logo
Published : 06/12/2021 02:27 IST

మొర ఆలకిస్తారు.. భరోసా కల్పిస్తారు

స్టేషన్లలో అందుబాటులో ఫిర్యాదుల కౌంటర్‌
పోలీసుల పనితీరుపైనా అభిప్రాయాల సేకరణ
న్యూస్‌టుడే, వికారాబాద్‌
ఇల్లు కాదు.. పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌ కౌంటర్‌

* గత నెల 20న వికారాబాద్‌ పోలీస్‌ ఠాణాలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణపై ఇరు వర్గాలపై కేసు నమోదైంది. ఈ విషయమై కాల్‌ సెంటర్‌ నుంచి ఓ యువతి ఇరు వర్గాల వారికి ఫోన్‌ చేసి.. పోలీసుల ప్రవర్తనపై వివరాలు అడిగి తెలుసుకుంది. డబ్బులు ఏమైనా డిమాండ్‌ చేశారా? లేదా? అని ఆరా తీసింది.


* మరో కేసులోనూ బాధితునికి ఫోన్‌ చేసి పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉందా? మీతో ప్రవర్తించిన తీరు ఎలా ఉందన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా.. ప్రతి కేసులోనూ వివరాలు సేకరిస్తుండటంతో పోలీసుల ప్రవర్తన, వ్యవహారశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.


ప్రతి ఫిర్యాదుదారునికి సముచిత మర్యాద, గౌరవం కల్పించడానికి జిల్లాలోని 19 పోలీస్‌ఠాణాల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అన్ని ఠాణాల రిసెప్షన్‌ కేంద్రాలను ఆధునికీకరించారు. హైదరాబాద్‌ తరహాలో రెండేళ్ల కిందటి నుంచి జిల్లాలోనూ ఫిర్యాదుదారుల అభిప్రాయ సేకరణ (సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌) చేపట్టారు. ఠాణాల వారీగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడు వచ్చిన వెంటనే తాగేందుకు నీళ్లు, కూర్చునేందుకు కుర్చీ వేసి స్వాంతన చేకూరుస్తున్నారు. అనంతరం వారి సమస్యను ఓపికగా విని, అవసరమైతే వారే ఫిర్యాదు రాసిచ్చి, స్వీకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

సమూల మార్పులకు శ్రీకారం..

రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీసు వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా స్నేహ పూర్వక పోలీసింగ్‌ (ఫ్రెండ్లీ పోలీసింగ్‌) విధానాన్ని క్షేత్రస్థాయి నుంచి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరితో గౌరవ, మర్యాదలు పాటించడం తప్పనిసరని కచ్చితమైన సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా పోలీసుల పనితీరును పరిశీలించేందుకు ఫిర్యాదుదారుల అభిప్రాయ సేకరణ చేపట్టారు.  

ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగింత

ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయ సేకరణ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అవకతవకలకు తావు లేకుండా సేకరణ బాధ్యతలను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.దీనికి పోలీసుశాఖతో ఎలాంటి సంబంధాలు ఉండవు. ప్రతిరోజు వీరు ఠాణాలవారీగా నమోదైన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)ల వివరాలను సేకరిస్తారు. అందులో నమోదు చేసిన ఫిర్యాదుదారుని చరవాణి సంఖ్యకు ఫోన్‌ చేసి మాట్లాడతారు. వివరాలను హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన నియంత్రణ కేంద్రానికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. తరువాత  ఫిర్యాదుదారునితో పాటు అవసరమైతే బాధితునితోనూ మాట్లాడుతున్నారు.  

అంచనా వేస్తున్నారు

కేవలం రక్షక భట నిలయాధికారులు మాత్రమే కాకుండా మిగతా పోలీసు సిబ్బంది పనితీరును సైతం అభిప్రాయ సేకరణ ద్వారా అంచనా  వేస్తున్నారు. ఒకవేళ ఠాణా నిలయాధికారి అంతా సవ్యంగా వ్యవహరించినా కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదుదారులతో కఠినంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇందుకు సదరు నిలయాధికారినే బాధ్యున్ని చేస్తున్నారు.

* జిల్లాలో మొత్తం పోలీస్‌ఠాణాలు: 19 (మహిళా ఠాణాతో కలిపి)

* పనితీరును పరిశీలించే రక్షకభట నిలయాధికారులు: 19 మంది

* డీఎస్పీలు: ముగ్గురు (వికారాబాద్‌,తాండూర్‌, పరిగి).


మర్యాదపూర్వకంగా మసలుకోవాల్సిందే...
- నారాయణ, జిల్లా పోలీసు అధికారి

పోలీస్‌ఠాణాల్లో ఇదివరకటి పరిస్థితి లేదు. అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. ఎవరినైనా పరుష పదజాలంతో దూషించడం, దండించడం వంటి పరిస్థితులు పోయాయి. ఠాణాలకు కారులో వచ్చినా, సైకిల్‌పై వచ్చినా ఇరువురి పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాల్సిందే. మర్యాదలో తేడా వస్తే ఊరుకునేది లేదు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని