logo

ఉద్యమాలకు ఊపిరి..వ్యవసాయానికి కేంద్ర బిందువు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన జగిత్యాల శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు కాంగ్రెస్‌ గెలుపొందగా, నాలుగుసార్లు తెదేపా గెలుచుకుంది. స్వతంత్రులు, ఎన్‌సీఎఫ్‌, తెరాస ఒక్కోసారి గెలుపొందాయి.

Published : 02 Nov 2023 04:17 IST

న్యూస్‌టుడే, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన జగిత్యాల శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు కాంగ్రెస్‌ గెలుపొందగా, నాలుగుసార్లు తెదేపా గెలుచుకుంది. స్వతంత్రులు, ఎన్‌సీఎఫ్‌, తెరాస ఒక్కోసారి గెలుపొందాయి. గతంలో జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల నియోజకవర్గంలో ఉండగా పునర్విభజనలో భాగంగా 1999లో మల్యాల, కొడిమ్యాల మండలాలను చొప్పదండి నియోజకవర్గంలో కలిపి బుగ్గారం నియోజకవర్గంలోని రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాలను జగిత్యాలలో కలిపారు. ప్రస్తుతం జగిత్యాల పట్టణంతోపాటు అర్బన్‌, రూరల్‌ మండలాలు, సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లో కలిపి నియోజకవర్గంలో 2,26,635 మంది ఓటర్లున్నారు.

పీపుల్స్‌వార్‌, మావోయిస్టు ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన జగిత్యాల నియోజకవర్గం వాణిజ్య, వ్యవసాయ రంగాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. డివిజన్‌ కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రంగా మారింది. నియోజకవర్గంలో ఇది వరకే పొలాసలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ కళాశాల, పాలిటిక్నిక్‌, చల్‌గల్‌లో వ్యవసాయ సందర్శనాక్షేత్రం, మామిడి మార్కెట్‌ ఉండగా నూకపల్లి అర్బన్‌కాలనీలో నిరుద్యోగ యువతకు శిక్షణిచ్చేందుకు న్యాక్‌ కేంద్రం ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా మారటంతో వైద్య కళాశాల ఏర్పాటైంది. సమీకృత కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణం జరిగింది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల సుమారు 200 గ్రామాలకు వైద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారింది. పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు వ్యాపారం, వైద్య అవసరాలకు జిల్లా కేంద్రానికి వస్తుంటారు.

పదిసార్లు గెలిచిన కాంగ్రెస్‌

జగిత్యాల నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా 1952లో జరిగిన ద్విసభకు ఎన్‌సీఎఫ్‌, పీడీఎఫ్‌ అభ్యర్థులు గెలుపొందగా ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో 10 సార్లు కాంగ్రెస్‌, నాలుగుసార్లు తెదేపా గెలువగా ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గత ఎన్నికల్లో తొలిసారి తెరాస గెలిచింది. 1952లో ఇక్కడ గెలిచిన బుట్టి రాజారాం 1957లో సుల్తానాబాద్‌, 1962లో పెద్దపల్లి, 1967లో నుస్తులాపూర్‌లో గెలుపొందారు. 1972లో గెలుపొందిన వి.జగపతిరావు 1989లో కరీంనగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1962లో ఎం.ధర్మారావు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా 1967లో కాసుగంటి లక్ష్మినర్సింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1994లో గెలుపొందిన ఎల్‌.రమణ 1996లో లోక్‌సభకు ఎన్నిక కాగా ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 1957లో గెలుపొందిన హన్మంతరావు మెట్‌పల్లికి చెందిన వారు కాగా 1978లో గెలుపొందిన సురేందర్‌రావు మల్లాపూర్‌ మండలానికి చెందిన వారు. నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో జీవన్‌రెడ్డి, రాజేశంగౌడ్‌, ఎల్‌.రమణ మంత్రులుగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గానికి 1962లో స్వతంత్ర ఎమ్మెల్యేగా ధర్మారావు గెలుపొందిన సమయంలో గుత్తేదారుగా ఉండటంతో అనర్హత వేటు పడగా 1963లో ఉప ఎన్నిక జరిగింది. 1994లో గెలుపొందిన ఎల్‌.రమణ లోక్‌సభకు ఎన్నిక కావటంతో 1996లో ఉప ఎన్నిక జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని