logo

చెరువును డంపింగ్‌ యార్డులా మార్చారేం?

హైదరాబాద్‌లోని మజీద్‌ బండ చెరువులో పెద్దఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని గతేడాది జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దక్షిణాది జోన్‌(చెన్నై) సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణలు కొనసాగుతున్నాయి. ఎన్జీటీకి సంయుక్త కమిటీ

Published : 29 May 2022 02:04 IST

 ఆక్రమణదారులెవరో తేల్చి క్రిమినల్‌ చర్యలు తీసుకోండి: ఎన్జీటీ 

ఈనాడు, చెన్నై: హైదరాబాద్‌లోని మజీద్‌ బండ చెరువులో పెద్దఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయని గతేడాది జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దక్షిణాది జోన్‌(చెన్నై) సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణలు కొనసాగుతున్నాయి. ఎన్జీటీకి సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. మజీద్‌ బండ చెరువుకు ఎఫ్‌టీఎల్‌ సర్వే నిర్వహించారు. దీనికి ఎగువన ఉన్న కుడికుంట నుంచి దిగువకు నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఆక్రమణలున్నాయి. మరోవైపు ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం.. చెరువు విస్తీర్ణంలో మార్పులొచ్చాయి. నిర్మాణ వ్యర్థాలు పడేయడం, కార్మికుల షెడ్లను నిర్మించడం లాంటివి చేశారు. అక్కడి చిత్తడి నేలను డంపింగ్‌ యార్డులా వాడుకుంటూ, పెద్ద ఎత్తున గ్రావెల్‌ను ఉంచినట్లు తేలింది. దీనిపై అక్కడి జిల్లా కలెక్టర్‌తో పాటు జీహెచ్‌ఎంసీలకు ఎన్జీటీ కీలక ఆదేశాలు జారీచేసింది. చెరువు స్థలాల్ని డంపింగ్‌ యార్డుగా వాడి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న వ్యక్తుల్ని గుర్తించి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరం జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, డాక్టర్‌ సత్యగోపాల్‌ కొర్లపాటి ఆదేశించారు. విచారణను జులై 27కు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని