logo

అన్నదాత బయట.. వ్యాపారి లోపల!

నగరంలోని రైతుబజార్లలో వ్యాపారులదే హవా కొనసాగుతోంది. శాశ్వత దుకాణాలను ఏర్పాటు చేసుకొని దర్జాగా వ్యాపారాలు చేసుకుంటుంటే.. రైతులు మాత్రం ఎక్కడ స్థలం దొరికితే అక్కడ లేదంటే.. రైతు బజారుకు చేరువలో, బయట అమ్ముకొని వెళ్తున్నారు. అమ్ముకునేందుకు సరైన వసతి లేకపోవడంతో తెచ్చిన కూరగాయలను

Updated : 09 Dec 2021 04:37 IST

రైతు బజార్లలో దళారులదే హవా

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని రైతుబజార్లలో వ్యాపారులదే హవా కొనసాగుతోంది. శాశ్వత దుకాణాలను ఏర్పాటు చేసుకొని దర్జాగా వ్యాపారాలు చేసుకుంటుంటే.. రైతులు మాత్రం ఎక్కడ స్థలం దొరికితే అక్కడ లేదంటే.. రైతు బజారుకు చేరువలో, బయట అమ్ముకొని వెళ్తున్నారు. అమ్ముకునేందుకు సరైన వసతి లేకపోవడంతో తెచ్చిన కూరగాయలను కొద్దిసేపు అమ్మి.. మిగిలిన వాటిని అక్కడి దుకాణదారులకు ఇచ్చేసి.. ఎంతిస్తే అంత తీసుకుని వెనుదిరుగుతున్నారు.

వేచి చూసి.. తర్వాత ధర పెంచేసి..
రైతులున్నంత వరకూ వారితో పోటీగా కూరగాయలు అమ్మి.. వాళ్లు వెళ్లాక ధరలు పెంచేస్తున్నారు అక్కడి శాశ్వత దుకాణదారులు. ఇక అక్కడి నుంచి మొదలౌతుంది వ్యాపారుల అరాచకం. బోర్డు మీద ఉన్న ధరలు నాణ్యమైన కూరగాయల ధరలే అయినప్పటికీ.. వ్యాపారి దగ్గర ఉన్న కూరగాయలు కాస్త బాగుంటే.. ఆ ధరలు మాకు కుదరదంటూ బెట్టు చేస్తారు. ఇదే సమయంలో నాసిరకం కూరగాయలు కూడా బోర్డు ధరను చూపించి అమ్మేస్తారు. ఈ విషయాలన్నీ ఎస్టేట్‌ అధికారి దృష్టికి రాకుండా.. అక్కడ రైతుబజారు సూపర్‌వైజర్లు జాగ్రత్త పడతారు. ఒక వేళ రైతుబజారు ఎస్టేట్‌ అధికారి దృష్టికి వచ్చినా.. సూపర్‌వైజర్‌ సర్ది చెప్పేస్తారు.  

నిఘా కరవు..
రైతు బజార్ల నిర్వహణను వ్యవసాయ మార్కెటింగ్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదు. దళారులవి, వ్యాపారులవి శాశ్వత దుకాణాలుండగా.. రైతులు ఎప్పుడు వస్తారు? ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతకి అమ్ముతున్నారు? అనే విషయాలపై నిఘా లేకుండా పోయింది. రైతుల దగ్గరికి వెళ్లి వ్యాపారులు సరకు కొనేసి.. ఇక మీరు వెళ్లండి అంటూ ఎంతో కొంత చేతిలో పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. రైతులకు 70 శాతం దుకాణాలుండాలి. కానీ ఏ రైతు బజారులోనూ అలాంటి పరిస్థితి లేదు. అయినా ఎస్టేట్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రైతు బజార్లలో 70 శాతం మంది రైతులుండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని