logo

గణేశ్‌ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం

గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా, శాంతి భద్రతల సమస్యల రానివ్వకుండా అంతా సమష్టిగా పనిచేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందస్తుగా మండప

Published : 19 Aug 2022 02:46 IST

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న స్టీఫెన్‌ రవీంద్ర

ఈనాడు- హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా, శాంతి భద్రతల సమస్యల రానివ్వకుండా అంతా సమష్టిగా పనిచేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందస్తుగా మండప నిర్వాహకులతో ఇన్‌స్పెక్టర్లు సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలని స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లపై స్టీఫెన్‌రవీంద్ర గురువారం ఇన్ఫోసిస్‌ ఆడిటోరియంలో సమీక్షించారు. మాట్లాడుతూ..‘‘ఇప్పటివరకూ జరిగిన అన్ని మతాల వేడుకలు, ఇతర కార్యక్రమాలు సాఫీగా జరిగాయి. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సన్నద్ధమవుదాం.  జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖల అధికారులు, భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు, నిర్వాహకులతో సమన్వయంతో వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతుల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు’’ అని స్పష్టం చేశారు. సైబరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు, డీసీపీలు శిల్పవల్లి, సందీప్‌, జగదీశ్వర్‌రెడ్డి, ఇందిర, కవిత పాల్గొన్నారు.


తప్పుడు పోస్టుల అడ్డుకట్టకు శాంతి కమిటీలు
- హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌

గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే పోస్టులను అడ్డుకునేందుకు శాంతి కమిటీల్లో ఎక్కువ మంది యువకుల్ని ఉంచాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సూచించారు. మండపాల వద్ద సీసీ టీవీ, సరైన భద్రత కల్పించాలని చెప్పారు. గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. నిమజ్జనంలో న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులను సీపీ కోరారు.  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఊరేగింపు మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుదీకరణ తదితర పనులు జరుగుతున్నాయి. వివిధ మార్గాల్లోని పాయింట్లు, వాటి వద్ద ఉండే అధికారుల వివరాలను అందిస్తాం’’ అని పేర్కొన్నారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, విద్యుత్తు, రవాణా శాఖ అధికారులు, గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

నిమజ్జనానికి వాహనాల సమీకరణ

గణేష్‌ నిమజ్జన కార్యక్రమంపై రవాణా శాఖ అధికారులు దృష్టిసారించారు. మండపాల నుంచి విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు అవసరమైన ట్రక్కులు.. లారీ ట్రాలీలను  సమకూర్చుతున్నారు. లారీ అసోసియేషన్‌ ప్రతినిధులు, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి  ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయా వాహనాలను మండపాల నిర్వాహకులకు ఇప్పించనున్నారు. ఈ నెల 31 నుంచి గణేష్‌ ఉత్సవాలు మొదలవనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా వాహనాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని