logo

పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం

భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.

Published : 19 Apr 2024 02:53 IST

బాబాగూడ(శామీర్‌పేట), న్యూస్‌టుడే: భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది. కొడుకును బీ.టెక్‌ వరకు చదివించింది..ఆ యువకుడు ఓప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నా.. రెండు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం కలత చెందింది. ఆర్థికంగా సతమతమయ్యింది..చివరికి తల్లీ చెల్లిని పోషించలేక పోతున్నానని గురువారం సాయంత్రం ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..శామీర్‌పేట మండలం బాబాగూడ గ్రామానికి చెందిన కాసాల సంపత్‌గౌడ్‌(23) హైటెక్‌ సిటీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి చెల్లి శ్రీలతతో తల్లి,తాత ఉంటారు. ఇటీవల తాత మృతితో విధులకు వెళ్లకపోవటం, చేసిన పనికి రెండు నెలలుగా జీతాలు రాకపోవటంతో ఇంట్లో సరకులు తెచ్చుకోలేకపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేక పోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి తన ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే ఇప్పుడే వస్తున్నానంటూ తల్లిలో మాట్లాడిన సంపత్‌..  శామీర్‌పేటలోని సెయింట్‌ పాల్‌ పాఠశాల సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లీ చెల్లి సాయంత్రం ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన సమాధానం రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించడం స్థానికులను కలిచి వేసింది.


ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

నవాజ్‌ , అయాన్‌

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: క్వారీ గుంతలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ క్రాంతికుమార్‌ వివరాల ప్రకారం...ఎల్లమ్మబండ పరిధి ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌గౌస్‌ కుమారుడు అయాన్‌(15), షేక్‌సయ్యద్‌ కొడుకు నవాజ్‌(16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. అయాన్‌ బైక్‌ సర్వీస్‌ సెంటర్‌ కూడా నిర్వహిస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం మరో స్నేహితుడు హైదర్‌తో కలిసి వారు మిథులానగర్‌ సమీపంలోని క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు అయాన్‌, నవాజ్‌ నీటిలో మునిగి గల్లంతయ్యారు. వెంటనే హైదర్‌ మిథులానగర్‌ వెళ్లి స్థానికులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఎన్టీఆర్‌నగర్‌ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. సాయంత్రం 6 గంటలకు స్థానికులు నీటిలోంచి వారిని బయటకు తీశారు. బాచుపల్లి ఎస్సై మహేష్‌ సీపీఆర్‌ చేసినా ఫలితం లేదు.


కుక్కల దాడిలో జింక మృత్యువాత

పరిశీలిస్తున్న పోలీసులు

కొత్తూరు: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన కొత్తూరు మండలం మక్తగూడలో గురువారం జరిగింది. మక్తగూడలోకి తెల్లవారుజామున శంషాబాద్‌ శివారు నుంచి ఓ జింక వచ్చింది. దాన్ని చూసిన కుక్కలు వెంటాడి తీవ్రంగా గాయపరిచాయి. సమాచారమందుకున్న పోలీసులు జింకను పరిశీలించగా అప్పటికే మృతిచెందింది. శంషాబాద్‌ అటవీశాఖ అధికారులకు సమాచారమందించి జింక కళేబరం అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.  


ఎండకు తాళలేక నెమలి..

చనిపోయిన నెమలిని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: భానుడి భగభగలతో పక్షులు అల్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ నెమలి ప్రాణాలు విడిచింది. ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో కొన్నాళ్లుగా నాలుగైదు నెమళ్లు సంచరిస్తున్నాయి. తరచూ ఆహారం, నీటి కోసం సమీప ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్‌ కాలనీలోకి వెళ్తుంటాయి. గురువారం ఉదయం ఒక నెమలి ఓ ఇంటిపైకి చేరింది. రేకులపై రెక్కలు కొట్టుకుంటూ పడిపోగా ఇంట్లోనివారు వెళ్లి చూశారు. వెంటనే కిందకు తీసుకొచ్చి నీరు తాగించి సపర్యలు చేసినా.. ప్రాణాలు విడిచింది. జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియజేయగా, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ జ్యోతి జీహెచ్‌ఎంసీ సిబ్బందితో చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు.


మహిళను బెదిరించి అత్యాచారం

పోచారం(ఘట్‌కేసర్‌)న్యూస్‌టుడే: బిహార్‌ నుంచి ఉపాధికి వెదుక్కుంటూ వస్తే.. భర్త వదిలేశాడు. దినసరి కూలీగా పని చేస్తూ నలుగురు పిల్లలను పోషిస్తోంది. ఆ మహిళపై ఓ రౌడీషీటర్‌ కన్నేశాడు. బెదిరించి అత్యాచారం చేశాడు. పోచారం ఐటీకారిడార్‌ సీఐ బి.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం..బిహార్‌కు చెందిన మహిళ(30) అన్నోజిగూడలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఘట్‌కేసర్‌లో ఓ హోటల్‌లో పనిచేస్తోంది. కొంత కాలంగా అన్నోజిగూడకు చెందిన లారీ డ్రైవర్‌, రౌడీషీటర్‌ ఉమేష్‌నాయక్‌(22) ఆమె వెంట పడుతూ వేధిస్తున్నారు. ఈ నెల 16న రాత్రి ఘట్‌కేసర్‌లో పని ముగిసిన తర్వాత.. ఇంటికి వెళ్తున్న సమయంలో ఉమేష్‌ వచ్చి బెదిరించాడు. బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని వెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు. బుధవారం రాత్రి బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించామని సీఐ పేర్కొన్నారు.


మనోవేదనతో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య ఘటన జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. సీఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పాలెం కాలనీకి చెందిన కురెమెల్ల శ్రీదేవి, సూర్యారావుల కుమార్తె వైష్ణవి(20) దుండిగల్‌లోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. సూర్యారావు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో తల్లితోపాటు వైష్ణవి విజయ్‌నగర్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. తండ్రి చనిపోయినప్పటి నుంచి వైష్ణవి ఎవరితో మాట్లాడకుండా తరచూ బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తరచూ తలనొప్పి వస్తుండడంతో చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 17న శ్రీరామనవమి సెలవు ఉండడంతో ఇంట్లోనే ఉంది. సాయంత్రం 6 గంటలకు తల్లి వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికిరాగా బాత్రూంలో నల్లా ఓపెన్‌ చేసి ఉండటంతో కూతురు స్నానం చేస్తోందని భావించింది. ఎంతకూ ఆమె రాకపోవడంతో స్థానికుల సహాయంతో బెడ్‌రూం తలుపులు బద్దలు కొట్టి చూడగా వైష్ణవి చీరకొంగుతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కిందికి దించి చూడగా అప్పటికే చనిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె చరవాణిని పరిశీలించగా.. ‘నేను చేసిన ఈ పనికి ఎవరూ కారణంకాదు, నాన్న లేకుండా బతకడం కష్టంగా ఉంది’ అని ఉంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


బాలికకు లైంగిక వేధింపులు.. యువకుడికి 20 ఏళ్ల జైలు

నల్లకుంట, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు వివరాలను నల్లకుంట సీఐ జదీశ్వర్‌రావు వెల్లడించారు. జియాగూడకు చెందిన నితీష్‌సింగ్‌(20).. 2018లో నల్లకుంట ఠాణా పరిధిలో నవసించే బాలిక(17)ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అనంతరం ఆమె కుటుంబికుల ఫిర్యాదుతో అతడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు(పోక్సో)లో.. కేసుపై వాదోపవాదనలు కొనసాగాయి. స్పెషల్‌ సెషన్స్‌ జడ్జి పుష్పలత.. నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారని సీఐ వెల్లడించారు.


చనిపోతున్నా అంటూ యువకుడు సెల్ఫీ వీడియో

ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులు

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, న్యూస్‌టుడే: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌ పరిసర ప్రాంతంలో శీతల పానీయంలో పురుగుమందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్న సెల్ఫీ వీడియో గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అతడి బంధుమిత్రులు, యువకుడు వీడియోలో చెప్పిన వివరాలిలు.. షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు బుడ్డనోళ్ల రాజు కూలీ. ఇటీవల అతను ద్విచక్రవాహనం నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టగా ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందడంతో మృతుడి సంబంధీకులు తనను కొట్టి నగదు తీసుకున్నారని రాజు వీడియోలో వివరించాడు. నష్టపరిహారం తీసుకున్నాక కూడా తరచూ బెదిరిస్తున్నారని, దీనిపై తన తండ్రి తిడుతుండడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని అతను చెప్పాడు. రాజు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో అందరూ గాలిస్తున్నారు.


హెచ్‌సీయూలో విద్యార్థుల ఘర్షణ

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హెచ్‌సీయూలో  బుధవారం అర్ధరాత్రి విద్యార్థులు ఘర్షణకు దిగారు. జే హాస్టల్‌ సమీపంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ సభ్యులు చిన్న విషయమై దాడులకు దిగడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. గచ్చిబౌలి పోలీసులు వచ్చా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఓ వర్గానికి చెందిన బాలకృష్ణ, మరో వర్గానికి చెందిన హఫీజ్‌ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. క్యాంపస్‌ లో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.


కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాహిల్‌

ఈనాడు, హైదరాబాద్‌: పంజాగుట్ట వద్ద వాహనంతో బారికేడ్లను ఢీకొట్టిన కేసులో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. రాహిల్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, చిన్న ప్రమాదం కేసును పోలీసులు తీవ్రతరం చేస్తూ 13మంది దాకా నిందితులను చేర్చుతూ వెళ్లారన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ విదేశాల నుంచి వచ్చిన పిటిషనర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారని, కిందికోర్టు బెయిలు మంజూరుచేసిందని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తు నిలిపివేతకు నిరాకరిస్తూ పోలీసులకు నోటీసులు జారీచేశారు. విచారణను జూన్‌ 11కు వాయిదా వేశారు. మరో నిందితుడైన నాని వేసిన పిటిషన్‌లోనూ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.


ఎన్నికల విధులపై నిర్లక్ష్యం.. 10 మందిపై కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల విధులపై నిర్లక్ష్యం వహిస్తూ శిక్షణకు గైర్హాజరైన 10 మందిపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ చర్యలు తీసుకున్నారు. సైఫాబాద్‌ ఠాణాలో ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్‌ 134 ప్రకారం క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు బల్దియా గురువారం ప్రకటించింది. సహకారశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ ఇలియాస్‌ అహమ్మద్‌, ఓయూ సీనియర్‌ అసిస్టెంట్‌ జి.రవి, సహాయ ఆచార్యుడు డా.జె.కృష్ణయ్య, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ మజీద్‌ఖాన్‌, ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మీర్జా నసీర్‌ బేగ్‌, పంజాగుట్ట డివిజన్‌ వాణిజ్య పన్నుల శాఖ డీఎస్‌టీఓ కె.నాగరాజు, కె.మధుసూదన్‌ కుమార్‌, బార్కస్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు సయ్యద్‌ అబ్దుల్లా జుబేర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కె.మహేశ్‌, రోడ్లు భవనాలశాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ చిలివేరి శంతన్‌కుమార్‌లపై మొదటి దశ కింద కేసు నమోదు చేశామని, మరిన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని రోనాల్డ్‌రాస్‌ వెల్లడించారు. గతంలో శిక్షణకు హాజరుకాని వారికి ఈ నెల 20న మళ్లీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని