logo

నారీ యుక్తి.. పాడికి శక్తి

ఏటా పలకరించే కరవు.. పెరిగిన పెట్టుబడులతో సాగు భారంగా మారిన దుర్భిక్ష పరిస్థితులతో కుదేలైన గ్రామాల్లో ఊపిరిలూదారు అక్కడి నారీమణులు.

Published : 27 Mar 2023 03:25 IST

కరవు గ్రామాల్లో క్షీర విప్లవం

పుత్తూరు మండలం తిమ్మాపురంలో పాలు పోస్తున్న మహిళ(పాత చిత్రం)

ఏటా పలకరించే కరవు.. పెరిగిన పెట్టుబడులతో సాగు భారంగా మారిన దుర్భిక్ష పరిస్థితులతో కుదేలైన గ్రామాల్లో ఊపిరిలూదారు అక్కడి నారీమణులు. సాగును పక్కన పెట్టి పాడికి పట్టం కట్టారు.. ఒకరి తర్వాత మరొకరు చైతన్యాన్ని అందిపుచ్చుకున్నారు.. నేడు తూర్పు మండలాల్లో క్షీర పరవళ్లు సృష్టించారు.

న్యూస్‌టుడే, పుత్తూరు: తూర్పు మండలాల్లో ఏటా పంటలు సాగు చేసి నష్టాలు చవిచూస్తున్నారు. ఓ పక్క పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కూలీలు దొరకడం కష్టంగా మారింది. వరి, వేరుసెనగ, చెరకు తదితర పంటలు సాగు చేసినా ఆశించిన ధర దక్కడం లేదు. అప్పులే మిగులుతున్నాయి. పిల్లల చదువులకు ఇబ్బందులే. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ బాధ్యతను మహిళలే తీసుకున్నారు.
పుత్తూరు మండలంలోని తొరూరు, తిమ్మాపురం, గోపాలకృష్ణాపురం, అమరంకండ్రిగ, పరమేశ్వరమంగళం, నగరిలోని ఎం.కొత్తూరు తదితర ప్రాంతాల్లో మహిళా రైతులు పాడిపై దృష్టి సారించారు. ఒక్కో ఆవును రూ.40 నుంచి 50వేలకు కొనుగోలు చేసి మంచి పాల దిగుబడి సాధించారు. ఇది క్రమంగా అన్ని గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. నేడు ఒక్క తూర్పు మండలాల్లోనే 50వేల కుటుంబాలకు పైగా పాడితో జీవనోపాధి పొందుతున్నారు. నగరి మండలంలోని ఎం.కొత్తూరు గ్రామంలో ప్రతి రోజు 500 లీటర్లుకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోంది. నెలకు ఆ ఒక్క గ్రామంలో రూ.10లక్షల వరకు పాడి ద్వారా అక్కడి రైతులు ఆర్జిస్తుండటం గమనార్హం. చంద్రగిరి మండలం శానంబట్ల పంచాయతీలో 750 పాడి ఆవులు ఉన్నాయి. ఇక్కడ 630 కుటుంబాలు పాడిపై ఆధారపడ్డాయి. రోజూ రెండు వేల లీటర్ల పాలు కేంద్రాలకు పోస్తారు.

వారిదే కీలక భూమిక..

గత కొన్నేళ్లుగా మహిళా రైతులు క్రియాశీలకంగా ఉంటూ పాడిపరిశ్రమను ముందుండి నడుపుతున్నారు. పొలంలో గ్రాసం వేయడం మొదలు, ఇంటికి తీసుకురావడం, ఆవులకు వేయడం, షెడ్లు శుభ్రం చేయడం ఇలా ఆయా పనుల్లో మహిళలదే కీలక భూమిక పోషిస్తున్నారు. భర్త సాయంతో పాడిని లాభదాయకంగా మార్చారు. పొలాలు లేని వారు బోరు బావుల కింద 50సెంట్లు భూమి ఉన్న రైతులు కూడా పోషకాలు కలిగిన గ్రాసం పెంచుతున్నారు. రోజావారీ 15-20 లీటర్లకు పైబడి పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. నాణ్యమైన పాలు అందించడం ద్వారా లీటరుకు రూ.40 నుంచి రూ.60 వరకు పొందుతున్నారు. ఇలా రోజుకు దాదాపు రూ.వెయ్యి నుంచి రెండు వేలు సంపాదిస్తున్నారు.

తూర్పు మండలాల్లో 2 లక్షల లీటర్లకు పైగా

పుత్తూరు, నగరి, నారాయణవనం, సత్యవేడు, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెం ప్రాంతాల్లో పాల దిగుబడి పెరగడంతో దాదాపు 50కు పైగా డెయిరీలు ఏర్పాటయ్యాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి రెండు లక్షల లీటర్లు వరకు పాల దిగుబడి ఉంది. ఇక్కడి గ్రామ సీమల్లో మహిళలు సమైక్యంగా సాధించిన విజయమని డెయిరీల నిర్వాహకులు చెబుతున్నారు.

నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నా..

మాకు ఆరు పశువులు ఉన్నాయి వాటిలో నాలుగు పాలు ఇస్తున్నాయి. నెలకు రూ.20వేల వరకు పాడి పోషణపై ఆర్జిస్తున్నాం. గ్రామంలో చాలామంది మహిళలు పాడిద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు.

లక్ష్మి, ఎం.కొత్తూరు, నగరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని