logo

గాలిని వడకట్టేద్దాం..

దుమ్ము, ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగతో గాలి కలుషితమవుతోంది. ఇది పలు అనారోగ్య సమస్యలకూ కారణమవుతోంది.

Published : 20 Mar 2023 02:27 IST

కాలుష్యాన్ని తగ్గించేందుకు  కొత్త ప్రయోగం
జేఎన్‌టీయూ ఆచార్యుల పరిశోధన
ఈనాడు, హైదరాబాద్‌

గాలిశుద్ధి యంత్రం

దుమ్ము, ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగతో గాలి కలుషితమవుతోంది. ఇది పలు అనారోగ్య సమస్యలకూ కారణమవుతోంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ఫ్రొఫెసర్‌ కె.ఎం.లక్ష్మణ్‌రావు వాయు కాలుష్యాన్ని తగ్గించే గాలి శుద్ధి యంత్రాన్ని రూపొందించారు. దీంతో ఇంటా.. బయట శుద్ధి చేసుకోవచ్చు. వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ మోనాక్సైడ్‌,కార్బన్‌డైయాక్సైడ్‌, హైడ్రోజన్‌, సల్ఫర్‌ వంటి రసాయనాల తీవ్రతను ఈ యంత్రం ద్వారా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇళ్లు, రూఫ్‌టాప్‌లు, పరిశ్రమల ప్రాంగణాలు, బస్‌ టెర్మినల్స్‌లోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్రం ద్వారా కలుషితమైన గాలిని లోపలికి పంపిస్తే 65 శాతం శుద్ధి జరిగి బయటకు వస్తుందని లక్ష్మణ్‌రావు చెబుతున్నారు.

పనితీరు ఇలా.. : * బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన ప్రాంతాల్లో గాలిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండు మీటర్ల పొడవు, వెడల్పు, మూడుమీటర్ల ఎత్తు ఉంటే సరిపోతుంది. ఒక బ్లోయర్‌, 100 సక్కర్ల (పీల్చుకునేవి) ద్వారా కలుషిత గాలి లోపలికి వెళ్తుంది. అందులోని మిటిగేటర్స్‌ జీవ, రసాయన, భౌతిక చర్యలను గాలిపైకిప్రయోగిస్తాయి. కార్బన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రోజన్‌, సల్ఫేట్‌, ధూళి కణాలను శుభ్రపరుస్తాయి.
* 500 చ.మీ.ల పరిధిలోని గాలిని సక్కర్ల ద్వారా యంత్రం లోపలికి పంపిస్తే శుద్ధి చేసి కింద ఉన్న గొట్టం ద్వారా బయటకు వదులుతుంది. ఇలా 12 నుంచి 15 గంటల్లో 500 చ.మీ. (అరకిలోమీటర్‌) పరిధిలో గాలి శుభ్రంగా మారుతుంది. ఇదంతా ఎలక్ట్రానిక్‌ సెన్సార్‌ విధానం ద్వారా జరుగుతుంది. సహజ సిద్ధంగా లభ్యమయ్యే ప్రాణవాయువుకు ఇది ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.


పరిశీలనలో పేటెంట్‌ దరఖాస్తు..

- కె.ఎం.లక్ష్మణ్‌రావు, ప్రొఫెసర్‌,.హైదరాబాద్‌ జేఎన్‌టీయూ.

గాలిశుద్ధి యంత్రం (సెట్టర్స్‌, మిటిగేటర్స్‌) పనితీరు మా బృందానికి సంతృప్తి కలిగించింది. ఇప్పటివరకు ఈ తరహా యంత్రాన్ని ఎవరూ తయారు చేయలేదు. అందుకే పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయగా.. పరిశీలనలో ఉంది. 15 కిలోల బరువుండే దీని తయారీకి రూ.9 లక్షలు ఖర్చయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని