logo

వైద్యమో.. జగనన్నా

మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపంలో ఏడేళ్ల కిందట ఆరు పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు

Published : 17 Apr 2024 06:02 IST

24 గంటల ఆసుపత్రుల్లో దయనీయం

కుర్చీలు విరిగి.. బెడ్లు చిరిగి

విరిగిపోయిన కుర్చీలు

 శ్రీరంగాపురం(బెళుగుప్ప): మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపంలో ఏడేళ్ల కిందట ఆరు పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు ముగ్గురు, ఒక ఫార్మాసిస్ట్‌తో పాటు మరో ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. జనరల్‌ వార్డులో ఉపయోగించిన దూది, సిరంజీలను మంచాల కింద పడేస్తున్నారు. బండలపై దుమ్మును శుభ్రం చేయడం లేదు. కుర్చీలు విరిగిపోయాయి. మూత్రశాలలు, శౌచాలయాలు ఉన్నప్పటికి నిర్వహణ లోపించి అధ్వానంగా మారాయి. నీటి వసతి లేదు.మందులను వరండాలో నిల్వ చేశారు. ఆపరేషన్‌ గదిలో బెడ్‌ దెబ్బతింది. ప్రజలు వైద్యచికిత్స కోసం కళ్యాణదుర్గం, కణేకల్లు ఆసుపత్రులకు వెళుతున్నారు.

 ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. 24 గంటల ఆసుపత్రుల్లో కనీస వసతులు లేక.. వైద్యం అందక రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో అసౌకర్యాలపై కథనం.

సరిపడా వైద్యులు లేక ఇక్కట్లు

కంబదూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్నారు. వారిలో ఒకరు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 104 వాహనంలో గ్రామాలకు వెళ్తున్నారు. ఒక్కరే ఓపీ చూడాల్సి వస్తుంది. కంబదూరు మండలంలోని 42 గ్రామాలకు ఇదే పెద్ద ఆసుపత్రి. రోజుకు 200 నుంచి 250 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సిన దయనీయమిది.

శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ..

కణేకల్లు: మండలంలోని యర్రగుంట పీహెచ్‌సీ భవనం పైకప్పు పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకుంది. ఇరుకు ఓపీ గదిలోనే ల్యాబ్‌ నిర్వహించాల్సిన దుస్థితి. కంప్యూటర్‌, టీకాల నిల్వ, సిబ్బంది గదుల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ వైద్యం అందించాల్సిన పరిస్థితి. నాడు నేడు కింద రూ.1.75కోట్లతో నూతన భవనం రూపుదిద్దుకున్నా.. బిల్లులు చెల్లించక పోవడంతో గుత్తేదారుడు భవనం స్వాధీనం చేయలేదు.

సేవలు నామమాత్రం

శెట్టూరు: స్థానిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ జబ్బులకు మాత్రమే ఇక్కడ వైద్యం చేస్తారని, ఎక్కువ మందిని కళ్యాణదుర్గం, ఇతర ప్రాంతాలకు సిఫారసు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. క్యాంపుల పేరుతో డాక్టర్లు పీహెచ్‌సీకి రారని, ఎప్పుడూ కిందిస్థాయి సిబ్బందే వైద్యం చేస్తారని రోగులు ఆరోపిస్తున్నారు. నాడు-నేడు కింద రూ.35లక్షలు మంజూరైనా ఆసుపత్రిలో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు పూర్తి కాకపోయినా రంగులు మాత్రం కొట్టించారు. అభివృద్ధి పనుల కోసం గోతులు తీయడంతో పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని