logo

211 ప్రాంతాలు.. యమ డేంజర్‌!

చినుకు పడితే నగరంలో వణుకే. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగి చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలు నగరవ్యాప్తంగా దాదాపు 211 ఉన్నట్లు జలమండలి గుర్తించింది.

Published : 25 Jun 2022 07:33 IST

 భారీగా వరద నిలిచే ప్రాంతాలను గుర్తించిన జలమండలి

ఈనాడు, హైదరాబాద్‌: చినుకు పడితే నగరంలో వణుకే. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగి చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలు నగరవ్యాప్తంగా దాదాపు 211 ఉన్నట్లు జలమండలి గుర్తించింది. చిన్న వర్షానికే ఇక్కడ భారీగా వరద చేరుతోంది. వర్షాకాలం దృష్ట్యా ఇలాంటి చోట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. మొత్తం 16 ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ శుక్రవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఒక్కో బృందంలో అయిదుగురు సభ్యులు ఉంటారు. వారికి ప్రత్యేక వాహనాలు తగిన సరంజమా కేటాయించనున్నారు. నగరంలో పర్యటించే ఈ బృందాలు 211 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిల్వకుండా మ్యాన్‌హోళ్లలో పూడిక తొలగింపు చేపట్టారు. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వస్తే.. వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై దృష్టి సారించారు. ప్రతి బృందానికి ఒక మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాన్ని కేటాయించారు. అప్పటికప్పుడు ఈ యంత్రం ద్వారా మ్యాన్‌హోల్‌లోని పూడిక తొలగించనున్నారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో మెట్రో స్టేషన్‌ కింద వరద నీరు నిలుస్తుండటంతో భారీ పైపులైన్‌ నిర్మించి హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లే బుల్కాపూర్‌ నాలాకు కలిపారు.

మూతలు తొలగిస్తే కేసులు
వానాకాలంలో చాలా మంది తమ సమీపంలోని రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోళ్ల మూతలు తొలగిస్తుంటారు. వాహనదారులు అందులో పడి ప్రాణాలు పొగొట్టుక్నున ఘటనలు ఉన్నాయి. వరద నీరు నిలిస్తే.. జలమండలి వినియోగదారుల సెల్‌ 155313కు ఫోన్‌లో లేదా, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎండీ దానకిషోర్‌ సూచించారు. మ్యాన్‌హోళ్ల మూతలు తొలగించే ప్రయత్నం చేస్తే క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ కాల్స్‌, ఎఫ్‌ఎం రేడియోతోపాటు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. నాలాల్లో చెత్త చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని