logo

Guntur: బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స

అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే ఆ రోగి మెలకువగా ఉండటమే కాదు.. అతనికి ఎంతో ఇష్టమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించారు.

Updated : 20 Feb 2024 08:23 IST

గుంటూరు శ్రీసాయి ఆసుపత్రిలో ఉచితంగా సర్జరీ 

రోగి మణికంఠతో డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, త్రినాథ్‌ తదితరులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే ఆ రోగి మెలకువగా ఉండటమే కాదు.. అతనికి ఎంతో ఇష్టమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించారు. దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడాన్ని రోగి టీవీలో చూస్తూ భక్తితో పరవశం చెందుతున్న సమయంలోనే సర్జరీ పూర్తి చేయడం విశేషం. గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పిటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరోసర్జన్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి సర్జరీ వివరాలు వెల్లడించారు. అత్యంత ఖరీదైన ఈ సర్జరీని పూర్తి ఉచితంగా చేశామన్నారు. ఆయన తెలిపిన వివరాలివే..

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన దానబోయిన మణికంఠ(29) కొంత కాలంగా ఫిట్స్‌ వీడకుండా వేధిస్తూనే ఉన్నాయి. ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో గుంటూరులోని శ్రీ సాయి ఆసుపత్రిలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెదడులో అత్యంత కీలకమైన ప్రాంతంలో 7 సెం.మీ పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించాం. వెంటనే మణికంఠ మెదడు త్రీ-డీ మ్యాప్‌ తయారుచేసుకున్నాం. కుడి చేయి, గొంతు, మాటల పనితీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉండటంతో రోగి మెలకువగా ఉన్న సమయంలోనే మెదడుకు సర్జరీ చేయాలని నిర్ణయించాం. ఈ నెల 11వ తేదీన ఓ వైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు రోగికి ఇష్టమైన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించాం. రోగి స్పృహలో మాట్లాడుతుండగానే మెదడుకు సర్జరీ పూర్తి చేసి కణితిని తొలగించాం. శస్త్రచికిత్స మధ్యలో రెండు చేతులతో బాలరాముడికి నమస్కరించారు. మెదడు సర్జరీలో ఎక్కడ ఎంత వరకూ తీయొచ్చు? దేన్ని ముట్టుకోకూడదు? అన్నది కీలకం. ఈ ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ‘నావిగేషన్‌’ వంటి అత్యాధునిక విధానాలను అనుసరించాం. నావిగేషన్‌ సాయంతో కచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడో గుర్తించి అక్కడే తెరిచి కణితిని తొలగించొచ్చు. గతంలో చిన్న కణితులను తొలగించాల్సి ఉన్నా.. దాన్ని చేరుకోవడానికి తల మీద పెద్ద ప్రాంతం తెరవాల్సి వచ్చేది. రోగి పూర్తిగా కోలుకున్నందున సోమవారం హాస్పిటల్‌ నుంచి డిశ్ఛార్జి చేశాం. ఈ సర్జరీలో తనతో పాటు మత్తు వైద్యులు త్రినాథ్‌, న్యూరోసర్జన్‌ ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

టీవీలో బాలరాముడిని చూస్తూ నమస్కరిస్తున్న మణికంఠ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని