logo

కంచు మోతలే.. సరైన వసతులేవి మామ!

‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు.

Published : 17 Apr 2024 04:23 IST

హాస్టళ్లలో విద్యార్థులకు తప్పని తిప్పలు
పల్నాడు జిల్లాలో  ఇదీ పరిస్థితి

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్‌ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు. పేదవర్గాల వసతి గృహాలు చూస్తే ఆయన గొప్పలు మాటల్లోనే అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనని తెలుస్తుంది. పల్నాడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతి గృహాల నిర్వహణ తీసికట్టుగా మారింది. ఈ ఐదేళ్లలో ఒక్కపని చేస్తే ఒట్టు. దీంతో ఈ వసతిగృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. జిల్లాలో బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ప్రీమెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 86 ఉన్నాయి. ఇందులో అయిదు వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 34 బీసీ వసతి గృహాల్లో 21చోట్ల వార్డెన్లు లేరు. ఇన్‌ఛార్జి వార్డెన్లతో నెట్టుకొస్తున్నారు. సరిపడా విద్యార్థులు లేక ఓ మూడు వసతి గృహాలు మూతపడ్డాయి. జిల్లాలో ఏకైక మైనార్టీ వసతి గృహం తెదేపా హయాంలో నరసరావుపేట సమీపంలో ములకలూరు వద్ద నిర్మించి ప్రారంభించారు. వైకాపా వచ్చాక అడ్మిషన్లు తీసుకోకపోవడంతో మూతపడింది.

తరగతి గదిలోనే నిద్ర

చిలకలూరిపేట పట్టణం: చిలకలూరిపేట పురుషోత్తపట్నం ఎస్టీ గురుకుల పాఠశాలలో అసౌకర్యాల మధ్య విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ మొత్తం 84 మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల పాఠశాలలో 8 గదులు ఉన్నాయి. దీనిలో వంటగది, ప్రిన్సిపల్‌ రూమ్‌, స్టాఫ్‌రూమ్‌, స్టోర్‌ రూములకు నాలుగు గదులు ఉపయోగిస్తున్నారు. మిగిలిన నాలుగు చిన్న చిన్న గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదుల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, పెట్టెలు కూడా ఆ గదుల్లోనే ఉంచుతున్నారు. రాత్రికి తరగతి గదిలోనే నిద్రపోతుంటారు. గదులు ఇరుకుగా ఉండటంతో విద్యార్థులకు పూర్తి అసౌకర్యంగా మారింది. కిటికీలకు ఏర్పాటు చేసిన నెట్‌లు చిరిగిపోయాయి.

దోమలతో సహవాసం..

గురజాల గ్రామీణ: దాచేపల్లిలోని బీసీ గురుకుల వసతి గృహంలో 156 మంది విద్యార్థులు ఉన్నారు. 20 మందికి ఒకటి చొప్పున 8 గదులున్నాయి. దుప్పట్లు అరకొరగా ఇచ్చారు. గ్లాసులు, ప్లేట్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్నింటికీ తలుపులు లేవు. మరుగుదొడ్లలో ట్యాప్‌లు లేవు. నీరు సరిగా రాక దుర్వాసన వెదజల్లుతోంది. కిటికీలకు తలుపులు లేవు. మెస్‌ అమర్చక పోవడంతో దోమకాటుతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

2018 నాటి  మెస్‌ బిల్లులే

వసతిగృహాల్లో విద్యార్థుల మెస్‌ బిల్లులు 2018 తర్వాత పెంచనే లేదు. వసతిగృహాల్లో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపని పరిస్థితి. వసతిగృహాల్లో చేరికలకు తక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న మెస్‌ ఛార్జీలు చాలకపోవడంతో పాటు పెరిగిన ధరలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు వీలు కావడం లేదని వసతిగృహాల వార్డెన్లు చెబుతున్నారు.

పైకప్పు పెచ్చులూడి..

వినుకొండ: పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్‌ వసతి గృహంలో 100 మంది విద్యార్థులున్నారు. 1982లో ప్రారంభించిన వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి పడుతోంది. కిటికీలకు తలుపులు ఊడిపోతున్నాయి. గత్యంతరం లేక విద్యార్థులు అందులోనే ఉంటున్నారు. అందరికీ కలిపి మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అవీ సక్రమంగా లేవు. కామన్‌ గదిలోనే స్నానాలు చేస్తున్నారు. ప్లేట్లు కడుక్కునేందుకు ట్యాప్‌లు లేవు. అంట్లు తోమే ట్యాప్‌ వద్దనే శుభ్రం చేసుకుంటున్నారు. ఈ భవనం నివాస యోగ్యం కాదని గతంలోనే ఇంజినీర్లు నిర్ణయించినా అందులోనే కొనసాగిస్తున్నారు. కొత్త భవనం నిర్మించే వరకు అద్దె భవనంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని గతంలో అధికారులు చెప్పారు. ఇంతవరకు మార్చలేదు. విద్యార్థులు అందులోనే ఉండాల్సిన దుస్థితి.

ఆరుబయటే స్నానం..

నరసరావుపేట లింగంగుంట్లలోని ఎస్సీ వసతి గృహంలో స్నానపు గదులే లేవు. విద్యార్థులంతా ఆరుబయటే స్నానం చేయాల్సిన దుస్థితి. మరుగుదొడ్లు, కొళాయిలకు ట్యాప్‌లు లేవు. మోటార్‌ ఆన్‌ చేసి డైరెక్టుగా నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి. బకెట్లు లేవు. స్నానం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాప్‌లు బిగిస్తామని చెప్పి నెలలు అవుతున్నా ఇంతవరకు బిగించలేదు. విద్యాసంవత్సరం కూడా ముగుస్తోంది. పల్నాడురోడ్డులోని మరో ఎస్సీ వసతిగృహం దారుణంగా ఉంది. శుభ్రత లోపించింది. అన్ని గదులూ శిథిలావస్థకు చేరుకున్నాయి. స్నానాల గదులను శుభ్రపరచడం లేదు. కిటికీల తలుపులు ఊడిపోయాయి. అంతేకాకుండా శ్లాబు పెచ్చులూడిపోయాయి. కిటికీల వద్ద గోడలు ధ్వంసమయ్యాయి. రెండు వసతిగృహాల్లో కలిపి వందకుపైగా విద్యార్థులు అవస్థల మధ్యే చదువుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని