logo

గుట్టుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేలా నిర్ణయాలు తీసుకోబోం.. మాది రైతు ప్రభుత్వం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జగన్‌ ప్రభుత్వం.. కర్షకులను మభ్యపెడుతూ కష్టాలలోకి నెడుతోంది.

Published : 17 Apr 2024 05:33 IST

రైతులు వ్యతిరేకిస్తున్నా ఏర్పాటు చేయిస్తున్న వైకాపా ప్రభుత్వం

 తాడిమర్రిలో రైతు వెంకటేష్‌ తోటలో ఏర్పాటు చేసిన మీటర్లు

 తాడిమర్రి, న్యూస్‌టుడే: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేలా నిర్ణయాలు తీసుకోబోం.. మాది రైతు ప్రభుత్వం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జగన్‌ ప్రభుత్వం.. కర్షకులను మభ్యపెడుతూ కష్టాలలోకి నెడుతోంది. వారం రోజులుగా తాడిమర్రి మండలంలోని పలు గ్రామాలలో వ్యయసాయ మోటార్లకు మీటర్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 7,800 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా ఇప్పటికే 4000పైగా మీటర్లను బిగించడం గమనార్హం. ఎన్నికల సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పరు.. ప్రశ్నించరన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పొలాల్లో ఎవరూ లేనప్పుడు.. గుట్టుచప్పుడు కాకుండా బిగించేస్తున్నారని వారు వాపోతున్నారు. ప్రతి బోరుబావి వద్ద తప్పనిసరిగా మీటర్‌ ఏర్పాటు చేయాలని వైకాపా ప్రభుత్వం ఆదేశించడంతో స్థానిక విద్యుత్తు శాఖాధికారులు రంగంలోకి దిగారు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. గుత్తేదారు ద్వారా అధికారులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈక్రమంలో కొందరు రైతులు మీటర్లను వెనక్కి ఇచ్చేస్తున్నారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మీటర్లు ఏర్పాటు చేశాక విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు వస్తాయన్న అనుమానాలను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు తగ్గి... సాగు చేసిన పంటలకు నీరు అందుబాటులో లేక, కరవు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే మీటర్లు బిగించడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల నుంచి వ్యవసాయానికి సక్రమంగా 9 గంటల కరెంటు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో పంటల దిగుబడి తగ్గి పూర్తిగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవేమీ పట్టనట్లుగా వైకాపా ప్రభుత్వం మీటర్లు ఏర్పాటు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.


నిరంకుశంగా వ్యవహరించడం తగదు

మీటర్లు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తప్పవని రైతులు అభిప్రాయపడుతున్నారు. అన్నదాతలు ఆందోళన చెందుతున్నా బలవంతంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. తోటలో మీటరు ఏర్పాటు చేస్తామంటే వద్దని.. అధికారులను వెనక్కి తీసుకెళ్లాలని సూచించాను.

- ఆదినారాయణచౌదరి, మేడిమాకులపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని