logo
Published : 06 Dec 2021 02:27 IST

అప్రమత్తత.. సన్నద్ధత

మూడో ముప్పు ఎదుర్కొనేందుకు వైద్యాధికారుల ఏర్పాట్లు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ


భౌతిక దూరం లేదు.. మాస్కులు లేవు

జిల్లాలో మొదటి, రెండో దశ కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను నగరానికి చేర్చి చికిత్సలు జరిపించినా, రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. రెండో విడతలో చాలా మంది శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గి ప్రమాదకర పరిస్థితికి చేరారు. 50 మంది మరణించినట్లు అధికార లెక్కలు చెబుతున్నా, అనధికారికంగా 400 మంది వరకు ఉంటారని అంచనా. నివారణకు టీకా పంపిణీ ముమ్మరం చేసి, ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మూడో దశలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం కనిపించడంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమై ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


జిల్లాలో కరోనా ప్రభావం తగ్గలేదు. ఇటీవల తాండూరులో మళ్లీ వెలుగు చూసింది. మరోవైపు వివాహాలు, విందులు అధికమయ్యాయి. బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌లో, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే ఎక్కడా రక్షణ చర్యలు కనిపించడంలేదు. మాస్కులను మరిచిపోయారు. భౌతిక దూరం సంగతి సరేసరి. బస్సుల్లో కిక్కిరిసి వెళుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మంత్రి సమీక్ష: మంత్రి సబితారెడ్డి జిల్లా వైద్యాధికారులు, అధికారులతో వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈనెలాఖరు నాటికి 100 శాతం టీకాలను పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం తదితర కరోనా నియంత్రణ చర్యలను ప్రజలు కొనసాగించాలని అన్నారు. అంతేకాకుండా ఆమె వికారాబాద్‌ పట్టణం రాజీవ్‌గృహ కల్పలో పర్యటించి టీకాలు వేయించుకోవాలని ప్రజలను కోరారు.

పడకలు.. పరికరాలు

ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్తు పరిధి ఆసుపత్రుల్లో అన్నింటా అనుసరించాల్సిన కార్యాచరణను జిల్లా వైద్యారోగ్య శాఖ రూపొందించింది. ప్రత్యేక పడకలు, పరికరాలు, మందులు తదితర ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా ఆసుపత్రి తాండూరులో 100 పడకలు సిద్ధంగా ఉంచారు. వీటిలో 50 పడకలు మహిళలకు 50 పురుషులకు కేటాయించారు. వికారాబాద్‌ అనంతగిరి క్షయ ఆసుపత్రిలో 30 పడకలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచారు. చాలా ప్రాంతాల్లో వీటిని దాతలు విరాళంగా ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.


రెండో డోసుకు దూరంగా..

వ్యాక్సిన్‌ తొలి డోస్‌పై జిల్లాలో అమిత ఆసక్తి చూపారు. ఆస్పత్రుల వద్ద బారులు తీరారు. రెండో డోసు విషయంలో ఈ పరిస్థితి కనిపించలేదు. ఇప్పటి వరకు జిల్లాలో మొదటి డోసు 82 శాతం తీసుకోగా రెండో డోసు కేవలం 20 శాతం మాత్రమే తీసుకున్నారు. మొదటి డోసు తీసుకోని రెండో డోసుకు అర్హులైన వారు 27,646 మంది ఉన్నారు. వీరికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి టీకాలను తీసుకునేలా చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితిలో వివాహాలు, ఇతర విందులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని,  వెళ్లినా తగిన జాగ్రత్తలు తప్పనిసరి సూచిస్తున్నారు.  


ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: డాక్టర్‌ తుకారాంభట్‌, జిల్లా వైద్యాధికారి

కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో కలెక్టర్‌ పర్యవేక్షణలో యంత్రాంగం అప్రత్తంగా ఉంది. టీకా పంపిణీ విషయంలో వైద్య సిబ్బంది శ్రమిస్తున్నారు. తక్కువ సంఖ్యలో తీసుకున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో  పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాణవాయువు పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాం.


ఆదేశాలకు అనుగుణంగా..: డాక్టర్‌ జీవరాజ్‌, జిల్లా ఉప వైద్యాధికారి

మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశాలకు అనుగుణంగా టీకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. కరోనా రెండు దశల పరిణామాలతో అనుభవాన్ని సాధించాం. గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి ఆశ కార్యకర్తలు టీకా వేస్తున్నారు. పంచాయతీల్లో, వార్డుల్లో ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రక్రియ కొనసాగిస్తున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని