logo

మీ బిడ్డనంటివి.. మోకాలొడ్డితివి

జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రధానమైనది సామాజిక పింఛన్లు.. వీటిపై ఆధారపడి జీవించే వారు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖు కోసం ఎదురు చూసే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా ఎందరో ఉన్నారు.

Published : 17 Apr 2024 03:39 IST

అవ్వాతాతల ఉసురు కొట్టదా జగన్‌!
సాయం మాటున పేదలకు ఏడుపు
ఆరంచెల పరిశీలన పేరుతో లబ్ధిదారుల్లో కోత

  • చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన జ్యోతి వితంతువు. ఆమెకు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆమే పెద్ద దిక్కు. కుట్టుపనితో పాటు ఇంటి వద్దే పిండి రుబ్బే యంత్రాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సగటున నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తుండటంతో వితంతు పింఛను ఏడాదిన్నర క్రితం ఆపేశారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆమె వాపోయారు.
  • పెనుమూరు కమ్మవీధికి చెందిన ద్రౌపదమ్మకు వితంతు పింఛను వచ్చేది. వైకాపా అధికారంలోకి వచ్చాక వివిధ రకాల ఆంక్షల పేరిట రద్దు చేశారు. అదేమిటంటే కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని అందుకే తొలగించామనేది అధికారుల సమాధానం. అతడు ఎక్కడో ఉంటున్నాడు. అయినా ఆమెకు పింఛను ఇవ్వడం లేదు.

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే:  జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రధానమైనది సామాజిక పింఛన్లు.. వీటిపై ఆధారపడి జీవించే వారు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖు కోసం ఎదురు చూసే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా ఎందరో ఉన్నారు. ఏ ఆధారమూ లేక, అయినవాళ్ల ఆలనాపాలనకు నోచుకోక పింఛను పైసలతో పొట్ట నింపుకొని, మందులు కొనుగోలు చేసుకుని జీవిస్తున్నారు. అలాంటి వారిలో పలువురికి సాంకేతిక తప్పిదాలు, రాజకీయ జోక్యంతో పింఛను రద్దు కావడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని ఓ వైపు చెబుతూనే ఉన్నవారికి కోత పెడుతున్నారు. తొలగించిన వాటి లెక్క దాచేసి కొత్త లెక్క ఎక్కడా తక్కువ కాకుండా చూపుతూ వైకాపా ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఏళ్ల తరబడి పింఛను తీసుకుని బతుకుతున్న వారిని.. చేయని తప్పునకు బాధ్యులను చేస్తూ ఆకస్మికంగా జాబితా నుంచి తొలగించడంతో బాధితుల గోడు వర్ణనాతీతం.

వైకాపా ప్రభుత్వం ఆరంచెల పరిశీలన పేరుతో పలువురిని పింఛన్లకు దూరం చేస్తోంది. విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటిన కుటుంబాల్లోని వారు, కుటుంబ సభ్యుల పేరుతో నాలుగు చక్రాల వాహనం ఉన్న వారు, వెయ్యి చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్నవారు, కుటుంబ సభ్యుల్లో ఆదాయపన్ను చెల్లించినా, ఐదెకరాలకు పైన పొలం ఉన్నా, రూ.15 వేల జీతం తీసుకునేవారు ఉంటే పింఛను రద్దు చేశారు.


సాంకేతిక లోపాలే శాపాలై..

కార్లు, టాటా ఏస్‌ వాహనాలు బాడుగలకు తిప్పుతున్న వారి కుటుంబాల్లో పింఛన్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. స్వయం ఉపాధి కోసం పిండి రుబ్చే యంత్రాలు, గడ్డి కోత యంత్రాలు, కుట్టు మిషన్లు, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగిస్తున్నారు. వీరిని ధనికులని లెక్క గట్టి  పేర్లు తొలగించారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతున్న వారి కుటుంబాల్లో  పింఛను రద్దు చేస్తుండటం గమనార్హం.


కుమారుడికి దూరంగా ఉన్నా

- మునెమ్మ, తవణంపల్లి

నాకు వృద్ధాప్య పింఛను వచ్చేది. ఏడాదిగా ఆపేశారు. కారణమేంటని సచివాలయ సిబ్బందిని అడిగితే నీ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడని చెబుతున్నారు. నా కుమారుడు ప్రైవేటు ఉద్యోగి. వేరేచోట ఉంటాడు. నేను ఒంటరి మహిళను. పింఛను రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది.


రాజకీయ కక్షతో ఆపేశారు

- బి.కె.సావిత్రి, తుమ్మిసి, శాంతిపురం

భర్తతో విడిపోయి స్వగ్రామం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నా. నా సోదరుడు తెదేపా సానుభూతిపరుడు. ఏడాది కిందట పాఠశాల కమిటీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో కక్ష కట్టిన వైకాపా నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసి నాకొస్తున్న ఒంటరి మహిళ పింఛను ఆపేశారు. ఇంతకన్నా అరాచకం మరొకటి ఉంటుందా. నే చేసిన తప్పేంటి.


పుట్టింటివారు తెదేపా వర్గీయులని రద్దు

- కేఆర్‌ సునీత, శాంతిపురం

మాది శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామం. భర్త చంద్రశేఖర్‌ పదేళ్ల కిందట మరణించడంతో వితంతు పింఛను మంజూరైంది. పుట్టింట్లో పశు పోషణతో జీవనం సాగిస్తున్నా. ఎంపీటీసీ మాజీ సభ్యుడైన నాన్న రామచంద్రనాయుడు తెదేపాలో చురుగ్గా వ్యవహరిస్తుండటాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నాకొస్తున్న పింఛను రద్దు చేయించారు. కలెక్టర్‌తో పాటు అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పింఛను పునరుద్ధరించకుండా అధికార పార్టీ నేతలు అడ్డుతగులుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని