logo

మేము దాచుకుంది.. నీ నవరత్నాల కోసం కాదు

ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్‌ లీవ్‌, డీఏ, జీపీఎఫ్‌.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు.

Published : 17 Apr 2024 04:28 IST

ఉద్యోగుల సొమ్ము ఇవ్వకుండా ప్రభుత్వం గారడీ
పెండింగ్‌లోనే సరెండర్‌ లీవ్‌లు, డీఏలు

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘ నాయకుల ధర్నా (పాత చిత్రం)

కలెక్టరేట్‌(గుంటూరు), జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్‌ లీవ్‌, డీఏ, జీపీఎఫ్‌.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు. ఇందుకోసం ప్రతి నెలా ఎంతో కొంత జమ చేసుకుంటారు. పిల్లల చదువుల కోసమని, పెళ్లికని, సొంత ఇంటి నిర్మాణానికి.. ఇలా అనేక రకాల ప్రణాళికలతో ఉద్యోగులు సొమ్ము దాచుకున్నా.. మళ్లీ నగదు తీసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. అవసరం కోసం పొదుపులో కొంత నగదును తీసుకోవడానికి దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చెల్లించని పరిస్థితి. చివరకు ఆందోళన బాట పట్టి రోడ్డెక్కితే.. అప్పటికి ఓ గడువు నిర్ణయించి బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. నెలులు గుస్తున్నా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వ సొమ్ముతో సహా, ఉద్యోగులు దాచుకున్న వాటిని కూడా నవరత్నాలకు ఖర్చు చేసి ఇబ్బందులు పెడుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ పోషణకు పాట్లు

రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ప్రతి నెలలో ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. మూడు నెలలకోసారి విడుదల చేస్తుండటంతో కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల ఫీజులు చెల్లించేందుకు, అనారోగ్యాలకు గురై ఆస్పత్రుల్లో చేరినప్పుడు చేతిలో డబ్బులు లేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ఒకే క్యాడర్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేస్తున్నారని రాష్ట్ర సంఘం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

  • నాలుగో తరగతి సిబ్బంది జీతాల మీదనే ఆధార పడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జీపీఎఫ్‌, సరెండర్‌ లీవులు నెలలుగా విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో గత ఫిబ్రవరిలో జీపీఎఫ్‌ విడుదల చేసింది. కుటుంబాల అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులు, వడ్డీలు తీర్చేందుకు ఉపయోగపడటం మినహా ఉద్యోగులకు ఉపయోగపడలేదని రాష్ట్ర సంఘం నాయకుడు పేర్కొన్నారు.

ఎన్నిసార్లు అడిగినా.. :

ఘంటసాల శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు

గడచిన మూడేళ్లుగా సరెండర్‌ లీవు డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదు. అడిగితే వాయిదాలు వేస్తూ వస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కటంటే ఒక్క డీఏ ఇచ్చిన సందర్భం లేదు. ఉద్యోగులు ఎన్నో ఆశలతో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం వారికిష్టమొచ్చినట్లుగా ఉపయోగించుకుంటోంది. ఉద్యోగులకు సంబంధించిన సొమ్మును వారికి సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉంది.

ఆప్షన్‌ మాత్రం లేదు :

శెట్టిపల్లి సతీష్‌కుమార్‌, ఏపీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి

ఏప్రిల్‌, జూన్‌లో డీఏలు ఇస్తామని ప్రభుత్వం చెప్పి జీవోలు ఇచ్చింది. అయితే ఈ నెలలో రావాల్సి ఉన్నా.. ఇంత వరకు రాలేదు. ఆన్‌లైన్‌లో డీఏకు సంబంధించిన వివరాలు ఏవీ కనిపించడం లేదు. నమోదు చేసుకుందామంటే ఎక్కడా ఆప్షన్‌ కనిపించడం లేదు.

మూడేళ్లుగా మొండిచేయి...

సరెండర్‌ లీవ్‌ల నగదు కోసం  ఉద్యోగులు ఏడాదికి ఒకసారి దరఖాస్తు పెట్టుకుంటారు. అదే పోలీసు శాఖలో ఉద్యోగులకు రెండుసార్లు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏటా ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే డబ్బులను సదరు ఉద్యోగి ఖాతాలో జమ చేసేవారు. వైకాపా సర్కారులో గడిచిన మూడేళ్లుగా సరెండర్‌ లీవు డబ్బులను ఉద్యోగులకు జమ చేయడం లేదు. వేలాది మంది ఉద్యోగులు డబ్బులు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రతిసారీ ఒక తేదీ ప్రకటించడం, అప్పటి వరకు చూసి డబ్బులు జమ కాలేదని రోడ్డెక్కితే.. మరో తేదీ ప్రకటిస్తూ సర్కారు మొండిచేయి చూపుతోంది. ఏదొక అవసరానికి ఉపయుక్తంగా ఉంటుందనుకుంటే.. ఆ డబ్బులు రాక బయట అప్పులు తెచ్చుకుని అత్యవసరాలకు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొందని గగ్గోలు పెడుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని