logo

ఫ్లెక్సీ.. పోటాపోటీ

అభివృద్ధి ప్రకటనలతో రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ కార్యవర్గ సమావేశాలతో భాజపా నేతలు నగరాన్ని ఫ్లెక్సీ బోర్డులతో ముంచెత్తారు. అధికారికంగా ప్రకటన ఏర్పాటు చేసుకునే ప్రదేశాలన్నింటినీ తెరాస అందిపుచ్చుకుంది.

Published : 30 Jun 2022 02:28 IST

నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన తెరాస, భాజపా నేతలు


పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద మెట్రో పిల్లర్‌కు సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీ, పక్కనే భాజపా నేతల కటౌట్‌

ఈనాడు, హైదరాబాద్‌: అభివృద్ధి ప్రకటనలతో రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ కార్యవర్గ సమావేశాలతో భాజపా నేతలు నగరాన్ని ఫ్లెక్సీ బోర్డులతో ముంచెత్తారు. అధికారికంగా ప్రకటన ఏర్పాటు చేసుకునే ప్రదేశాలన్నింటినీ తెరాస అందిపుచ్చుకుంది. నగరంలోని అన్ని మెట్రో పిల్లర్లు, సంబంధిత రైలుస్టేషన్లు, బస్టాపులు, హోర్డింగులను ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డులతో నింపేసింది. మరోవైపు హెచ్‌ఐసీసీలో జులై 2, 3 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీకి స్వాగతం పలికేలా.. ఆ పార్టీ నేతలూ ఫ్లెక్సీ బోర్డులను భారీగా సిద్ధం చేశారు. ఈ క్రమంలో రోడ్ల పొడవునా, కూడళ్లలో పార్టీ జెండాలు, బ్యానర్లు, కటౌట్లను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు.

వేడి పుట్టించిన బ్యానర్లు..: కొన్నిరోజుల క్రితం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ‘సెలవు దొర’ పేరుతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు.. కేసీఆర్‌ సర్కారును ఉద్దేశిస్తూ డిజిటల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రతిగా.. మోదీ నగరానికి వస్తున్న సందర్భంగా భాజపా వ్యతిరేకులు ‘బై బై మోదీ’ నినాదంతో కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భాజపా సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో.. ప్రత్యర్థులు ఆ చుట్టూ బై బై మోదీ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ప్రజలకు అసౌకర్యం..: బహిరంగ ప్రకటనలు, గోడలపై రాతలు, కరపత్రాలు, ప్లెక్సీ బోర్డులు, హోర్డింగులు, ఇరతత్రా అనధికార ప్రచారాలపై జీహెచ్‌ఎంసీ 2018లో నిషేధం విధించింది. నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసింది. ఆజ్ఞలు అమల్లోకి వచ్చిన కొన్నిరోజుల వరకు ఈవీడీఎం అధికారులు నిబంధనలు పకడ్బందీగా అమలు చేశారు. నగరంలో జరిగిన తెరాస ఆవిర్భావ దినోత్సవాల వేళ, అంతకుముందు కొంగరకలాన్‌లో జరిగిన పార్టీ సమావేశం సమయంలోనూ ఈవీడీఎం చేతులెత్తేసింది. ఇటీవల కాంగ్రెస్‌, భాజపాలూ ఫ్లెక్సీల ప్రచారాన్ని మళ్లీ పట్టాలెక్కించాయి. అయితే, భాజపా నేతలు ప్రస్తుతం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై ఈవీడీఎం చర్యలు ముమ్మరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సెలవు దొర’ పేరుతో ఉంచిన డిజిటల్‌ బోర్డుకు రూ.50వేల జరిమానా విధించి, ప్రకటన ఆపేయాలని ఆదేశించినట్లు సమాచారం. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్డులకు రూ.5లక్షలకుపైగా జరిమానా విధించామని, జరిమానా మరింత పెరగనుందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని