logo

రోగుల భద్రత మరిచావా పాలకా!

ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్‌ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు.

Published : 24 Apr 2024 06:48 IST

 మూతపడిన భూగర్భ నడక మార్గం

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం: రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున ఉన్న గోదావరి రైల్వేస్టేషన్‌ ఈ అయిదేళ్లలో అభివృద్ధికి నోచుకోలేదు. అధికార వైకాపాకు చెందిన ఎంపీ నగరవాసే అయినప్పటికీ అభివృద్ధికి ఎటువంటి కృషి చేయలేకపోయారు. ఈ స్టేషన్‌ గోడును కేంద్రంలోని పెద్దలకు వినిపించలేకపోయారు. రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించడంలోనూ విఫలమయ్యారు. మరోవైపు నిర్వహణ విషయంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం చేసింది.

ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్‌ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. దీంతో ఉదయం.. సాయంత్రం రద్దీ ఉండేది. కొవిడ్‌ తర్వాత నిర్వహణ పూర్తిగా విస్మరించారు. నగరం నుంచి ఇటు విశాఖపట్నం వైపు అటు విజయవాడ వైపు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యమైన కొన్ని రైళ్ల హాల్టు లేకపోవడం.. ఇక్కడాగేవి సమయానుకూలంగా లేకపోవడం వల్ల వ్యయప్రయాసల కోర్చి నగర శివారున ఉన్న ప్రధాన స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది.

 విజయవాడ వైపునకు మూడే..

గతంలో ఎక్స్‌ప్రెస్‌, పాసింజర్లు కలిపి మొత్తం 15 రైళ్లు హాల్టు ఉండగా ఇప్పుడు 12 మాత్రమే ఆగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలతో నడుస్తున్న ఇవి కూడా అనుకూల సమయాల్లో అందుబాటులో లేవు. కాకినాడ, రాజమహేంద్రవరం వైపు నుంచి ఈ స్టేషన్‌ మీదుగా విజయవాడ వైపు నడిచేవి రోజూ మూడు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ జంక్షన్‌ వెళ్లే విజయవాడ మెము ప్రత్యేక రైలు అర్ధ¢రాత్రి దాటిన తర్వాత 3.19 గంటలకు వస్తుంది. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వెళ్లే ఫాస్ట్‌ మెము ఎక్స్‌ప్రెస్‌ తెల్లవారుజాము 5.34 గంటలకు, రాజమహేంద్రవరం నుంచి విజయవాడ జంక్షన్‌కు వెళ్లే విజయవాడ మెము ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 6.52 గంటలకు వస్తుంది. ఈ మధ్యలో విజయవాడ వైపు వెళ్లేవి అందుబాటులో లేవు. విజయవాడ వైపు నుంచి వచ్చి విశాఖపట్నం, కాకినాడ వైపు వెళ్లేవి తొమ్మిది రైళ్లు ఆగుతున్నప్పటికీ రాత్రి 9.29 నుంచి 11.29 గంటల మధ్య, 10.28 గంటల మధ్య అయిదు రైళ్లు, రాత్రి 9.09 నుంచి 10.28 మధ్య మూడు,  అర్ధరాత్రి 1.45 గంటలకు ఒకరైలు మాత్రమే అగుతుంది.

  సమస్యలెన్నో...

  •  భిక్షగాళ్లు ప్లాట్‌ఫామ్‌లపై, కాలిబాట వంతెనపై తిష్ఠవేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. ః రాత్రివేళలో అసాంఘిక శక్తులు, బ్లేడ్‌బ్యాచ్‌లు, రౌడీమూకలు చొరపడుతున్నారు.  
  •  ప్లాట్‌ఫామ్‌లపై నిఘా కెమెరాలకు గతంలో ప్రతిపాదనలు పెట్టినా ఇప్పటివరకు సమకూరలేదు. ఒకటో నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై మాత్రం ఫ్యాన్లు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో లేవు.    
  •  వృద్ధుల రాకపోకలకు అనుకూలంగా ఉండే భూగర్భ కాలిబాట వంతెన పూర్తిగా మూసివేశారు. కాలిబాట వంతెన ఉన్నప్పటికీ రాత్రివేళలో మందు బాబులు తిష్ఠ వేస్తుండటంతో అదికూడా అపరిశుభ్రంగా దర్శనమిస్తుంది.  ః ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణకు నెలకు కేవలం రూ.8,500 మాత్రమే కేటాయిస్తుండటంతో ఒక సిబ్బందితోనే ప్లాట్‌ఫామ్‌లు శుభ్రం చేయించాల్సిన పరిస్థితి. మరుగుదొడ్ల నిర్వహణ లేక దుర్గంధం వెదజల్లుతోంది. ః తాగునీటి సదు పాయం అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని ట్యాప్‌లు పనిచేయడం  లేదు. బయట నుంచి వచ్చే కొన్నింటికి డమ్మీలు వేసేశారు.

నిర్లక్ష్యంగా వదిలేశారు

ఈ స్టేషన్‌ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ చాలారైళ్లు ఆగేవి. ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం, కాకినాడ వైపు వెళ్లే పాసింజర్లు చిరువ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పాసింజర్ల్లను ఎక్స్‌ప్రెస్‌లుగా చేసి హాల్టు తగ్గించేశారు. దీంతో ప్రధాన స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. - రాము, ప్రయాణికుడు

హాల్టులు పెంచకపోవడంతో ఇబ్బంది

కొవిడ్‌కు ముందు వరకు రైళ్లు ఎక్కువగా ఆగేవి. ప్రస్తుతం హాల్టు తగ్గించేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగర శివారులో ఉన్న ప్రధాన స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు గోదావరి రైల్వేస్టేషన్‌లో మూడు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. అవికూడా అనువైన సమయాల్లో లేవు. ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరిచి హాల్టు పెంచితే బాగుంటుంది.

- మోసే, ప్రయాణికుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని