logo

రోగులిక్కడ.. చోటెక్కడ?

ఇది గాంధీలో గైనిక్‌ వార్డు. ఇక్కడ 250 పడకలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతల తాకిడి మాత్రం అందుకు రెండు రెట్లు అధికంగా ఉంటోంది. వేరే దారి లేక ఒక్కో పడకను ఇద్దరికి కేటాయిస్తున్నారు. అదే సమయంలో కొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Published : 28 Jan 2023 02:33 IST

ప్రభుత్వ  ఆసుపత్రుల్లో పడకలు లేక పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌

ఇది గాంధీలో గైనిక్‌ వార్డు. ఇక్కడ 250 పడకలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతల తాకిడి మాత్రం అందుకు రెండు రెట్లు అధికంగా ఉంటోంది. వేరే దారి లేక ఒక్కో పడకను ఇద్దరికి కేటాయిస్తున్నారు. అదే సమయంలో కొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఇది ఉస్మానియాలోని తరచూ ఎదురయ్యే పరిస్థితి. జనరల్‌ సర్జరీ, మెడిసిన్‌, ఇతర కొన్ని విభాగాల్లో రద్దీ ఉంటోంది. పడకలు మాత్రం అందుకు తగ్గట్టుగా అందుబాటులో లేదు. ఇదే ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ, ఇతర కొన్ని విభాగాల్లో పడకలు అందుబాటులో ఉంటున్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న విభాగాల్లో పడకలు సరిపోక.. అత్యవసర సమయంలో రోగులను నేలపై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని విభాగాల్లో పడకల సర్దుబాటు విషయంలో సరైన విధానం లేకపోవడం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని విభాగాల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటే.. మరికొన్ని విభాగాల్లో పడకలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. రద్దీ ఉన్న వార్డుల్లో పడకలు దొరకక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ, ఉస్మానియాతో పాటు నిమ్స్‌కు రోగుల తాకిడి భారీగా ఉంటోంది.  నిత్యం సరాసరి 5-6 వేల వరకు ఓపీ ఉంటోంది. 1- 2 వేల మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. రద్దీగా ఉండే విభాగాల్లో పడకలు చాలక.. నానా అగచాట్లు పడుతున్నారు. ఇటీవలి వరకు నిమ్స్‌లో పడక దొరకాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇటీవలే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో కొంత వెసులుబాటు వచ్చింది. ఉస్మానియాలో మొత్తం 42 వార్డుల్లో 1,652 పడకలు ఉన్నాయి. ఇందులో జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజీ, న్యూరో, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ విభాగాల్లో రద్దీ ఉంటోంది. గతంలో కొవిడ్‌ సందర్భంగా ఇక్కడ 40 పడకలు ఐసోలేషన్‌ కోసం కేటాయించారు. ప్రస్తుతం ఆ పడకలు ఖాళీగా ఉంటున్నాయి. గాంధీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ 27 విభాగాల్లో సగం విభాగాల్లోనే రోగుల రద్దీ ఉంటోంది. నిమ్స్‌లోనూ కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థ్రోపెడిక్‌, రుమాటాలజీ, హెమటాలజీ, అంకాలజీ విభాగాలు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఇక్కడ అదనపు పడకలు అవసరముంది.

సేవల్లో జాప్యం.. రద్దీకి కారణం

గతంలో నిమ్స్‌ అత్యవసర విభాగంలో అవసరం లేకున్నా ఒక్కో రోగి 2-3 రోజుల పాటు ఉండిపోవడంతో ఇబ్బందులు వచ్చేవి. ప్రస్తుతం అక్కడ సమన్వయం చేయడంతో పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇతర విభాగాల్లోనూ ఇదే విధానం చేపడితే పడకల కొరతను అధిగమించొచ్చు. ప్రైవేటులో పడకల ఆడిటింగ్‌ పక్కాగా ఉంటుంది. రద్దీ లేని విభాగాల్లో పడకలను వేరు చేసి ఇతర రోగులకు కేటాయిస్తుంటారు. అయితే ప్రభుత్వంలో పడకలు.. మెడికల్‌ సీట్లతో ముడిపడి ఉండటంతో.. ఇతర విభాగాలకు కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వైద్యులు, పరిపాలన సిబ్బంది సమన్వయంతో ముందుకుసాగితే ఇబ్బందులు తప్పుతాయని నిపుణులు చెబుతున్నాయి. ఎప్పుటికప్పుడు రోగుల పరిస్థితిని పరిశీలించి డిశ్చార్జి చేయడం.. లేదంటే ఇతర వార్డులకు మార్చడం వల్ల రద్దీ విభాగాల్లో పడకలు అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఆర్‌ఎంవోలు ఎప్పటికప్పుడు ప్రతి వార్డును పరిశీలించి వైద్యులతో సమన్వయం చేసుకుంటే పడకల పాట్లు తప్పుతాయని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని