logo

AP news: 45 మంది వాలంటీర్ల తొలగింపు

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుండా వైకాపా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు.

Updated : 21 Mar 2024 07:39 IST

ములుకుదురులో పంచిన కార్డులు

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుండా వైకాపా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. చేబ్రోలు మండలంలో వైకాపా అభ్యర్థి అంబటి మురళి వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తొలి రోజు(ఈనెల 16వ తేదీ)నే నిబంధనలు ఉల్లంఘించారని ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఉన్నతాధికారులు నివేదిక సమర్పించాలని సూచించడంతో విచారించిన అధికారులు సమావేశంలో 37 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా పెదకాకాని మండలానికి సంబంధించి వెనిగండ్ల గ్రామంలోని మైత్రి కల్యాణ మండపంలో వైకాపా అభ్యర్థి వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తక్కెళ్లపాడు, వెనిగండ్ల, పెదకాకాని గ్రామాల నుంచి 8 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ మండల అభివృద్ధి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

రాత్రివేళ ఓటరు కార్డుల పంపిణీ

పొన్నూరు, న్యూస్‌టుడే : వైకాపా నేతలకు వాలంటీర్లు తొత్తులుగా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ పాటించని వారిపై అధికారులు చర్యలు చేపడుతున్నా లెక్క చేయడం లేదు. రహస్యంగా రాత్రి సమయంలో ఓటర్ల గుర్తింపు కార్డులను వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. వైకాపాకు మద్దతు పలకాలని ప్రచారం చేస్తున్నారు. పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చెందిన ఓటర్ల గుర్తింపు కార్డులను జిల్లా ఉన్నతాధికారులు తపాలశాఖ ద్వారా పంపారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వైకాపా నాయకులు తపాల శాఖ సిబ్బందిని సంప్రదించి ఓటర్ల గుర్తింపు కార్డులు వాలంటీర్లకు ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. వాలంటీర్లు రాత్రి సమయంలో ఇంటింటికీ తిరుగుతూ గుర్తింపు కార్డులను అందజేస్తున్నారు. కొంత మంది వాలంటీర్లు వైకాపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిందని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు పలకాలంటూ ప్రచారం చేస్తున్నారు. తపాలశాఖ సిబ్బంది పంపిణీ చేయాల్సిన గుర్తింపు కార్డులు వాలంటీర్లు అందజేయడం ఏమిటిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని