logo

YSRCP: వైౖకాపాలో జగడ.. జగడ.. రగడ.. రగడ

ఒకప్పుడు అధిష్ఠానం పంపిన స్క్రిఫ్టును అక్షరం పొల్లుపోకుండా వైకాపా నేతలు చదివేవారు. ఒక్క ముక్క ఎక్కువ- తక్కువ మాట్లాడినా తాడేపల్లి నుంచి చీవాట్లు తినే పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీన్‌ మారింది.

Updated : 13 Jan 2024 08:43 IST

అభ్యర్థిని నేనేనంటూ స్వీయ ప్రకటనలు, ప్రచారాలు
సమన్వయకర్తలను వెల్లడించాక.. పెరిగిన ధిక్కార స్వరం

ఈనాడు, కాకినాడ : ఒకప్పుడు అధిష్ఠానం పంపిన స్క్రిఫ్టును అక్షరం పొల్లుపోకుండా వైకాపా నేతలు చదివేవారు. ఒక్క ముక్క ఎక్కువ- తక్కువ మాట్లాడినా తాడేపల్లి నుంచి చీవాట్లు తినే పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీన్‌ మారింది. తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ప్రకటన తర్వాత ..కొందరిలో ఆవేదన, అభద్రత భావం, ఆగ్రహం పెల్లుబికుతున్నాయి. అధిష్ఠానాన్ని సంప్రదించకుండానే.. ఎవరికి నచ్చినట్లు వారు నేనే అభ్యర్థినని ప్రకటించుకున్నారు. ప్రైవేటు ప్రచారాలకు తెరలేపడం.. జగన్‌ బొమ్మను, వైకాపా జెండాను పక్కన పెట్టి సొంత కార్యక్రమాలు చేయడం కనిపిస్తోంది.

తాడోపేడో తేల్చుకోడానికే..

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌కు చుక్కెదురైంది. ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా వరుపుల సుబ్బారావును నియమించడంతో ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. తాడోపేడో తేల్చుకోడానికి జనంలోకి వెళ్లాలని సొంతంగా ‘ప్రజాదీవెన’ కార్యక్రమానికి పర్వత శ్రీకారం చుట్టారు. రౌతులపూడి మండలం పి.చామవరం నుంచి ఇంటింటి ప్రచారాలు, సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రజల మద్దతు కోరుతున్నారు. మన బలమేంటో చూపించుకుందాం.. టికెట్‌ నాకే వస్తుందన్న ధీమాను పర్వత వ్యక్తంచేస్తున్నారు.  

సీఎం బొమ్మ లేకుండానే..

పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తను మార్చి కాకినాడ ఎంపీ వంగా గీతకు బాధ్యతలు అప్పగించారు. ఆమె భవిష్యత్తు అభ్యర్థినని ప్రచారం చేస్తున్నారు. ఇది సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మింగుడు పడలేదు. అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం భారీగా నిర్వహించారు. జగన్‌ బొమ్మ, పార్టీ జెండా లేకుండా వేదికతోపాటు ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి వేడుకలు నిర్వహించారు.

నేను వద్దా.. మాకు మీరూ వద్దు..  

జగ్గంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని..సమన్వయకర్త బాధ్యతలను మాజీ మంత్రి తోట నరసింహంకు పార్టీ అప్పగించింది. అసంతృప్తి చెందిన చంటిబాబు.. పార్టీతో బంధం తెగిపోయిందనే సంకేతాలు పంపేలా ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. కొత్త సంవత్సర వేడుకలను భారీగా నిర్వహించి తన పరపతి చూడండంటూ వైకాపాకు సంకేతాలు పంపారు. కాకినాడలో ఇటీవల సీఎం జగన్‌ పర్యటనకు గైర్హాజరయ్యారు.

అంతటా లుకలుకలు..

పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో సిట్టింగులను పక్కనపెట్టి సమన్వయకర్తలే పాల్గొనడం శ్రేణులకు మింగుడు పడడంలేదు. సిట్టింగులు, సమన్వయకర్తలు, ఆశావహుల మధ్య విభేదాలు బుసలు కొడుతున్నాయి.

కాకినాడ గ్రామీణంలో విద్యుత్తు స్తంభానికి పితాని నాయకత్వం వర్ధిల్లాలంటూ అతికించిన స్టిక్కర్‌

  • పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా జడ్పీ   ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ను పార్టీ నియమించడంతో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గుర్రుగా ఉన్నారు. ఇటీవల జగన్‌ పర్యటన, ఇతర అధికారిక కార్యక్రమాలకూ ముఖం చాటేశారు.
  • రాజమహేంద్రవరంలో ఇరువర్గాలను శాంతపరిచే క్రమంలో రుడా ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పించిన షర్మిలారెడ్డికి.. వెంట వెంటనే గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. పెద్దాపురం వైకాపా సమన్వకర్త దవులూరి దొరబాబును ఈ పదవి నుంచి తప్పించి షర్మిలకు ఇవ్వడంపై చర్చ నడుస్తోంది. ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నా.. నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రస్తుతానికి దొరబాబే ఉండటంతో తమ అసంతృప్తిని బయటపెట్టడంలేదు.
  • కాకినాడ గ్రామీణంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తానే మళ్లీ అభ్యర్థిననే ధీమాతో ఉంటే.. పోటీగా మరో నాయకుడు డా.పితాని అన్నవరం సై అంటున్నారు. ‘నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి.. నన్ను ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నార’ని పేర్కొంటున్నారు. సేవా కార్యక్రమాలు, ప్రత్యేక స్టిక్కర్లు, ప్రచారాలతో పర్యటిస్తున్నారు.

ఇదీ మా టీం...

త్వరలో మా టికెట్లన్నీ ప్రకటిస్తారు.. ఎప్పుడో నాకు తేదీలు తెలుసుగానీ చెప్పకూడదు. కాకినాడలో నేను, రూరల్‌లో కన్నబాబు, పిఠాపురంలో గీత, ప్రత్తిపాడు- వరుపుల సుబ్బారావు, తునిలో దాడిశెట్టి రాజా, జగ్గంపేట- తోట నరసింహం, పెద్దాపురం- దవులూరి దొరబాబు పోటీచేస్తాం. 99.99 శాతం మాతోనే జగన్‌ ఎన్నికల రేసుకు వెళ్తారని భావిస్తున్నా. ఎంపీ అభ్యర్థిని 15 రోజుల్లో
ప్రకటిస్తారు.
ఇటీవల సమావేశంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి


అంతే నిజం

పులివెందులలో జగన్‌ పోటీచేయడం ఎంత సత్యమో.. తునిలో నా పోటీ కూడా అంతే నిజం..

వి.కొత్తూరులో పింఛను పంపిణీలో మంత్రి దాడిశెట్టి రాజా


బొత్స చెప్పారు కదా..

రాబోయే ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి నేనే పోటీచేసి గెలుస్తా.. మంత్రి బొత్స నన్ను ఇన్‌ఛార్జిగా ప్రకటించినప్పుడే టికెట్‌ విషయమై స్పష్టత ఇచ్చారు. అయినా కొందరు టికెట్‌ వారికంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో ప్రత్తిపాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని