logo

సిలిండరు రవాణా ఛార్జీల పేరుతో దోపిడీ

వేటపాలెం బాపయ్య నగర్‌లో గ్యాస్‌ గోదాం కార్యాలయం ఉంది. ఇక్కడ నుంచి నాయునిపల్లికి కేవలం కిలోమీటరు దూరం ఉంటుంది.

Published : 06 Feb 2023 05:33 IST

* వేటపాలెం బాపయ్య నగర్‌లో గ్యాస్‌ గోదాం కార్యాలయం ఉంది. ఇక్కడ నుంచి నాయునిపల్లికి కేవలం కిలోమీటరు దూరం ఉంటుంది. ఇక్కడ నివసించే సుబ్బారావు గ్యాస్‌ బండ కోసం తన చరవాణి ద్వారా నమోదు చేసుకున్నారు. నాలుగు రోజుల తరువాత సిలిండరు ఇంటికి వచ్చింది. బిల్లుపై ఉన్న మొత్తాన్ని అతడు బాయ్‌కి ఇవ్వగా మరో రూ.30 ఇవ్వాలని అడిగాడు. కంపెనీ దగ్గరగానే ఉంది కదా... రూ.10 తీసుకోమన్నాడు. దీంతో బాయ్‌ గ్యాస్‌ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పడంతో చేసేది లేక అతడికి డబ్బులు ఇచ్చేశాడు.

* వైకుంఠపురానికి చెందిన శ్రీనివాసరావు తన పేరుపై గ్యాస్‌ బుక్‌ చేసుకున్నాడు. అతను చిరు ఉద్యోగి కావడంతో బైటకు వెళుతూ భార్యకు సిలిండరు ఈ రోజు వస్తోంది... బిల్లుకి సరిపడా డబ్బులు టీవి స్టాండ్‌పై పెట్టానని చెప్పి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాయ్‌ సిలిండరు తీసుకురాగా, ఆమె గ్యాస్‌ డబ్బులు ఇచ్చింది. అదేమిటమ్మా... బిల్లుమీద ఉన్న డబ్బు ఇస్తే తెచ్చినందుకు కూలీ ఇవ్వరా అని అడిగాడు. మావారు అంతే ఇచ్చారని చెప్పడంతో.. లేదమ్మా... మాకు కంపెనీలో జీతం ఇవ్వరు.. మీరు ఇచ్చినదే మాకు వస్తోందని చెప్పడంతో చేసేది లేక ఆమె అదనంగా మరో రూ.30 ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే

‘గ్యాస్‌ సిలిండరు ఇంటికి సరఫరా పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు... ఈ అనధికారిక వసూళ్ల పర్వం నిరంతరం కొనసాగుతోంది... అదనపు డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే ఏకంగా బండను తిరిగి వెనక్కి తీసుకెళుతున్నారు... తప్పని పరిస్థితుల్లో రవాణా ఛార్జీల పేరుతో డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అధికారులు మాత్రం బిల్లుపై ఉన్నదానికన్నా ఒక్క రూపాయి చెల్లించొద్దని చెబుతున్నా అది ఆచరణలో సాధ్యం కావడంలేదు.

జిల్లాలోని గ్యాస్‌ ఏజెన్సీల సిబ్బంది ఇంటింటికీ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కదానికి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతమైతే రెట్టింపు చెల్లించాల్సిందే. అదేమని వారిని అడిగితే మాకు జీతాలు ఇవ్వరు సారూ.. మీరిచ్చేదే మిగులుతోందని సిబ్బంది చెబుతున్నారు. రసీదుపై ఒక్కపైసా ఎక్కువ ఇచ్చేది లేదని ఎవరైనా ఖరాఖండిగా చెబితే వెంటనే సిలిండరు ఇవ్వకుండా కొంతమంది డెలివరీ బాయ్‌లు వెనక్కి తీసుకెళుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఐవోసీ, హెచ్‌పీ, బీపీసీ కంపెనీలకు చెందిన 31 ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 4.63 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కనీసం నెలకు 80శాతం వరకు పంపిణీ అవుతున్నాయి. అంటే సరాసరి నెలకు 3.70 లక్షల వరకు సిలిండర్లు వినియోగదారులకు అందజేస్తున్నారు. వీటి నుంచి ఒక్కొక్కదానికి రూ.30 వంతున రవాణా ఛార్జీల పేరుతో నెలకు రూ.కోటిపైనే దండుకుంటున్నారు. అదే ఏడాదికి రూ.12 కోట్లుపైనే ఉంటోంది.

మన ఫోన్లోనే ఫిర్యాదు చేయవచ్చు

ఎల్‌పీజీ సిలిండరు రసీదుపై ఉన్న దానికన్నా అదనంగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని ఓవైపు అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తే మన ఫోన్లోనే 1967 కాల్‌ సెంటర్‌కి ఫిర్యాదు చేయవచ్చు. ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 5 కిలోమీటర్లలోపు అయితే వినియోగదారుడు సిలిండరు ఇంటికి తెచ్చినందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరంలేదని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.బి.విలియమ్స్‌ తెలిపారు. దీనిపై ఎవరైనా నేరుగా తనకు గాని, మా కార్యాలయంలోనైనా ఫిర్యాదు చేస్తే తప్పక సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5 కిలోమీటర్ల నుంచి 15 లోపు రూ.20, ఆపైన దూరం ఉంటే రూ.30 వరకు ఒక్కొక్క సిలిండరుకు అదనంగా ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని