logo

దొంగల ముఠా గుట్టు విప్పిన తెల్లచొక్కా

సంచలనం సృష్టించిన నాగోల్‌ కాల్పుల కేసులో దోపిడీ దొంగల గుట్టు ఒక్క తెల్లచొక్కాతో రట్టయింది.

Updated : 08 Dec 2022 05:26 IST

నాగోల్‌ కాల్పుల కేసు ఛేదించిన పోలీసులు
ఆరుగురి అరెస్టు.. పరారీలో నలుగురు

నిందితులు దోపిడీకి పాల్పడుతున్న దృశ్యాలను చూపిస్తున్న కమిషనర్‌

ఈనాడు- హైదరాబాద్‌, నాగోల్‌, న్యూస్‌టుడే: సంచలనం సృష్టించిన నాగోల్‌ కాల్పుల కేసులో దోపిడీ దొంగల గుట్టు ఒక్క తెల్లచొక్కాతో రట్టయింది. రూ.1.36 కోట్ల విలువైన బంగారం కొట్టేసిన వ్యవహారంలో ఆరుగుర్ని అరెస్టు చేయగా ప్రధాన సూత్రధారి సహా నలుగురు పరారీలో ఉన్నారు. 2.7 కిలోల బంగారం, రూ.65,500, మూడు దేశవాళీ పిస్టళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, ఒక ఎయిర్‌పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం ఎల్బీనగర్‌లో విలేకరులకు వెల్లడించారు.

గతంలో పనిచేసిన పావు: రాజస్థాన్‌కు చెందిన మహేంద్ర కుమార్‌ చౌదరి(35) గజ్వేల్‌లో ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. భారీగా డబ్బు సంపాదించేందుకు దోపిడీకి ప్రణాళిక వేశాడు. సికింద్రాబాద్‌లోని పాట్‌ మార్కెట్‌ నుంచి బంగారు ఆభరణాలు కొని దుకాణాలకు విక్రయించే స్థానిక వ్యాపారి రాజ్‌కుమార్‌ సురానాను లక్ష్యంగా చేసుకున్నాడు. గతంలో రాజ్‌కుమార్‌ దుకాణంలో పనిచేసిన రామాయంపేటకు చెందిన బన్సీరామ్‌(23) సహకారాన్ని కోరాడు. దీంతోపాటు మహేంద్ర తన భార్య గుడియా జాట్‌, బావమరిది సుమేర్‌ చౌదరి, ఆభరణాల దుకాణంలో పనిచేసే మనీశ్‌ వైష్ణవ్‌(31), పాలకుర్తిలో గతంలో తన దుకాణంలో పనిచేసిన రాజస్థాన్‌కు చెందిన రితేశ్‌వైష్ణవ్‌(32), గజ్వేల్‌కు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ మహ్మద్‌ ఫిరోజ్‌(31), రాజస్థాన్‌, హరియాణాకు చెందిన దోపిడీ దొంగలు సుమిత్‌ దగర్‌, మనీశ్‌, మన్యా సాయం తీసుకున్నాడు. ప్రణాళిక ప్రకారం బన్సీరామ్‌ అక్టోబరు తొలివారంలో రాజ్‌కుమార్‌ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో రెక్కీ చేశాడు.

అనుసరించి.. తుపాకీ ఎక్కుపెట్టి: డిసెంబరు 1న మధ్యాహ్నం 2 గంటల సమయంలో 3 కిలోల బంగారు ఆభరణాలతో వ్యాపారి రాజ్‌కుమార్‌, తన సహాయకుడు సుఖరామ్‌తో కలిసి సికింద్రాబాద్‌ పాటు మార్కెట్‌ నుంచి బయల్దేరాడు. మన్యా, బన్సీరామ్‌, సుమిత్‌ దగర్‌, మనీశ్‌ ద్విచక్రవాహనాలపై వారిని అనుసరించారు. రాత్రి 8 గంటల సమయంలో నాగోల్‌ స్నేహపురి కాలనీలోని జ్యుయెలరీకి చేరుకున్నారు. దుకాణం యజమాని కళ్యాణ్‌ చౌదరికి వారు ఆభరణాలు చూపిస్తుండగా సుమిత్‌ దగర్‌, మనీష్‌ దుకాణంలోకి చొరబడ్డారు. సుమిత్‌ తుపాకీతో కాల్చగా కళ్యాణ్‌ చౌదరి, సుఖరామ్‌కు గాయాలయ్యాయి. 2.74 కిలోల బంగారం, రూ.2.63లక్షలతో ఉన్న సంచిని లాక్కొని పారిపోయారు. ప్రధాన సూత్రధారి మహేంద్ర, ఫిరోజ్‌తో కలిసి ఉప్పల్‌లోని ఓ బార్‌లో ఉంటూ దోపిడీనంతా అంతా పర్యవేక్షించాడు. సుమిత్‌, మనీశ్‌, మన్యాతో మహేంద్ర నిర్మల్‌ మీదుగా కారులో పారిపోయాడు.

చలానాతో దొరికిపోయి : దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సీసీపుటేజీల్లో బన్సీరామ్‌ తెల్లచొక్కా ధరించి కనిపించాడు. దోపిడీకి ముందు రాజ్‌కుమార్‌ ఎక్కడెక్కడ తిరిగాడో శోధించగా.. వారి వెంట యాక్టివాపై బన్సీలాల్‌ అనుసరించాడు. సరిగ్గా దోపిడీకి మూడు గంటల ముందు వాహనం నంబరు ప్లేటు తీసేశాడు. దీని ఆధారంగా కొన్ని గంటల కిందటి ఫుటేజీలు తీయగా వాహనం నంబరు దొరికింది. దానిపై చలానాలు ఉన్నాయోమేనని చూడగా.. రామాయంపేట దగ్గర తెల్లచొక్కాతో బన్సీరామ్‌ ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాడు. ఈ వివరాల ఆధారంగా తొలుత బన్సీరామ్‌ను అదుపులోకి తీసుకోగా మొత్తం గుట్టుబయటపడింది. మహేంద్ర, సుమిత్‌, మనీశ్‌, మన్యా రాజస్థాన్‌, హరియాణా వెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు.. వారి కోసం 15 బృందాలతో వేెటాడుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు