logo

అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి

అగ్ని ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.  

Published : 20 Mar 2023 02:27 IST

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ లోపల పరిశీలిస్తున్నకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అగ్ని ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.  స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు వేయడం తప్ప వాటి నివారణకు ప్రభుత్వం కృషిచేయడం లేదని విమర్శించారు. అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ ప్రోత్సహిస్తూ క్రమబద్ధీకరణ పేరుతో ఖజానా నింపుకొనేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎంకు లేఖ రాశానని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, ఫైర్‌, విద్యుత్తు విభాగాలతో కమిటీ నియమించి పురాతన భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, గోదాములను తరచూ తనిఖీ చేయాలని, దీనిపై సీఎస్‌కు లేఖ రాస్తానని చెప్పారు. కమిటీలో నిజాయతీ గల అధికారులను నియమించి అవినీతికి తావులేకుండా ప్రమాదకర భవనాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జనావాసాల మధ్య తుక్కు గోదాములు ఉంచొద్దని, పాత అపార్టుమెంట్లలో ప్రమాదాల నివారణకు సదుపాయాలు లేవన్నారు. ప్రమాద విషయం తెలియగానే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి మృతులకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటింపచేశానని చెప్పారు. విద్యుదాఘాతం జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ఫైర్‌, విద్యుతుశాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉద్యోగాల కోసం కంపెనీలు అక్రమ షరతులు పెడితే.. తన వద్దకు రావాలన్నారు. కార్పొరేటర్లు సుచిత్ర, దీపిక, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, బండ కార్తికరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని