logo
Updated : 22 May 2022 06:07 IST

90 క్షణాల్లోనే.. వంద దేశాల పేర్లు

చిరుప్రాయంలోనే అపార ప్రతిభ కనబరుస్తున్న బాలికలు
ఈనాడు, హైదరాబాద్‌

నం ఏవైనా 10-15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తుపెట్టుకుని చెప్పాలంటే.. ముందు వెనుకా ఆలోచిస్తుంటాం..! 20 దేశాల జాతీయ జెండాల ఆధారంగా పేర్లు చెప్పాలన్నా తటపటాయిస్తుంటాం..!

అలాంటిది చిరుప్రాయంలో ఇద్దరు చిన్నారులు అపారమైన ప్రతిభ కనబరుస్తున్నారు. సరదాగా నేర్చుకోవడం ప్రారంభించి.. అనంతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు గౌరిశెట్టి ఖేయ, ఇష్య. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. నిమిషాల వ్యవధిలోనే దాదాపు 700కుపైగా ప్రశ్నలకు చకాచకా సమాధానాలు చెబుతూ ఎన్నో రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు.

కూకట్‌పల్లికి చెందిన గౌరిశెట్టి వరుణ్‌, లలిత దంపతులకు ఖేయ(9), ఇష్య(7) కుమార్తెలున్నారు. వరుణ్‌ స్థిరాస్తి వ్యాపారి.. లలిత అర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. శంకర్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఖేయ నాలుగో తరగతి చదువుతుండగా.. ఇష్య రెండో తరగతి విద్యార్థిని. మూడేళ్ల వయసులో జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకుని చెబుతుండటంతో.. చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని గమనించి భౌగోళిక అంశాలు, ప్రపంచంలోని వింతలు, విశేషాలపై తర్ఫీదు ఇవ్వాలని తల్లిదండ్రులు భావించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన వేళ.. ప్రపంచ దేశాల పేర్లు, జాతీయ జెండాలు, మ్యాప్‌ల ఆధారంగా గుర్తించడం, భారత్‌లోని సందర్శనీయ స్థలాలు, రాష్ట్రాల రాజధానులు.. తదితర అంశాలను నేర్పించారు. ప్రత్యేక శిక్షకుడి సాయంతో ఐదారు నెలల్లోనే ఆయా అంశాలను నేర్చుకున్నారు. నిత్యం గంట నుంచి రెండు గంటలపాటు గరిష్ఠ వేగంతో సమాధానాలు చెప్పేలా సాధన చేశారు. ప్రపంచపటంలో 195 దేశాల పేర్లు, వంద దేశాల జెండాలు, 41 చారిత్రక ప్రదేశాలు, దేశనాయకుల పేర్లు.. ఇలా అనేక అంశాలు ఔపోసన పట్టారు.


ఇదీ ప్రతిభ

ప్రపంచపటాన్ని చూసి జాతీయ జెండాల ఆధారంగా వంద దేశాల పేర్లను కేవలం 90 సెకన్లలో ఖేయ చెప్పగలదు. ఇష్య రెండు నిమిషాల్లోనే 195 దేశాల పేర్లు, ప్రపంచదేశాల జెండాలను చూసి వంద దేశాల పేర్లు తప్పుల్లేకుండా చెప్పగలుగుతుంది. అలాగే, ఇటీవల జరిగిన సృజనోత్సవ్‌-2022 పోటీల్లో నృత్య విభాగంలో తొలిస్థానం దక్కించుకుని గవర్నర్‌ తమిళిసై నుంచి అవార్డునూ అందుకుంది.


ఇవి అవలీలగా చెప్పేస్తారు..

జాతీయ జెండాల ఆధారంగా వంద దేశాల పేర్లు, ప్రపంచపటంలో 195 దేశాల గుర్తింపు, 30 భారతీయ సందర్శన స్థలాలు, 41చారిత్రక కట్టడాలు, 35 క్రీడల సామగ్రి, 54 మంది నాయకులు, 36 మంది వృత్తినిపుణులు, వంద దేశాలు, దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులు, ఎనిమిది గ్రహాల పేర్లు, 1-19 వరకు గణింతాలు, ప్రపంచంలోని ఏడు వింతలు, పది నదులు, జంతువుల నివాసాలు, వాటి పిల్లల పేర్లు ఠక్కున చెప్పగలరు.


సాధించిన రికార్డులివీ..

ఈ బాలికల ప్రతిభకు ఎన్నో రికార్డులు దాసోహమయ్యాయి. ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’, ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘సూపర్‌ కిడ్‌ రికార్డ్‌’, ‘క్రియేటివ్‌ రికార్డ్స్‌’లోనూ వీరికి చోటు దక్కింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని