logo

కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స

పుట్టుకతో మాటలు రాని ఓ మూగబాలికకు కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

Published : 02 Dec 2022 02:24 IST

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: పుట్టుకతో మాటలు రాని ఓ మూగబాలికకు కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 20 నెలల్లో వివిధ పరీక్షలు, మూడు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి గొంతును పలికించడంలో సఫలీకృతమై బాలిక కుటుంబంలో సంతోషాన్ని నింపారు. సిద్దిపేట జిల్లా మద్దూర్‌ మండలం బైరాన్‌పల్లికి చెందిన రైతు రాములు  రెండో కుమార్తె కవిత(17)కు పుట్టుక నుంచి స్వరపేటిక ప్రవేశ భాగంలో పొరలు అడ్డు రావడంతో శ్వాస సమస్యలతో పాటు మాటలు రాలేదు.  తలిదండ్రులు గత సంవత్సరం మార్చిలో ఆమెను కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డా.సంపత్‌కుమార్‌సింగ్‌.. బాలికకు లారీంజెల్‌ వెబ్‌(స్వరపేటిక ఒకదానికొకటి అతుక్కుపోవడం) సమస్య ఉన్నట్టు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం డా.సంపత్‌కుమార్‌సింగ్‌ నేతృత్వంలో డా.దుర్గాప్రసాద్‌, డా.సాహుల్‌హమీద్‌, డా.ఆశీష్‌దొర, డా.మహేశ్వర్‌రెడ్డితో కూడిన వైద్యుల బృందం కవితకు దశలవారీగా చికిత్సతో పాటు 3 శస్త్రచికిత్సలు నిర్వహించింది. ఇక కవితకు శ్వాస సంబంధ సమస్య తీరడంతో పాటు అందరిలా మాట్లాడగలదని, ఒకటి రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని వివరించారు. వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.టి.శంకర్‌, ఆర్‌ఎంఓ డా.జయమనోహరి అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని