అనుమతులు లేకుండా కొన్ని రేవులు నిర్వహించారు. ఆ సంస్థ మాటున ప్రజాప్రతినిధులు కాంట్రాక్టు తీసుకుని భారీగా తవ్వేశారు.

మున్నలూరు వద్ద పరిమితికి మించి ఇసుకను టిప్పర్లలో తీసుకెళ్తూ..


అరాచకం...

  • ప్రకాశం బ్యారేజీ దిగువన అధికారులు దాదాపు 15 రేవులు గుర్తించారు. వీటికి పర్యావరణ అనుమతులు (ఈసీ) వచ్చినట్లు చెబుతున్నారు. కానీ కేవలం దరఖాస్తు మాత్రమే చేశారు. వీటిని పూర్వ కలెక్టర్‌ రాజాబాబు పరిశీలించారు. ఆయన తోట్లవల్లూరులో నార్త్‌వల్లూరు 1, 2, 3 రేవులు పరిశీలించారు. వాస్తవానికి పక్కనే రొయ్యూరు, మద్దూరు, చోడవరంలలో తవ్వేస్తున్నా.. వాటిని చూడలేదు. ప్రస్తుతం చోడవరం, యనమలకుదురు, రొయ్యూరు, శ్రీకాకుళం, లంకపల్లి రేవుల్లో తెగ తోడేస్తున్నారు. ఇటీవల మద్దూరులో తెదేపా నాయకులు అడ్డుకున్నారు. చోడవరంలో అడ్డుకున్నా.. ఆగలేదు. రొయ్యూరు రేవు వద్ద గురువారం మధ్యాహ్నం తర్వాత ఆపేశారు. రొయ్యూరులో మంత్రి అనుచరులు ప్రైవేటు భూములు ఆక్రమించి తోడేస్తున్నారు. పెనమలూరులో రోజుకు రూ.25 లక్షల చొప్పున నేతకు ఇవ్వాలని ఆదేశాలు.

  • పామర్రులో ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో ఇష్టారీతిన తవ్వుతున్నారు. భారీ యంత్రాలను కృష్ణా నదిలో దించి టిప్పర్లకు ఎత్తుతున్నారు. నేరుగా హైదరాబాద్‌ తరలిస్తున్నారు. అధికారులు అడిగితే ప్రభుత్వ అవసరాలని చెబుతున్నారు. అవనిగడ్డలో ఓ ప్రజాప్రతినిధి తన సొంత ఆస్తిలా నెలకు చెప్పిన లీజు చెల్లించే గుత్తేదారులకు ఇచ్చేశారు. నెలకు రూ.కోటి చొప్పున ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అనుమతులు ఉండవంతే..

కనీసం పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వేస్తున్నారు. గతంలో పాత గుత్తేదారు పేరుతో తోడేసిన నేతలు ప్రస్తుతం జీసీకేసీ సంస్థ పేరుతో తవ్వుతున్నారు. న్యాయస్థానంలో కేసులు దాఖలైనా ఖాతరు చేయడం లేదు. ప్రైవేటు సైన్యాన్ని మోహరించి తవ్వడమే కాక ధరలు పెంచేశారు. ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదని దాదాగిరి చెలాయిస్తున్నారు. పెంచిన ధరలకు రశీదులు ఇవ్వడం లేదు. నాలుగు నెలల కిందట టెండర్లు ఖరారు చేసి జీసీకేసీ సంస్థకు అప్పగించినా.. పర్యావరణ అనుమతులు లేవు. రేవుల వద్ద హద్దులు నిర్ణయించలేదు. నిర్వహణ, ఎస్టాబ్లిష్‌మెంట్‌ అనుమతీ లేదు. అయినా గత ఏడాది నవంబరు నుంచి తోడేస్తున్నారు. చెల్లని వేబిల్లులు ఇచ్చినా కేసులు లేవు. పెనమలూరులో ఓ మంత్రి అనుచరులు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా తవ్వేసుకుంటున్నారు.


మొత్తం హైదరాబాద్‌కే..

ఇంత తవ్వుతున్నా స్థానిక నిర్మాణదారులకు ఇసుక లభిస్తుందా అంటే అదీ అనుమానమే. మొత్తం హైదరాబాద్‌కే తరలిస్తున్నారు. ఇక్కడి కంటే అక్కడ టిప్పరు ఇసుక రూ.లక్ష పైగా డిమాండ్‌ ఉండడంతో అక్కడికే తరలిస్తున్నారు. రవాణా అధికారులు సైతం తమ వంతు సహాయం అందిస్తున్నారు.

చెవిటికల్లు రీచ్‌లో ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేసి నిర్మించిన రహదారి -న్యూస్‌టుడే, కంచికచర్ల

పెనమలూరు: చోడవరం వద్ద కృష్ణానదిలో పది అడుగుల లోతు ఇసుక తవ్వేయడంతో పడిన గుంతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని