logo

ఇంధన పొదుపు.. ఆదాయం పెంపు

‘కలిసి శ్రమిద్దాం.. సమష్టిగా సాధిద్దాం’ నినాదంతో ఆర్టీసీ ‘జాతిరత్నాలు’ పేరిట వంద రోజుల పండగకు శ్రీకారం చుట్టింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇంధన పొదుపు, ఆదాయం పెంపునకు ప్రతి నెలా పది మంది డ్రైవర్లు మరో పది మంది కండక్టర్లను జాతిరత్నాలుగా

Published : 27 May 2022 01:34 IST

‘జాతిరత్నాలు’ పేరిట ఆర్టీసీ డిపోల్లో వంద రోజుల పండగ


కండక్టర్‌కు నగదు ప్రోత్సాహకం అందిస్తున్న ఆర్‌ఎం

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: ‘కలిసి శ్రమిద్దాం.. సమష్టిగా సాధిద్దాం’ నినాదంతో ఆర్టీసీ ‘జాతిరత్నాలు’ పేరిట వంద రోజుల పండగకు శ్రీకారం చుట్టింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇంధన పొదుపు, ఆదాయం పెంపునకు ప్రతి నెలా పది మంది డ్రైవర్లు మరో పది మంది కండక్టర్లను జాతిరత్నాలుగా గుర్తించి నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తోంది. ఫలితంగా ఉద్యోగులు, సిబ్బందిలో నూతన ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతోంది. అధికారులు, ఉద్యోగుల్లో సమష్టి బాధ్యతను గుర్తించేలా ప్రారంభించిన ఆర్టీసీ వందల రోజుల పండగపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జూన్‌ 16 వరకు..

మెదక్‌ రీజియన్‌ పరిధిలో సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఎనిమిది డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో 676 బస్సులు ఉన్నాయి. నిత్యం 2.56 లక్షల కి.మీ. తిరుగుతూ 1.50 నుంచి 1.60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ సగటున రూ.69.11 లక్షల మేర ఆదాయం సమకూరుస్తున్నాయి. రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల్లో 2,839 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సజ్జానార్‌ బాధ్యతల స్వీకరణ తర్వాత సరికొత్త పంథాలో ప్రజా రవాణా సంస్థ ప్రత్యేకత చాటుతూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా వంద రోజుల పండగ పేరుతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని చేపడుతున్న జాతిరత్నాలు కార్యక్రమం సఫలీకృతం అవుతోంది. ఏప్రిల్‌ 17న ప్రారంభమైన పండగ జూన్‌ 16వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతి నెలా ఒక్క సెలవు లేకుండా అద్వితీయ పనితీరుతో డ్రైవర్లు ఇంధన పొదుపు పాటిస్తు ఉత్తమ కేఎంపీఎల్‌, కండక్టర్లు రూట్‌ ఆధారంగా నిర్దేశించిన లక్ష్యం కన్నా అత్యధికంగా ఆదాయం (ఈపీకే) సాధించడంతో జాతిరత్నాలుగా గుర్తిస్తున్నారు.

ఎంపిక చేస్తూ.. ప్రోత్సహిస్తూ..

రీజియన్‌లోని సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, మెదక్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ డిపోల్లో వంద రోజుల పండగలో పది మంది చొప్పున ఎంపికైన డ్రైవర్‌, కండక్టర్‌ జాతిరత్నాలను ప్రతి నెలా నిర్దేశించిన తేదీల్లో నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌ఎం సహా రీజియన్‌ స్థాయి అధికారులు డీఎంతో కలిసి పాల్గొని విందు భోజనాలు చేస్తారు. సిబ్బందితో కలిసి భోజనం చేస్తే డిపోల్లోని సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై స్నేహపూర్వకంగా ఆరా తీయవచ్చు. తక్షణంగా పరిష్కరించే వాటిని అప్పకప్పుడు పరిష్కరిస్తూ ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది.

అందరి కృషితోనే సాధ్యం: రజనీకృష్ణ, డిపో మేనేజర్‌, జహీరాబాద్‌

సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను అందరి కృషితో సాధిస్తున్నాం. రీజినల్‌ మేనేజర్‌ మార్గదర్శకాలతో వందల రోజుల పండగ జాతిరత్నాలు విజయవంతంగా సాగుతోంది. ఉద్యోగులు ఆదాయం, ఇంధన పొదుపు కోసం పోటాపోటీగా పనిచేయడం సంతోషంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని