logo

Eluru: ఏలూరులో సుపారీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని కిడ్నాప్‌ చేసి బెదిరింపులు

ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లను చూపి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది.

Updated : 04 Oct 2023 07:37 IST

ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు నగరంలో ఓ సుపారీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలకు గురిచేసి.. పిస్టళ్లను చూపి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసింది. ఎట్టకేలకు బాధితుడు మంగళవారం రాత్రి పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకకు చెందిన అన్నే కాంతారావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. పరిచయస్థుడైన సీహెచ్‌ వినయ్‌ రెడ్డి చెప్పగా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన దాట్ల బాలవెంకటసత్యనారాయణ అలియాస్‌ సతీష్‌రాజుకు కాంతారావు 2017 నుంచి 2019 వరకు విడతల వారీగా రూ.50 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏళ్లు అవుతున్నా సతీష్‌రాజు అప్పు చెల్లించలేదు. గత నెల 19న బెంగళూరు సీబీఐ కోర్టుకు వినయ్‌రెడ్డి, సతీష్‌రాజు వస్తున్నారని తెలుసుకుని కాంతారావు అక్కడికెళ్లి వారిని నిలదీశారు. త్వరలో చెల్లిస్తామని గడువు ఇవ్వాలని కోరారు.

బాకీ తీర్చమంటే..చంపేస్తాం.. డబ్బులిస్తామని చెప్పి కాంతారావును వినయ్‌రెడ్డి, సతీష్‌రాజులు గత నెల 27న ఏలూరులోని ఓ హోటల్‌కు రప్పించి గదిలో ఉంచారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. తాము ఎస్‌ఎఫ్‌టీ తెలంగాణ పోలీసులమని.. అరెస్టు చేస్తామని బెదిరించారు. రెండు, మూడు రోజులు అక్కడే ఉంచి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత ఓ కారులో బలవంతంగా ఎక్కించి తాడేపల్లిగూడెం వైపుగా నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారు. గ్యాంగులోని నలుగురిలో ముగ్గురి వద్ద పిస్టళ్లు ఉన్నాయి. ఒకరు కాంతారావు నుదుటిపై పిస్టల్‌ పెట్టారు. మరో ఇద్దరు గాల్లోకి, నేలపై కాల్పులు జరిపారు. నువ్వు రూ.50 లక్షలు వదిలేసుకోవాలని, బాకీ మర్చిపోతే బతికిపోతావని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. భయభ్రాంతులకు గురైన కాంతారావు అలాగే చేస్తానని అంగీకరించడంతో అతన్ని మళ్లీ హోటల్‌కు తీసుకొచ్చి వినయ్‌రెడ్డి, సతీష్‌రాజులకు అప్పగించారు. మ్యాటర్‌ సెటిల్‌ అయ్యిందని.. కాంతారావు అప్పు అడగడని.. మీరు నిర్భయంగా ఉండవచ్చని చెప్పి ఆ గ్యాంగ్‌ సభ్యులు వెళ్లిపోయారు.

కీలక సూత్రధారి ఎవరు?

మ్యాటర్‌ సెటిల్‌ చేస్తానని తాడేపల్లిగూడెం నుంచి నిందితులను నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. హోటల్‌ గదిలో సుపారీ గ్యాంగ్‌ సభ్యులు కాంతారావును కొడుతున్న సమయంలో వీడియో తీసి ఓ వ్యక్తికి చూపించే వారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్‌ సీఐ చంద్రశేఖరరావు గ్యాంగ్‌ సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అలాగే ప్రధాన నిందితులైన సతీష్‌రాజు, వినయ్‌రెడ్డిల కోసం కూడా గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని