logo

లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు.

Published : 18 Apr 2024 04:26 IST

57 వాహనాల స్వాధీనం

స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, పోలీసు అధికారులు

తాడిమర్రి, న్యూస్‌టుడే : ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. బుధవారం తాడిమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ, డీఎస్పీ శ్రీనివాసులు వివరించారు. నల్లచెరువు మండలం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన  నల్లజంగరి రవికుమార్‌, ఎన్పీకుంట మండలం వంకమద్దికి చెందిన సాకే రామ్మోహన్‌, ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులకు చెందిన బయారెడ్డి, సింహాద్రిపురం మండలం లోమడ వాసి కాకర్ల హాజీపీరా, బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లికు చెందిన బోగిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి, మద్దిరెడ్డిపల్లికి చెందిన పెసల నాగమల్లారెడ్డి, యాలురుకు చెందిన సుదర్శన్‌రెడ్డి, నంద్యాల జిల్లా గోస్పాడు మండలం శ్రీనివాసపురం చెందిన తలారి రామలింగేశ్వరరావు, అవుకు మండలం చెన్నంపల్లికి చెందిన పాణ్యం మల్లికార్జునరెడ్డి, కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చాకవేలు గ్రామ వాసి జయచంద్రారెడ్డి, తీగలపల్లి వాసి మధుసూదన్‌రెడ్డి ముఠాగా ఏర్పడ్డారు.  ఏడాదిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి పులివెందుల, కడప ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ట్రాక్టర్లు లీజు కావాలని వాహనాల యజమానులను సంప్రదించారు. ప్రతి నెలా రూ.25,000 ఖాతాలోకి జమ చేస్తామని, నకిలీ అగ్రిమెంట్‌ పత్రాలపై సంతకాల చేయించి అందజేశారు. రెండు నెలలపాటు కొందరికి నగదును జమచేశారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారు. ట్రాక్టర్ల యజమానులు చరవాణిలో సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. దీంతో కొందరు తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తక్కువ ధరకే విక్రయించిన కేటుగాళ్లు

లీజుకు అని చెప్పి తీసుకెళ్లిన వందలాది ట్రాక్టర్లను కేటుగాళ్లు ఉమ్మడి శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల, గుంటూరు జిల్లాలో తక్కువ ధరకే ఇష్టారీతిన విక్రయించేశారు. అలా వచ్చిన నగదును ముఠాలోని సభ్యులు భాగాలుగా పంచుకునేవారు. ఈ ట్రాక్టర్లు కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా వీరు మోసం చేశారు. తక్కువ ధరకు రిజిస్టర్‌ చేయిస్తామని నగదు తీసుకుని ఉడాయించేవారు.

ట్రాక్టర్ల విలువ రూ.5 కోట్లకు పైగానే..

ముఠాలోని కీలక సభ్యులైన రవికుమార్‌, బయారెడ్డి, హాజీపీరాలను అరెస్టు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. వీరి ఇచ్చిన సమాచారం మేరకు 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారుగా రూ.5 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. ఇంకా వాహనాలు రికవరీ చేయాలని, ముఠాలోని మిగతా సభ్యులను పట్టుకుని వాటిని స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణంరాజునాయక్‌, క్రైం బ్రాంచ్‌ సీఐ హేమంత్‌కుమార్‌, ఎస్‌ఐ నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.

గత నెల 14న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంతో ఘరానా ముఠాను వెలుగులోకి తెచ్చింది  

‘ఈనాడు’ కథనంతో కదిలిన పోలీసులు

ఈ వ్యవహారంపై గత నెల 14న ‘లీజు పేరుతో ఘరానా మోసం’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్పీ మాధవరెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీనిపై డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేసి.. ఇతర జిల్లాలో మకాం వేసి నిందితులను అరెస్టు చేశారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని