logo

అంటకాగితే.. అంతే రాణా..!

అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది.

Updated : 24 Apr 2024 08:35 IST

సీపీ కాంతి రాణాపై ఎన్నికల కమిషన్‌ వేటు
ప్రతిపక్షాలను అకారణంగా వేధించి కేసులు
వైకాపా దౌర్జన్యాలకు పరోక్షంగా సహకారం
ఈనాడు, అమరావతి

ధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు, దాడులకు తెగబడినా వారిని వదిలేసి.. బాధితులపైనే కేసులు పెట్టడం, తెదేపాలో క్రియాశీలక నేతలే లక్ష్యంగా వేధింపులకు దిగారనే ఆరోపణలు కాంతిరాణాపై కోకొల్లలు. చివరికి ఎన్నికల కోడ్‌ వచ్చినా.. ఆయన తీరు మారలేదు. ఇప్పటికీ దాడులకు తెగబడుతున్న అధికార వైకాపా మూకలకే వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్షాలు ధ్వజమెత్తినా తీరుమారలేదు.  

నవ్విపోదురుగాక నాకేటి...: ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా ఏడాదిన్నర కిందట నందిగామలో తెదేపా అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో బాబు తప్పించుకోగా, ఆయన భద్రతాధికారికి గాయమైంది. దీనిపై పోలీసులు తేలికపాటి 324 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

తాజాగా విజయవాడలో సీఎం జగన్‌పై గులకరాయి దాడి ఘటనలో అసలైన నిందితులను వదిలేసి.. వెలంపల్లి శ్రీనివాస్‌ ఆదేశాలతో.. తెదేపా నేత బొండా ఉమాను ఇరికించేందుకు.. సీపీ తీవ్రంగా ప్రయత్నించారనే విమర్శలున్నాయి. ఒక పథకం ప్రకారం.. తెదేపా నాయకుడు దుర్గారావును బలవంతంగా అదుపులోకి తీసుకోవడం.. ఉమా పేరు చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చిన వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇవన్నీ సీపీ పర్యవేక్షణలోనే జరిగాయనే ఆరోపణలున్నాయి. సరికదా.. బాబుపై దాడి ఘటన వేళా సీపీగా ఉన్నది రాణానే. అదే సీపీ జగన్‌పై గులకరాయి దాడి కేసులో మాత్రం ఏకంగా హత్యాయత్నం సెక్షన్లను చేర్చి స్వామిభక్తిని ప్రదర్శించారు.


కళ్లుండీ చూడలేకపోయారే..

తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతల దాడి కేసులో పోలీసుల పాత్ర అనేక ఆరోపణలకు తావిచ్చింది. ఆయన కంటికి తీవ్ర గాయమై, చూపుపోయినా.. కేసు నమోదు నుంచి రిమాండ్‌ వరకు.. ప్రతి దశలోనూ జాప్యం చేయడం, పరోక్షంగా నిందితులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుల రిమాండుకు సంబంధించి పకడ్బందీగా వ్యవహరించడంలో విఫలమయ్యారు. హత్యాయత్నం చేశారని గాంధీ ఫిర్యాదు చేసినా సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేయలేదు. ఘటన జరిగిన తర్వాత చాలా రోజులకు నిందితులను అరెస్టు చేశారు. ఇందులోనూ కీలకమైన వైకాపా నేతను తప్పించారు. అధికార పార్టీ నేతలు కావడంతో తేలికపాటి సెక్షన్ల కింద కేసు కట్టారు. సెక్షన్‌ 326 కింద కేసు నమోదు చేసినప్పుడు గాయం తీవ్రతను తెలిపే నివేదికను తప్పనిసరిగా న్యాయమూర్తికి సమర్పించాలి. ఇది లేకుండానే రిమాండ్‌ రిపోర్టును తయారు చేసి కోర్టులో పెట్టడంతో నిందితులు జైలుకు వెళ్లకుండా బయటకు వచ్చేందుకు పరోక్షంగా పోలీసులు సహకారం అందించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. చేతితో కొట్టడం వల్లనే గాంధీ కంటిపై గాయమైందని ఏకంగా సీపీ ప్రకటించడం పక్షపాతానికి నిదర్శనం.


కోడ్‌ అమల్లోకి వచ్చినా మారని తీరు

న్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా జిల్లాలో పలువురు పోలీసులు అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం లేదు. వారి ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. వైకాపా మూక చేసే అరాచకాలను చూసీచూడనట్లు పోతున్నారు. రాజకీయ పరమైన దాడులకు సంబంధిత ఎస్పీలు, సీపీలే బాధ్యత వహించాలని ఈసీ స్పష్టంగా చెప్పినా కాంతి రాణా తీరు మారలేదు. ప్రశ్నించే వారిపై వైకాపా నేతలు కర్రలు, రాళ్లు, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల చర్యలు బాధితుల్లో భరోసాను నింపలేకపోయాయి. తెదేపా, జనసేన పార్టీల నేతలు, వారి సానుభూతిపరులపై దాడులకు తెగబడుతూ వైకాపా మూకలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో సీపీ విఫలమయ్యారు.


ఇది కాదా.. పక్షపాతం

నందిగామలో కిశోర్‌, నరసింహారావులపై అకారణంగా రాడ్లు, పైపులతో వైకాపా మూక దాడి చేసి, చావబాదినా పోలీసుల స్పందన అంతంతే.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నందుకు.. ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ అనుచరులు రెచ్చిపోయి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కిశోర్‌ తలకు తీవ్ర గాయమైంది. అయినా నందిగామ పోలీసులు నామమాత్రంగా బెయిలబుల్‌ సెక్షన్‌ అయిన 324 కింద కేసు కట్టారు. తెదేపా సానుభూతిపరులపైన దాడి చేసిన వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధితులపైనా కేసు పెట్టారు. తమకు గాయాలయ్యాయనీ, నిందితులు ఆసుపత్రిలో చేరి ఫిర్యాదు ఇవ్వడంతోనే కేసు కట్టారు. ఉల్టా కేసు పెట్టడం ఖాకీల పక్షపాత వైఖరికి తార్కాణంగా నిలుస్తోంది.


ప్రతిపక్షాలపై జులుం

విజయవాడలో ఇటీవల ఆర్యవైశ్య సభలో గొడవ సృష్టించిన వైకాపాకు చెందిన కొండపల్లి బుజ్జి తదితరులను వదిలేసి, ఇదేంటని ప్రశ్నించిన తెదేపా నేత డూండీ రాకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేష్‌పై ఏకంగా కేసు కూడా పెట్టేందుకు ప్రయత్నించగా.. ఆర్యవైశ్య నాయకులు అడ్డుకున్నారు. గొడవ చేసిన వారిని వదిలేసి.. ప్రతిపక్షాలపై పోలీసుల ప్రతాపం ఏంటని నిలదీయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. వెలంపల్లికి పోలీసుల వత్తాసుపై తెదేపా నేతలు మండిపడ్డారు.


ఆర్ధిక నేరాలకు అండదండ...

2022లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంకల్ప్‌ సిద్ధి మార్ట్‌ కుంభకోణంలో మోసానికి సంబంధించిన వ్యవహారంలో పోలీసుల పాత్రపై అనేక ఆరోపణలు వచ్చాయి. రూ.కోట్ల కుంభకోణంలో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ సంస్థలో నిర్వాహకుల పాత్ర నామమాత్రమే అనీ, తెరవెనుక వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ప్రచారం సాగింది. వీరి సన్నిహితులే వెనక ఉండి ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించినట్లు తెలిసింది. కుంభకోణంపై విజయవాడలో సైబర్‌ క్రైమ్‌, పటమట, ఎస్‌ఆర్‌ పేట, గవర్నర్‌పేట, సత్యనారాయణపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, గుంటూరు నగరంలో లాలాపేట స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు అంతా పక్కదారి పట్టి.. చివరకు పోలీసులు వేసిన తొలి ఛార్జిషీట్‌లో కేవలం రూ.97.56 కోట్లు మోసం జరిగినట్లు చూపారు. వైకాపా నేతలను తప్పించేశారు.


రోడ్డెక్కితే గానీ కేసు కట్టలేదు..

వైకాపా కార్మిక సంఘం జెండావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ నేతలు కోడ్‌ను ఉల్లంఘించారు. ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా ఎన్నికల అధికారులతోనూ వాగ్వాదానికి దిగారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేయాల్సిందిపోయి.. రాత్రి వరకూ మీనమేషాలు లెక్కించారు. పరిస్థితి మరింత వివాదంగా మారడంతో ఎట్టకేలకు రాత్రి 10 గంటల తర్వాత కేసు నమోదు చేశారు.


వైకాపా నేతలు చెప్పినట్లే కేసులా?

విజయవాడ రాణిగారితోటలో వైకాపా నేత దేవినేని అవినాష్‌తో తన సమస్యలను చెప్పుకొని బాధపడిన ముస్లిం మైనార్టీకి చెందిన ఒంటరి మహిళ రమీజాపై.. మరుసటి రోజు ఉదయాన్నే వైకాపా శ్రేణులు మూకుమ్మడిగా తెగబడ్డాయి. 15 మంది మహిళలు, ఐదుగురు పురుషులు కలిసి రాళ్లు, కారం ప్యాకెట్లను తీసుకొచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను వదిలేసి.. బాధితులపైనే కేసులు నమోదు చేశారు. బాధితురాలికి చెందిన 15 మందిపై కేసులు పెట్టారు. తన ఇంటిపైకి వచ్చి మరీ వైకాపా శ్రేణులు దాడి చేశాయని బాధితురాలు రమీజా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దానిపై అసలు కేసే నమోదు చేయలేదు. వైకాపా కార్యకర్తల ఫిర్యాదు మేరకు బాధితులనే స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితులపై 341, 324, 506 ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని