logo

కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు

దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్‌ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Published : 24 Apr 2024 07:00 IST

కర్లపాలెం సభలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఎంపీ అభ్యర్థి జేడీ శీలంను పరిచయం చేస్తున్న షర్మిల, చిత్రంలో బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి గంటా అంజిబాబు

బాపట్ల, కర్లపాలెం, న్యూస్‌టుడే : దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్‌ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. కర్లపాలెంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్‌ న్యాయయాత్ర సభలో షర్మిల సీఎం వైఎస్‌ జగన్‌, వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైకాపా ఐదేళ్ల పాలన అంతా దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యమని షర్మిల ధ్వజమెత్తారు. తెదేపా వాళ్లు కిటికీలు మాత్రమే దోచారన్నారు. వైకాపా నేతలు మాత్రం ఏకంగా గడపలనే దోచేశారని మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇసుక మాఫియా డాన్‌, భూబకాసురుడని ఆరోపించారు. జగనన్న కాలనీలకు భూసేకరణలో తన బినామీలతో తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి రూ.కోట్లు దోచుకుతిన్నాడన్నారు. ఇలాంటి దొంగ కోన రఘుపతికి మరలా వైఎస్‌ జగన్‌ బాపట్ల అసెంబ్లీ సీటు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బాపట్లను పూర్తిగా దోచుకోవడానికే రఘుపతికి వైకాపా టిక్కెట్ ఇచ్చి పోటీలో నిలిపారన్నారు. ప్రజలు బాగా ఆలోచించి ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేసి వైకాపా ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతిని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, ఎమ్మెల్యే అభ్యర్థి గంటా అంజిబాబుకు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జేడీ శీలం మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిపించిన వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ ఐదేళ్లలో గ్రామాల్లోకి వచ్చి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో బాపట్ల అలాగే ఉందని, ఎమ్మెల్యే కోన రఘుపతి మాత్రం ఆర్థికంగా ఎక్కువగా అభివృద్ధి చెందారని ఎద్దేవా చేశారు.

బారికేడ్లు తొలగించకపోవడంపై ఆగ్రహం

కర్లపాలెం సభకు వచ్చిన షర్మిల తొలుత స్థానిక ప్రజలు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. న్యాయయాత్ర బస్సు పక్క, వెనుక భాగంగా ప్రజలు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్లు తొలగించి జనాన్ని ముందుకు పంపించాలని పోలీసులను ఆమె పదే పదే మైకులో కోరారు. అయినా పోలీసులు స్పందించకపోవటంతో షర్మిల అసంతృప్తికి లోనయ్యారు. సభను అడ్డుకోవటానికి పెట్టారా.. అని ఓ దశలో పోలీసులపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమడ వాగు ఏటా పొంగి లక్షల ఎకరాల్లో పంటలు మునిగి దెబ్బతిని రైతులు రూ.వందల కోట్లు నష్టపోతున్నారని షర్మిల ప్రసంగంలో ఉటంకించారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నల్లమడ వాగు ఆధునికీకరణ పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మిగ్‌జాం తుపానుకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నేటికి సాయం అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని