logo
Published : 27 Jun 2022 06:02 IST

అర్హులకు దరిచేరని నేతన్న నేస్తం

అనంతపురం(కమలానగర్‌), న్యూస్‌టుడే : వారం రోజులపాటు రెక్కలుముక్కలు చేసుకుని నేసిన చీరకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం ముడిసరకుల ధరలు పెంచి చేనేతలపై మరింత భారం మోపింది. చేనేత వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకం అందక చేనేత జీవనం భారంగా మారడంతో వృత్తిని వదిలి కూలీ పనులకుపోతున్నవారు కొందరైతే.. మరికొందరు సుదూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. నేతన్న నేస్తం పథకంలో ఇంకా 5 వేల మంది అర్హులకు న్యాయం జరగలేదు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ద్వితీయ స్థానంలో ఉంది. 70 వేలమంది చేనేత కార్మికులకు వృత్తిపై ఆధారపడ్డారు. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం 40 వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. ధర్మవరం, హిందూపురం, మడకశిర, అనంత గ్రామీణం సిండికేట్‌నగర్‌, ఉరవకొండ, తాడిపత్రి, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల ప్రాంతాల్లో అధిక శాతం చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వం జులైలో నేతన్న నేస్తం పథకంలో అర్హులైన జాబితాను విడుదల చేసి, నిధులు అందిస్తుంది. ఆగష్టులో అర్హులైన చేనేతల ఖాతాల్లో నగదు జమవుతుంది. మరో 5 వేలమంది అర్హులున్నా ఈ పథకం వర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చేనేత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక కుటుంబ పోషణ భారంతో మేస్త్రీ పనులు, కూలీ పనులకు వెళుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ వరకు చదువుకొన్న కొందరు యువకులు ఇప్పుడు మగ్గం వదిలి బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాలకు వలస వెళ్లి ప్రైవేటు కంపెనీల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు.

ఆశ వదులుకున్నాను

నా పేరు హరిప్రసాద్‌ మాది పెద్దపప్పూరు రామకోటికాలనీలో నివాసం ఉంటున్నాం. 2001 నుంచి మగ్గం నేస్తున్నాను. నెలనెలా రూ.1,000 వచ్చేది. 2019లో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనేకసార్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నా నేతన్న నేస్తం రాలేదు. కార్యాలయం చుట్టూ తిరిగి ఆశ వదులుకున్నాను. ఈ సారైనా వస్తుందో రాదో చూడాలి

కూలీ పనులకు వెళుతున్నాను

15 ఏళ్లుగా మగ్గం నేస్తున్నాను. మగ్గంపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నాము. రెండుసార్లు నేతన్న నేస్తం నా ఖాతాలో జమైంది. మూడోసారి మగ్గం వేయలేదన్న కారణంతో నేతన్న నేస్తం పథకం నుంచి తొలగించారు. సచివాలయం, ఏడీ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. స్పందనలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. మగ్గం నేస్తూ కూలీ పనులకు కూడా వెళుతున్నాను.

కచ్చితంగా అమలవుతుంది

ప్రభుత్వ నిబంధనల మేరకు మగ్గం నేస్తూ అన్నివిధాలా అర్హులుగా ఉంటే పథకం కచ్చితంగా అమలు అవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయ వెల్ఫేర్‌ అధికారి దరఖాస్తును, పరిసర ప్రాంతాలను పరిశీలించి అర్హులైతే పథకం అమలు అవుతుంది. కొన్ని పరిశీలనలో ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. - బసవరాజు, ఇన్‌ఛార్జి ఏడీ, చేనేత జౌళిశాఖ

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని