logo

అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!

మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. 

Published : 18 Apr 2024 04:06 IST

కళ్యాణదుర్గంలో కౌన్సిలర్లకు మహిళా ప్రజాప్రతినిధి షాక్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం-న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం: మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. ఆమెను మరో నియోజకవర్గానికి బదిలీ చేసినా స్థానిక వైకాపా నాయకులకు కష్టాలు తప్పడం లేదు. ఆమె ధనదాహానికి మున్సిపల్‌ కౌన్సిలర్లు బలవుతున్నారు. ఇటీవల 23 మంది కౌన్సిలర్లకు నోటీసులు అందాయి. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని.. లేని పక్షంలో శిక్షార్హులని అందులోని సారాంశం. దీంతోకౌన్సిలర్లు ఏం జరుగుతుందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?

కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి 2021లో ఎన్నికలు జరిగాయి. సదరు మహిళా ప్రజాప్రతినిధి.. కౌన్సిలర్లుగా పోటీచేస్తున్న వారికి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పార్టీ నిధి పేరుతో డబ్బు ఇప్పించారు. అప్పట్లోనే కౌన్సిలర్‌ అభ్యర్థులతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధిని పార్టీ అధిష్ఠానం మరో నియోజకవర్గానికి బదిలీ చేయడంతో ఆమె అక్కడికి మకాం మార్చారు. కళ్యాణదుర్గం నాయకులతో తనకేం పని అనుకున్నారో ఏమో? మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బినామీల ద్వారా కౌన్సిలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు. ఈక్రమంలో కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఓడిపోయిన అభ్యర్థులకు సైతం నోటీసులు వచ్చాయి. గతంలో మహిళా ప్రజాప్రతినిధికి అనుచరులుగా ఉన్న కౌన్సిలర్లకు రాకపోవడం గమనార్హం.   కొందరు కౌన్సిలర్లు ఫోన్‌లో నోటీసులపై ఆమెను ప్రశ్నించగా.. తనకేం తెలియదని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల హడావుడిలో ఉన్నానని.. తర్వాత మాట్లాడదామని మొహం చాటేస్తున్నట్లు వాపోతున్నారు. నోటీసుల బారి నుంచి తప్పించాలని పార్టీ పెద్దల వద్ద పంచాయితీ చేసేందుకు కౌన్సిలర్లు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని