logo

సొమ్ము పోయాక లబోదిబో

ఇంగ్లిషు, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ, ఖరీదైన కార్లు, సెల్‌ఫోన్లు, చుట్టూ నలుగురైదుగురు అనుచరులతో బిల్డప్‌ ఇస్తారు. కార్పొరేట్‌ కార్యాలయాల్లో కూర్చొని చక్రం తిప్పుతారు. వెరసి నమ్మకమే పెట్టుబడిగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

Updated : 01 Jun 2023 04:08 IST

5 నెలల్లో రూ.450 కోట్లు హాంఫట్‌

ఇంగ్లిషు, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ, ఖరీదైన కార్లు, సెల్‌ఫోన్లు, చుట్టూ నలుగురైదుగురు అనుచరులతో బిల్డప్‌ ఇస్తారు. కార్పొరేట్‌ కార్యాలయాల్లో కూర్చొని చక్రం తిప్పుతారు. వెరసి నమ్మకమే పెట్టుబడిగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అలా మధ్యతరగతి కష్టార్జితం క్షణాల్లో మాయమవుతోంది. ఈ ఏడాది 5 నెలల్లో నగర సీసీఎస్‌లో 450 కేసులు నమోదయ్యాయి. రూ.450 కోట్లకుపైగా బాధితులు నష్టపోయినట్టు దర్యాప్తులో తేలింది. ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశ.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అవతలి వారి మాటలకు బోల్తా పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

ఇవీ.. కొన్ని కేసులు..

* సికింద్రాబాద్‌లో వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నట్టు బ్యాంకును నమ్మించిన ఓ వ్యక్తి నకిలీ భూపత్రాలతో టోకరా వేశాడు. రూ.6 కోట్లు రుణం తీసుకొని కొంతకాలం సజావుగా వాయిదాలు చెల్లించాడు. ఆ తరువాత ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయటంతో బ్యాంకర్లు వాస్తవాన్ని గుర్తించారు. మార్ట్‌గేజ్‌ చేసిన పత్రాలు నకిలీవిగా గుర్తించారు.

* బంజారాహిల్స్‌లో ఓ నిర్మాణ సంస్థ తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ రూ.1,200 కోట్లు కాజేసింది.

* తార్నాకలో ఉండే ఒక మహిళ ట్రేడింగ్‌ సంస్థ ప్రారంభించి గృహిణులు, ఉద్యోగినులతో మాట కలిపి తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.2.50 వడ్డీ చొప్పున లాభం వస్తుందంటూ 15 మంది నుంచి రూ.90 లక్షలు వసూలు చేసింది.

* కాచిగూడకు చెందిన ఓ ఉద్యోగికి మేడ్చల్‌లో ఫ్లాటు ఇప్పిస్తానంటూ ఓ స్థిరాస్తి సంస్థ రూ.60 లక్షలు వసూలు చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిర్వాహకులు కాలయాపన చేస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు వ్యాపార సంస్థకు ఎటువంటి భూముల్లేవని నిర్దారించారు. ఈ సంస్థ ప్రకటనలు నమ్మి సొమ్ము చెల్లించిన వారిలో 50 మంది ఐటీ నిపుణులు సైతం ఉన్నట్లు గుర్తించారు.

వారాలంటూ వాయిదాలు

ఉద్యోగం, వ్యాపారం, ట్రేడింగ్‌,    పెట్టుబడుల పేరుతో అధికమోసాలు జరుగుతున్నట్టు సీసీఎస్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. తాము సొమ్ము చెల్లించామనేందుకు బాధితులు సరైన ఆధారాలు చూపలేకపోతున్నారు. నగదు చెల్లింపుల్లో 10 శాతం మాత్రమే ఆన్‌లైన్‌ లావాదేవీలుంటున్నాయి. 90 శాతం నగదే ఇస్తున్నారు. 2020లో రూ.30 లక్షలు నష్టపోయిన బాధితుడు మూడేళ్ల తరువాత సీసీఎస్‌ పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా అప్పటికే సొమ్మంతా ఖర్చయిపోయిందంటూ నిందితులు చేతులెత్తేశారు. రూ.వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులు ఇవ్వ లేని వడ్డీ ఎవరు.. ఎందుకు ఇస్తారనే కోణంలో ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని