logo

నకిలీ పట్టాలు... విదేశాల్లో కొలువులు

అమెరికాలో ఎంఎస్‌ చేయాలా?.. లండన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలా?.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కొలువులు కావాలా?. ఇచ్చేస్తామంటూ కొందరు అక్రమార్కులు విద్యార్థులు.. ఉద్యోగార్థులను నమ్మించి రూ.లక్షల్లో తీసుకుని విదేశాలకు పంపుతున్నారు..

Published : 19 Jan 2022 03:59 IST

ప్రముఖ వర్సిటీల ఇంజినీరింగ్‌, డిగ్రీ సర్టిఫికేట్లు
రూ.75 వేలకే ఇస్తున్న కన్సల్టెన్సీలు
ఈనాడు, హైదరాబాద్‌

నవీద్‌

మెరికాలో ఎంఎస్‌ చేయాలా?.. లండన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలా?.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కొలువులు కావాలా?. ఇచ్చేస్తామంటూ కొందరు అక్రమార్కులు విద్యార్థులు.. ఉద్యోగార్థులను నమ్మించి రూ.లక్షల్లో తీసుకుని విదేశాలకు పంపుతున్నారు.. విదేశీ యూనివర్సిటీలు, కార్పొరేటు సంస్థలకు అనుమానాలు రాకుండా ప్రముఖ వర్సిటీల్లో చదివినట్టు... తక్కువమార్కులు వచ్చినవారికి ఎక్కువ మార్కులు వచ్చినట్టు నకిలీ పట్టాలు, మార్కుల జాబితాలు తయారు చేస్తున్నారు. ఆశావాహులు నగదు ముట్టజెప్పిన అనంతరం వారికి నకిలీ పట్టాలుఇస్తున్నారు. విదేశాలకు పంపుతున్నారు. ఇలా కొద్దినెలల్లోనే 500 మందికిపైగా ఉద్యోగార్థులు నకిలీ పత్రాలతో పలు దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులు కొద్దిరోజుల క్రితం క్యూబెజ్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలో దాడులు నిర్వహించగా.. ఇంజినీరింగ్‌, డిగ్రీ నకిలీ పట్టాలు కనిపించాయి. వరంగల్‌ పోలీసులు వారం రోజుల క్రితం మరో ముఠాను పట్టుకున్నారు..

హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్రాలుగా.. నకిలీపట్టాలు తయారు చేస్తున్న ముఠాలు హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో పదుల సంఖ్యలో ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అర్హతలు లేకున్నా విదేశాలకు పంపుతున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌, వరంగల్‌ పోలీసులు గతనెలలో వేర్వేరుగా కన్సల్టెన్సీలపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ పోలీసులు రెండు కన్సల్టెన్సీలు, వరంగల్‌ పోలీసులు 21 కన్సల్టెన్సీల్లో తనిఖీలు చేశారు. ఆయా కన్సల్టెన్సీల్లో ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, ఆంధ్రా, ఆచార్య నాగార్జున, జేఎన్‌టీయూ హైదరాబాద్‌, మగధ, బుందేల్‌ఖండ్‌, కర్ణాటక ఓపెన్‌ యూనివర్సిటీ, మహరాష్ట్ర ఎస్‌ఎస్‌సీబోర్డు, చెన్నైలోని సత్యభామ, అన్నా యూనివర్సిటీ, జాతీయ ఓపెన్‌ స్కూల్‌కు చెందిన నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లో క్యూబెజ్‌ కన్సల్టెన్సీ యజమాని సయ్యద్‌ నవీద్‌ను విచారించగా. తనకు అమెరికా, బ్రిటన్‌, స్కాట్‌లాండ్‌లలోని విదేశీ వర్సిటీలతో ఒప్పందాలున్నాయన్నాడు. ఒక్కో పట్టాకు రూ.75వేల నుంచి రూ.లక్ష తీసుకుంటున్నానని వివరించాడు. వరంగల్‌లో రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


హాలోగ్రామ్‌ మాయ.. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ..

విదేశీ వర్సిటీలు, కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామంటూ అక్రమాలు చేస్తున్న కన్సల్టెన్సీలు అక్కడి విశ్వవిద్యాలయాలు, కార్పొరేటు కంపెనీలను మాయచేసేందుకు నకిలీ సర్టిఫికేట్లను అసలైన పట్టాల్లా తయారు చేస్తున్నారు. వీసా సేవల కన్సల్టెన్సీలతో అక్రమార్కులు సత్సంబంధాలు నిర్వహిస్తుండడంతో ఎక్కడా అనుమానాలు రావడం లేదు.  ః పట్టాలను తయారు చేసేటప్పుడు అప్పట్లో ఉన్న ఉపకులపతుల పేర్లు తెలుసుకుని సంతకాలు పెడుతున్నారు. హాలో గ్రాములూ తయారు చేస్తున్నారు.

* ఎలాంటి అర్హతలు లేకుండా విదేశాల్లో చదివేందుకు వెళ్లేవారికి ఒక ధర, ఇంజినీరింగ్‌, డిగ్రీల్లో తక్కువ మార్కులు వచ్చినవారి మార్కుల జాబితాల్లో ఎక్కువ వేసి మరో ధర వసూలు చేస్తున్నారు.

* క్యూబెజ్‌ కన్సల్టెన్సీ యజమాని నవీద్‌ యూకేలోని టీసైడ్‌, బ్లాక్‌పూల్‌, అమెరికాలోని షిల్లర్‌, కంకోర్డియా విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు వీలుగా విద్యార్థులకు నకిలీ పట్టాలను తయారుచేసి పంపాడు. వరంగల్‌లోని వేర్వేరు కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్న రవి అవినాశ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఎక్కువగా ఐరోపాలోని వేర్వేరు దేశాలకు విద్యార్థుల్ని పంపించారు.

* హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి నకిలీ పట్టాలతో వెళ్లిన విద్యార్థులు ఇంకా చదువుకుంటుండగా... సుమారు 500మంది వేర్వేరు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనులు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని