logo

రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం

ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 24 Apr 2024 06:25 IST

తనిఖీ చేస్తున్న తహసీల్దార్‌ రమాదేవి, సీఐ తులసీధర్‌
కడియం, న్యూస్‌టుడే: ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ తులసీధర్‌, తహసీల్దార్‌ రమాదేవిల కథనం మేరకు.. పొట్టిలంక చెక్‌పోస్ట్‌ వద్ద మంగళవారం సాయంత్రం బంగారం, వెండి ఆభరణాలను రవాణా చేస్తున్న వాహనాన్ని నిలుపుదల చేశారు. వారి వద్ద కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన రవాణా అనుమతులు లేనట్లు గుర్తించారు. దాంతో వాహనంలోని ఆభరణాలను జీఎస్టీ, ఆదాయ తదితర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిశితంగా పరిశీలించారు. వాహనంతోపాటు సుమారు 4.5 కేజీల బంగారం, 1.2 కేజీల వెండి వస్తువులను ఎఫ్‌ఎస్‌టీ బృందానికి అప్పగించారు. వాటి విలువ సుమారు రూ.2.58 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీటిని విజయవాడ నుంచి భీమవరం, రాజమహేంద్రవరంలోని పలు నగల దుకాణాలకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు వాహన చోదకుడు తెలిపారు.


కల్వర్టు గోతిలో పడి యువకుడి దుర్మరణం

సీతానగరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం, సీతానగరం నాలుగు వరుసల రహదారి విస్తరణలో నిరక్ష్యపు పనులకు మరో యువకుడు బలి అయ్యాడు. మరో అయిదు నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటాడనగా అతని పాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్లితే.. కోరుకొండకు చెందిన మత్స్యకార కుటుంబికులు దోమ సతీష్‌(24) తన ఇద్దరు స్నేహితులు శేఖర్‌, గిరిష్‌తో కలిసి బైక్‌పై రఘుదేవపురంలో జరుగుతున్న చింతాలమ్మ సిరి ఉత్సవాలకు మంగళవారం రాత్రి వస్తున్నారు. రాపాక వద్దకు వచ్చేసరికి కల్వర్టు వద్ద చీకట్లో గొయ్యి కనిపించకపోవడంతో అందులో పడిపోయారు. దీంతో వారు గట్టిగా అరవడంతో పరిసర వాసులొచ్చి బయటకు తీశారు. అప్పటికే సతీష్‌ కొన ఊపిరితో ఉండగా మిగతా ఇద్దరికి స్వల్పగాయలయ్యాయి. 108 అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో సంఘటనా స్థలానికి చేరిన సీతానగరం ఎస్సై రామకృష్ణ తన జీపులో బాధితుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సతీష్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ కల్వర్టు దాటితే అయిదు నిమిషాల్లో బంధువుల ఇంటికి చేరి ఉత్సవాలను చూసేవారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఈ కల్వర్టుల వద్ద అవసరమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పలువురు క్షతగాత్రులవుతున్నారని ‘వంతెనలు శిథిలం.. రైతన్నకు భారం’ శీర్షికన ‘ఈనాడు’ ముందుగానే హెచ్చరించడం గమనార్హం. దీనిపై అధికారులు స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం పోకుండా ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని