logo

Palnadu: ప్రేమించకుంటే.. చంపేస్తా.. వైకాపా ఉపసర్పంచి కుమారుడి నిర్వాకం

సత్తెనపల్లి మండలంలో ప్రేమించాలని ఇంటర్‌ విద్యార్థినికి వేధింపులు తీవ్రమయ్యాయి.. ఇంట్లో వాళ్లకి చెప్పి స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం వైకాపా నేత కుమారుడి కావడమే.. ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

Updated : 16 Mar 2024 08:09 IST

అధికార ఉన్మాదం
వేధింపులు తట్టుకోలేక మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

సత్తెనపల్లి మండలంలో ప్రేమించాలని ఇంటర్‌ విద్యార్థినికి వేధింపులు తీవ్రమయ్యాయి.. ఇంట్లో వాళ్లకి చెప్పి స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం వైకాపా నేత కుమారుడి కావడమే.. ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇప్పటికీ కూడా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు వినుకొండ మండలంలో వాలంటీరు కుటుంబ సభ్యులు ఓ వివాహితను అందరూ చూస్తుండగా పరుగెత్తించి దాడి చేశారు. కళ్ల ముందు అంత జరుగుతున్నా, ఆ వాలంటీరు చూస్తూ ఉన్నాడే తప్ప ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.  

ఈనాడు డిజిటల్‌-నరసరావుపేట, సత్తెనపల్లి గ్రామీణ-న్యూస్‌టుడే: జిల్లాలో యువతులపై వైకాపా నాయకుల వేధింపుల పర్వం ఆగడం లేదు. ఇటీవల నరసరావుపేట మండలంలో వాలంటీరు వేధింపులతో ఓ బాలిక ఆత్మహత్యాయత్నం ఘటన మరువక ముందే సత్తెనపల్లి మండలంలో వైకాపాకు చెందిన ఉప సర్పంచి కుమారుడి వేధింపులతో మరో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించాలని వెంటపడుతుండటంతో పరీక్షల సమయంలోనే ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామ ఉప సర్పంచి, వైకాపా నాయకుడు తవిటి ఆంజనేయులు కుమారుడు, వారి సమీప బంధువు కుమార్తె సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆమెను ప్రేమిస్తున్నాంటూ మూడు నెలలుగా ఉప సర్పంచి కుమారుడు వెంట పడుతున్నాడు. ప్రేమించకపోతే చంపుతానని బెదిరించసాగాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. బాలుడిని మందలించాలని వారి తల్లిదండ్రులకు బాలిక అమ్మానాన్న చెప్పినా అతడిలో మార్పులేదు. తనపై ఇంట్లో ఫిర్యాదు చేస్తావా.. అంటూ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇద్దరిదీ ఒకే పరీక్ష కేంద్రం కావడంతో పరీక్ష రాయడానికి వెళుతున్న సమయంలో మరోసారి తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఓ పక్క పరీక్షలు.. మరోవైపు వేధింపులు.. ఒత్తిడిని తట్టుకోలేక బాలిక ఈనెల 12న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటీన ఆమెను సత్తెనపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు తల్లిదండ్రులు తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒక నర్సు, రక్షణగా పోలీసును పరీక్ష కేంద్రానికి పంపారు. శుక్రవారం ఆఖరి పరీక్ష రాసిన తర్వాత బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. యువకుడిపై ఫిర్యాదు చేసి మూడురోజులైనా చర్యలు లేవని మీడియా ఎదుట వాపోయారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వాపసు తీసుకోవాలని వైకాపా నాయకులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన చెందారు. లేనిపక్షంలో మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. తన రెండో కుమార్తె హైస్కూలులో చదువుతోందని, ఆమె వెంట కూడా యువకుడు పడుతున్నట్లు తల్లి ఆవేదనతో చెప్పింది. తన పెద్దకూతురు చావుబతుకుల్లో ఉందని, తమకు న్యాయం జరగాలని కోరారు. ఈ ఘటనపై గ్రామీణ సీఐ రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన రోజే బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.


వాలంటీరు సమక్షంలో కుటుంబసభ్యుల దాడి

అవమాన భారం తట్టుకోలేక  ఎలుకల మందు తాగిన వివాహిత

వినుకొండ రూరల్‌, న్యూస్‌టుడే: ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందిన గృహిణి. ప్రభుత్వ పథకాలు అందించడానికి వాలంటీరు ఆమె ఇంటికి వస్తూ పోతుంటాడు. ఇదే ఆమె పాలిటశాపమైంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం అంటగడుతూ వాలంటీరు తల్లి, భార్య నాలుగేళ్లుగా ఆమెను వేధిస్తున్నారు. వేధింపులు తీవ్రమవడంతో అవమానం భరించలేక శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వినుకొండ మండలం జాలలపాలెంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. జాలలపాలేనికి చెందిన ఓ మహిళ భర్త వినుకొండలోని కూరగాయల దుకాణంలో పని చేస్తుంటాడు. వీరికి ఓ పాప ఉంది. గ్రామంలో వాలంటీరుగా పని చేస్తున్న గుడిపాటి బాచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్పుడప్పుడు వారి ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళకు వాలంటీరుతో వివాహేతర సంబంధం అంటగడుతూ నాలుగేళ్ల నుంచి అతని భార్య నాగజ్యోతి, తల్లి పున్నమ్మలు వేధిస్తున్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆమెపై దాడికి పాల్పడ్డారు. శుక్రవారం బాధితురాలి భర్త వినుకొండలోని కూరగాయల దుకాణానికి వెళ్లగా వీరిద్దరూ మరోసారి మహిళ ఇంటికి వచ్చి దూషించి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితురాలు పరుగు తీసినా వెంటపడి మరీ కొట్టారు. అంత జరుగుతున్నా అక్కడే ఉన్న సదరు వాలంటీరు తన భార్య, తల్లిని ఆపే ప్రయత్నం చేయలేదు. అవమానం భరించలేక బాధితురాలు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం తెలిసి ఆమె భర్త, ఇరుగుపొరుగు వచ్చి వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనలపై వాలంటీరుతోపాటు అతని భార్య, తల్లిపై పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. వాలంటీరు కుటుంబం నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన వారని, వాలంటీరుగా పని చేస్తుండడంతో ఇంతకాలం పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామన్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ గ్రామస్థులను విచారించిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని