logo

కొత్త కోర్సులూ నచ్చడం లేదు

డిమాండ్‌ పేరిట కొత్త కోర్సులను ప్రారంభించడం, ప్రవేశాలు కల్పించడం, ఒక ఏడాది చూశాక డిమాండ్‌ లేకపోవడంతో రద్దు చేసుకుంటున్నాయి. జేఎన్‌టీయూ పరిధిలోని పలు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇలా చేశాయి. జేఎన్‌టీయూ గతేడాది కొత్త కోర్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published : 25 Sep 2022 03:54 IST

ఈసారి ఐటీ, ఐవోటీ,  సైబర్‌ సెక్యూరిటీ తదితరాలు రద్దు
సీఎస్‌ఈ, ఏఐఎంఎల్‌కే మొగ్గు
ఈనాడు, హైదరాబాద్

* మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల గతేడాది కొత్తగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) కోర్సు తీసుకొచ్చింది. గత ఏడాది 60 సీట్లతో ప్రవేశాలు తీసుకుంది. డిమాండ్‌ లేకపోవడంతో ఈసారి రద్దు చేసింది. 

* ఇదే ప్రాంతంలోని మరో కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కోర్సును గతేడాది ప్రారంభించింది. 60 సీట్లతో ఆ కోర్సు ప్రారంభించి, ఒక ఏడాది కొనసాగించి తీసేసింది. 

డిమాండ్‌ పేరిట కొత్త కోర్సులను ప్రారంభించడం, ప్రవేశాలు కల్పించడం, ఒక ఏడాది చూశాక డిమాండ్‌ లేకపోవడంతో రద్దు చేసుకుంటున్నాయి. జేఎన్‌టీయూ పరిధిలోని పలు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఇలా చేశాయి. జేఎన్‌టీయూ గతేడాది కొత్త కోర్సులకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమేరకు కొన్ని కళాశాలలు కంప్యూటర్‌ సైన్స్‌లో కృత్రిమ మేధ- మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌)తోపాటు ఐవోటీ, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ వంటి కోర్సులు తీసుకున్నాయి. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) కోర్సును ప్రారంభించాయి. ఒక్కొక్క కోర్సులో 60-120 సీట్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పెద్దగా స్పందన లేకపోవడంతో కొత్త కోర్సులైనప్పటికీ.. ఆయా కళాశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో రద్దు చేసుకున్నాయి. ఈసారి వర్సిటీ పరిధిలోని చాలా కళాశాలలు ఐటీ, సీఎస్‌ఈలో సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఐవోటీ కోర్సులను రద్దు చేసుకున్నాయి. ఈ కోర్సులన్నీ వాస్తవానికి గతేడాదే అందుబాటులోకి తీసుకొచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని ప్రైవేటు కళాశాల సీఎస్‌ఈలోని సైబర్‌ సెక్యూరిటీలో 120 సీట్లు, డేటా సైన్స్‌లో 180 సీట్లు పూర్తిగా ఎతే్తేసింది. మరో రెండు కళాశాలల్లోనూ ఐవోటీ, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు పూర్తిగా మూతపడ్డాయి. 

ఆ రెండింటికే..!

గత కొన్నేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇంజినీరింగ్‌ కళాశాలలు సంప్రదాయ కోర్సులను రద్దు చేసుకుని ఆ కోర్సులనే ప్రవేశ పెట్టారు. ఇందులోనూ ప్రత్యేక విభాగాలు వచ్చాయి. కొత్త సాంకేతికతలు ఉద్భవిస్తుండటంతో తదనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌కే పరిమితం కాకుండా కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి కోర్సులను తీసుకొస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఒకటి లేదా రెండు కోర్సులకే డిమాండ్‌ ఉంటోంది. ఫలితంగా కేవలం కంప్యూటర్‌సైన్స్, సీఎస్‌ఈ-ఏఐ ఎంఎల్‌ కోర్సులనే నిర్వహిస్తున్నాయి. ఆ రెండింటిలోనే సీట్లు పెంచుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని