logo
Published : 24 May 2022 03:09 IST

మాకు తెలియకుండా బదిలీలా!

 మంత్రులు, ఎమ్మెల్యేల ఆగ్రహం.. ఉత్తర్వుల్లో మార్పులు
 బాధ్యతలు స్వీకరించని పోలీసు అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌

‘‘హైదరాబాద్‌లో పోలీసు అధికారులంటే మాకు ఇష్టమైనవారుండాలి.. మేం ఫోన్‌ చేస్తే పలికేవారే కీలక పోస్టుల్లో ఉండాలి. ఇందుకు విరుద్ధంగా మీ ఇష్టానుసారంగా, మాకు తెలియకుండా బదిలీలు చేస్తారా..! వెంటనే ఆపండి, మేం చెప్పేంతవరకూ వారు బాధ్యతలు స్వీకరించవద్దని చెప్పండి..’’

-పోలీసు ఉన్నతాధికారులతో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న మాటలివి.

నగరంలోని కొన్ని ఠాణాలు, డివిజన్ల పరిధుల్లో తమకు పనులుంటాయని, తమతో చెప్పకుండా ఎవరినీ బదిలీ చేయవద్దంటూ సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో ఇద్దరు ఏసీపీల బదిలీలు ఆగిపోయాయి. ఇందులో ఎల్బీనగర్‌ ఏసీపీగా పోస్టింగ్‌ లభించిన సి.అంజయ్య బాధ్యతలు స్వీకరించేలోపు ఆయన బదిలీ ఉత్తర్వులు మారిపోయాయి. ఎల్బీనగర్‌ ఏసీపీ(ట్రాఫిక్‌)గా బాధ్యతలు స్వీకరించాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు పంజాగుట్ట ఏసీపీగా నియమితులైన కె.నర్సింగరావును బాధ్యతలు చేపట్టొద్దంటూ ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించడంతో ఆయన ఆ కార్యాలయానికి సోమవారం వెళ్లలేదు.

పట్టు నిరూపించుకునేందుకు..

పోలీసు అధికారుల పోస్టింగుల్లో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఆ శాఖ ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. జిల్లాల్లో ఎస్‌ఐ నుంచి డీఎస్పీ పోస్టుల వరకు ప్రజాప్రతినిధుల సిఫారసులుండాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు చెబితే బదిలీలు, పోస్టింగులు వాటంతటవే వచ్చేస్తాయి. రాజధానిలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులుండటం శాంతి భద్రతలు, ఇతర కోణాల్లో.. పోలీసు అధికారుల పోస్టింగులు, బదిలీలపై ప్రజాప్రతినిధుల పాత్ర పరిమితమే. కొన్ని నెలలుగా జోన్లు, మల్టీజోన్ల ద్వారా బదిలీలు జరగడం, జిల్లాల్లో వారు ఇక్కడికి వస్తుండటంతో నగరం, ఇతర జిల్లాల్లో ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలోనూ పట్టు నిరూపించుకునేందుకు తాము సూచించినవారికే పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఉన్నతాధికారులు వినని పక్షంలో పైస్థాయి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మరీ బదిలీలు చేయించుకుంటున్నారు.

రాజధానిలోనూ... 

అవసరమైన చోట పోస్టింగ్‌ కావాలంటే మూడు పోలీస్‌ కమిషనరేట్లలో అంత సులువు కాదు. వ్యక్తిగత ప్రవర్తన, వృత్తిపరంగా సాధించిన ఘనతలు, నేర పరిశోధనలో అనుభవం వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. కొద్దినెలలుగా ఇక్కడా ప్రజాప్రతినిధులు, మంత్రుల నుంచి ఉత్తరాల పర్వం మొదలైంది.

* మధ్య మండలంలో  ఇటీవల ఓ ఇన్‌స్పెక్టర్‌ బదిలీకి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలిసి ఆ అధికారి రాష్ట్ర మంత్రిని ఆశ్రయించారు. ఆయన ఉత్తరంలో ప్రస్తుతం బదిలీ ఆగిపోయింది.

* ఉత్తర మండలంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఇన్‌స్పెక్టర్‌పై కొద్దినెలలుగా అవినీతి ఆరోపణలున్నాయి. రెండునెలల కిందట ఆయన బదిలీకి నిర్ణయించగా.. మరో రాష్ట్ర మంత్రి జోక్యంతో ఆగిపోయింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని