logo

పని పేరుతో మోసం.. తప్పించుకోబోయి మృతి

పనిచేస్తానని ఒప్పందం చేసుకొని ముగ్గురిని మోసం చేసి పట్టుబడి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి జారిపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Published : 28 May 2022 02:03 IST

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: పనిచేస్తానని ఒప్పందం చేసుకొని ముగ్గురిని మోసం చేసి పట్టుబడి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి జారిపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్‌ వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌ గుప్తా (39) బోరబండ రాజీవ్‌గాంధీనగర్‌ ప్రాంతానికి వచ్చి నగరంలో పలుచోట్ల కార్పెంటర్‌గా పనిచేశాడు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధి శ్రీరామ్‌నగర్‌ కాలనీలో సూర్యతేజ అపార్ట్‌మెంట్‌లో కార్పెంటర్‌గా చేసేందుకు ఒప్పందం కుదిరింది. 204 ఫ్లాట్‌లో పని సరిగా చేయకపోవడంతో యజమాని శ్రీధర్‌ అతన్ని తొలగించడంతో అదే అపార్ట్‌మెంట్‌లో 203 ఫ్లాట్‌కి సంబంధించి యజమాని చంద్రశేఖర్‌ వద్ద పని కుదుర్చుకున్నాడు. అక్కడ చేస్తూనే మరోచోట పని ఒప్పుకొని యజమాని తిరుమలేశ్‌ నుంచి రూ.18 వేలు తీసుకుని అక్కడ కూడా సరిగా పనిచేయకపోవడంతో యజమాని నిలదీశాడు. అప్పటికే సూర్యతేజ అపార్ట్‌మెంట్‌లో కొంత పనిచేసిన దానికి సంబంధించి మెటీరియల్‌ మీదేనంటూ డబ్బులిచ్చిన తిరుమలేశ్‌ను నమ్మించాడు. అలా వారంపాటు కాలయాపన చేసి పనిచేయలేదు. శుక్రవారం సదరు యజమాని అతన్ని సూర్యతేజ అపార్ట్‌మెంట్‌ వద్ద పట్టుకోవడంతో అంతకుముందు పనిచ్చిన ఇద్దరు యజమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి నుంచి తప్పించుకునే క్రమంలో అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులోని 203 ఫ్లాట్‌ వంట గది బాల్కనీ నుంచి జారిపడ్డాడు. సుశీల్‌ తలకు, చేతులకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని