logo

కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!

బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్‌లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి

Published : 20 Apr 2024 05:38 IST

ప్రజల ప్రాణాలు తోడేస్తున్న వంతెనలు
శిథిలావస్థకు చేరినా చోద్యం చూస్తున్నారు
ఐదేళ్లలో ఒక వంతెన నిర్మించని ప్రభుత్వం

జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ వంతెనలు 482

శిథిలావస్థకు చేరినవి 112

పాత చెన్నై రహదారిలో కప్పల వాగుపై కుంగిన వంతెన

 ఈనాడు-బాపట్ల, న్యూస్‌టుడే-ఇంకొల్లు, బాపట్ల, చెరుకుపల్లి గ్రామీణ: బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్‌లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆంగ్లేయుల పాలన నుంచి నేటి ఆంధ్రుల పాలన వరకూ నిర్మించిన కీలకమైన వంతెనలు శిథిలావస్థకు చేరినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. పాతవి పాడైపోవడంతో ఆయా వంతెనలపై రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త వంతెనల నిర్మాణం చేపట్టకపోగా, పాత వాటికి కనీసం మరమ్మతు చేసేందుకు కూడా నిధులు లేక నిర్వహణ అటకెక్కింది. వంతెనలు కుంగిపోవడం, ప్రమాదకరంగా గోతులు పడటంతో అక్కడ చెట్ల కొమ్మలు, ముళ్ల కంచె పెట్టి అటువైపు వెళితే ప్రమాదకరం అని బోర్డులు పెట్టిన దుస్థితి. కొన్ని వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండటంతో సమయం, ఇంధనం వృథా అవుతోంది.

జిల్లాలోని ఆక్వాసాగు ఎక్కువగా ఉన్నందున చెరువులను చేరుకునేందుకు సరైన రహదారులు లేవు. చాలాచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరాయి. తీర ప్రాంతానికి వచ్చేటప్పటికి మురుగుకాలువల విస్త్రృతి పెరగడంతో వంతెనలు ఎక్కువగా నిర్మించారు. ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరి అధ్వానంగా ఉన్నాయి.  నిజాంపట్నం నుంచి నగరం మండల కేంద్రాల మధ్య ముత్తుపల్లి వద్ద వంతెన పాడయింది. నిజాంపట్నం మండలంలో అడవులదీవి, పల్లెపాలెం మార్గంలో ప్రధానమైన వంతెన అధ్వానంగా ఉంది. దీంతో ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందిగా మారింది. కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణలో భాగంగా కొన్ని కల్వర్టులు, వంతెనలు నిర్మించారు. ఇవి మినహా గత రెండు దశాబ్దాల కాలంలో పాత వంతెనల స్థానంలో ఆర్‌అండ్‌బీ యంత్రాంగం ఒక్కటీ నిర్మించలేదు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో నిర్వహణకే నిధులు ఇవ్వలేదు. వంతెన కూలిపోతే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడం మినహా మరో గత్యంతరం లేదు. కొత్త వంతెనల ఊసే లేకుండా పోయింది.

అయిదేళ్లుగా అదే నరకయాతన

ఇంకొల్లు మండలం వంకాయలపాడు దగ్గర పాత చెన్నై రహదారిపై ఉన్న కప్పలవాగు వంతెన కూలిపోయింది. బ్రిటీషు కాలంలో నిర్మించిన వంతెన కూలి ఐదేళ్లయినా పునర్నిర్మాణం జరగకపోవడంతో గమనార్హం. ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాలను కలిపే కీలకమైన పాత చెన్నై మార్గంలో వంతెన కూలినా కనీసం ప్రభుత్వం స్పందించలేదు. రైతులు పంట ఉత్పత్తులను తరలించడానికి, పర్చూరు అద్దంకి నియోజకవర్గ ప్రజలు రాకపోకలు సాగించేందుకు అత్యంత కీలకమైన రహదారి కావడంతో లక్షల సంఖ్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలం వస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. వంతెన పక్కన రాకపోకలకు వాగులో అప్రోచ్‌ రోడ్డును తాత్కాలికంగా నిర్మించారు. అయితే వర్షం కురిస్తే వాగులోకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనగాలలో కర్రలే ఆధారం

చెరుకుపల్లి మండలం కనగాల - ధూళిపూడి మార్గంలో వంతెన వద్ద ‘ఎస్‌’ ఆకారంలో మలుపు ఉంటుంది. వంతెనకు ఓ వైపు నీటిని నిలిపే షట్టర్‌, రెండో పక్క రక్షణ గోడ ఉండేవి. మలుపు వద్ద వాహనాలు ఢీకొట్టడంతో గోడ కూలి కాల్వలో పడింది. దశాబ్దాలుగా రక్షణ గోడలేకపోయింది. రాత్రిళ్లు మలుపు తిరిగే క్రమంలో వాహనదారులు నేరుగా కాల్వలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఏటా కనీసం 50 ప్రమాదాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. 2018లో ఈ వంతెన తొలగించి కొత్త వంతెన నిర్మాణానికి పనులు మొదలు పెట్టారు. 2019లో ఎన్నికలు రావడంతో పనులను పట్టించుకోలేదు. ఆ తరువాత వచ్చిన వైకాపా సర్కార్‌ ఈ పనుల గురించి మర్చిపోయారు. ఇప్పటికే వంతెన కింద కాంక్రీట్‌ తొలగి ఇనుప చువ్వలు  కనిపిస్తున్నాయి. వాహనచోదకులు ప్రమాదాల బారినపడకుండా కర్రలను పెట్టారు.
బాపట్ల మండలం బేతపూడి వద్ద పేరలి కాలువపై 90ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన రక్షణ గోడ దెబ్బతింది. ఈ మార్గంలో 30 ఏళ్ల క్రితం రాత్రి సమయంలో బస్సు అదుపు తప్పి కాలువలో పడి నలుగురు మరణించారు. వెదుళ్లపల్లి, మురుకుండపాడు, కంకటలెం, నరసాయపాలెం, చెరుకూరు, పర్చూరు మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. కొత్త వంతెన నిర్మాణానికి రూ.10 కోట్లు కావాల్సి ఉంది. కనీసం దెబ్బతిన్న రక్షణ గోడ పునరుద్ధరణకు వైకాపా ప్రభుత్వం రూపాయి కేటాయించలేదు.

ప్రమాదాలు సర్వసాధారణం.

కొల్లూరు వద్ద బ్యాంక్‌ కెనాల్‌పై వంతెన నిర్మించి 80 సంవత్సరాలు దాటింది. ప్రస్తుతం దీనిపై భారీ వాహనాలు తిరుగుతుండటంతో వంతెన దెబ్బతింది. దీన్ని ఆనుకుని ఉన్న పడవల కాలువపై వంతెన శిథిలావస్థకు చేరింది. దీంతో ఇక్కడ తరచూ  ప్రమాదాలు జరుగుతున్నాయి.


ఇంకెంత మంది బలి కావాలి

ఇంకొల్లు మండలంలో పలు రహదారుల్లో వంతెనలు ప్రమాదకరంగా మారి పలువురి ప్రాణాలు బలిగొంటున్నాయి. ముఖ్యంగా దుద్దుకూరు దగ్గర పాత చెన్నై రహదారితో యారకాలువ వాగు(చిన్నవాగు) ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. చిన్న వర్షం కురిసినా వాగుపొంగి రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. గత దశాబ్దకాలంలో వాగు దాటుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇడుపులపాడు, సూదివారపాలెం మధ్య సాగరు కాలువపై నిర్మించిన వంతెన పాడైపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంతరావూరు సమీపంలో వంతెనకు రక్షణ గోడలు కూలిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముప్పవరం ఆర్‌అండ్‌బీ రహదారిలో అప్పేరు వాగుపై నేలచప్టా కారణంగా వర్షాకాలంలో వాగు పొంగుతోంది. గతంలో గంగవరానికి చెందిన మహిళ వాగులో కొట్టుకు పోయి మృతి చెందింది. ప్రాణాలు బలిగోరుతున్నా వైకాపా ప్రభుత్వం వంతెన మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని