logo

కూల్చివేత పనులు నేటి నుంచే

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ను కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది.

Published : 25 Jan 2023 01:47 IST

గల్లంతైన ముగ్గురి ఆచూకీపై దొరకని సమాధానం

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ను కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఒక రోజు గడువు, రూ.33.86లక్షల అంచనాతో టెండరు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు బుధవారం ఉదయం 10.30గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం గుత్తేదారు సంస్థను ఎంపిక చేస్తామని బల్దియా స్పష్టంచేసింది. దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురి వివరాలపై మాత్రం స్పష్టత రాలేదు. ఇది వచ్చాకే భవనం కూల్చాలని భావించినా, ఆ లోపే కూలిపోతే మరింత నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరించారు. ఆచూకీ లేని వ్యక్తుల కుటుంబీకులను ఒప్పించి, బుధవారం సాయంత్రం నుంచి కూల్చివేత ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.

బలహీనంగా నిర్మాణం

రెండు సెల్లార్లు, ఆరు అంతస్తుల దక్కన్‌ మాల్‌లోని మొదటి సెల్లార్‌లో జనవరి 19న మంటలు చెలరేగాయి. ముగ్గురు గల్లంతయ్యారు. రెండ్రోజులకు మంటలు ఆరిపోయాయి. పోలీసులు తనిఖీచేయగా.. మొదటి అంతస్తులో కాలిన ఎముకల అవశేషాలు లభించాయి. డీఎన్‌ఏ పరీక్ష కోసం అవశేషాలను నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాల(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపారు. నివేదికకు వారం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని