logo

మెట్ల బావిని చూస్తే తెలియని ఆనందం

నగరమంటే స్టీలు, కాంక్రీటుతో కట్టిన పెద్ద భవనాలు, వంతెనలు, అండర్‌ పాసులు కాదని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 06 Dec 2022 04:41 IST

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ చప్పట్లు కొడుతున్న మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ యాదవ్‌

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: నగరమంటే స్టీలు, కాంక్రీటుతో కట్టిన పెద్ద భవనాలు, వంతెనలు, అండర్‌ పాసులు కాదని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావిలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకుంటేనే.. నగరాన్ని మెరుగైన పద్ధతిలో భవిష్యత్తు తరానికి అందించినవారమవుతామని వెల్లడించారు. సోమవారం రాత్రి బన్సీలాల్‌పేటలో పునర్నిర్మించిన పురాతన మెట్లబావిని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రారంభించినా దక్కని సంతోషం.. ఈ మెట్లబావిని ప్రారంభిస్తుంటే దక్కిందన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో తెలియని ఆనందం, దుఖం కలిగిందన్నారు. దీని పునరుద్ధరణకు రూ.10 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. ఇకపై మెట్లబావిని కాపాడుకునే బాధ్యత చుట్టుపక్కల ఉన్న స్థానికులదేనని పేర్కొన్నారు. కేటీఆర్‌ సంకల్పంతోనే ఈ బావిని ఇప్పుడిలా అభివృద్ధి చేశామని మంత్రి తలసాని కొనియాడారు. 2 వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ బావిని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములైన పలువురిని మంత్రి కేటీఆర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యం చేసిన రాష్ట్ర సంగీత అకాడమి ఛైర్మన్‌ దీపికారెడ్డి బృందాన్ని కేటీఆర్‌ అభినందించారు. బావి పనులను చేపట్టిన తీరును తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషన్‌ లోకేష్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని