logo

ఉత్పత్తులకు విరామం.. కాలుష్యం నుంచి ఉపశమనం

తాండూరు మండలం బెల్కటూరులోని పెన్నా సిమెంట్స్‌ కర్మాగారంలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. తొలుత మరమ్మతులకు గురవడంతో కార్యకలాపాలు ఆగిపోయాయి.

Published : 03 Feb 2023 01:42 IST

దుమ్ముకు దూరంగా కరణ్‌కోట మార్గం

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: తాండూరు మండలం బెల్కటూరులోని పెన్నా సిమెంట్స్‌ కర్మాగారంలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. తొలుత మరమ్మతులకు గురవడంతో కార్యకలాపాలు ఆగిపోయాయి. మరమ్మతులు పూర్తయ్యాక క్లింకర్‌ నిల్వలు నిండుకున్నాయి. దీంతో కొంతకాలంగా ఉత్పత్తులు చేసే వీలు లేకపోయింది. పనులు సాగుతుంటే ప్రతిరోజు కరణ్‌కోట మైనింగ్‌ ప్రాంతం నుంచి ఇరవైకిపైగా టిప్పర్లు  ముడిసరకును కర్మాగారానికి చేరవేసేవి. దీంతో కరణ్‌కోట మార్గంలో ఐదు కిలోమీటర్ల వరకు టిప్పర్లు రయ్‌మంటూ దూసుకెళ్లేవి. ఒక్కో టిప్పరులో 20 నుంచి 40టన్నులకుపైగా సున్నపురాయి ముక్కలను ఎగుమతి చేసేవారు.

రాకపోకలకు అవస్థలు

వాహనాలు తిరగడంతో రహదారిపై గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడాల్సి వచ్చేది. ముడిసరకు తరలించే సమయంలో పై భాగంలో తాడిపత్రిని కప్పి ఉంచాల్సి ఉన్నా అమలు చేయకపోవడంతో గుంతలు, వేగ నిరోధకాల వద్ద కుదుపులతో సున్నపు రాయి ముక్కలు కిందపడి దుమ్ము కాలుష్యం వెలువడేది. ఫలితంగా ఓగీపూర్‌, కరణ్‌కోట, చంద్రవంచ, చిట్టిగణాపూర్‌, బెల్కటూరు గ్రామస్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాజాగా కర్మాగారంలో కార్యకలాపాలు నిలిచిపోవడంతో టిప్పర్లలో ముడిసరకు తరలింపులు ఆగిపోయాయి. దీంతో బెల్కటూరు నుంచి కరణ్‌కోట వరకు రహదారి కాలుష్య రహితంగా దర్శనమిస్తోంది. టిప్పర్ల తిరగక దుమ్ములు కాలుష్యం నుంచి ఉపశమనం లభించిందంటూ వాహనదారులు, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని