logo

టాస్క్‌ఫోర్సు పేరుతో బెదిరింపులు

టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఒక ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ను విజయవాడ పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. విజయవాడ మొగల్‌రాజ్‌పురం ప్రాంతానికి చెందిన రహమతుల్లా

Published : 07 Jul 2022 02:06 IST

అటవీ శాఖ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఒక ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ను విజయవాడ పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. విజయవాడ మొగల్‌రాజ్‌పురం ప్రాంతానికి చెందిన రహమతుల్లా షరీఫ్‌(55) సోనావిజన్‌ స్టోర్‌ తెలుగు రాష్ట్రాల జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. పది రోజుల కిందట లక్డీకాపూల్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం నుంచి అంటూ ఓ వ్యక్తి ఆయనకు ఫోన్‌ చేశారు. ఒక కేసు వ్యవహారంలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రావాలన్నాడు.   రెండు రోజుల తరువాత రహమతుల్లా హైదరాబాద్‌ చేరుకొని తనకు వచ్చిన చరవాణి నంబరుకు ఫోన్‌ చేయగా యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్‌ వద్ద ఆ వ్యక్తి కలిశాడు. సోనోవిజన్‌లో పనిచేసిన ప్రతాప్‌ అనే వ్యక్తికి సంబంధించి పీఎఫ్‌ డబ్బులు సెటిల్‌ చేయాలని, లేదంటే యజమాని భాస్కరమూర్తిని అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించాడు.  పంజాగుట్ట సోనోవిజన్‌ స్టోర్‌లో ఓ ఏసీని తాను సూచించిన ఇంటికి పంపాలన్నాడు. ఈ క్రమంలో గత నెల 20న విజయవాడకు మరో నలుగురితో కలిసి వెళ్లిన సదరు వ్యక్తి అక్కడున్న యజమాని భాస్కరమూర్తిని కలిశాడు. విషయాన్ని సెటిల్‌ చేసుకోవాలని, లేదంటే గంజాయి కేసులో ఇరికిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో స్టోర్‌ నిర్వాహకులు పోలీసు స్టేషన్‌కు వెళదామనడంతో వచ్చినవారంతా వెళ్లిపోయారు. అనంతరం మళ్లీ ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగడంతో రహమతుల్లా గత నెల 21న విజయవాడ సూర్యారావుపేట పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులతో కలిసి శ్రీకృష్ణానగర్‌లో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అతని పేరు కొనకంచి కిరణ్‌కుమార్‌(30), ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇతనిది ఖమ్మం జిల్లా మధిర మండలం శ్రీపురమని తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 5  లో ఆటోవాలాలను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. కేసును పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని